టీటీడీ చైర్మన్ పీఠంపై స్థానికుడా.. స్థానికేతరుడా?
- ఎన్నికలకు ముందే తనకు హామీ ఇచ్చారంటున్న చదలవాడ
- పార్టీ కోసం పనిచేసిన తనకే టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ ‘గాలి’ పట్టు
- తనను టీటీడీ చైర్మన్ చేయాలంటున్న రాయపాటి!
- రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ మంత్రాంగం
టీటీడీ పాలక మండలి అధ్యక్ష పదవి స్థానికులకు దక్కుతుందా? స్థానికేతరులు చేజిక్కించుకుంటారా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వని నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానంటూ రాతపూర్వకంగా చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే చదలవాడ చెబుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన గాలి ముద్దుకృష్ణమనాయుడు పార్టీ కోసం పనిచేసిన తనకే ఆ పదవి దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ పదవి ఇస్తానంటేనే టీడీపీలో చేరానని.. తనకే ఇవ్వాలని నరసరావుపేట ఎంపీ రాయపాటి పట్టుబడుతున్నారు. మరోవైపు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ఆ పదవి కోసం తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీటీడీ సహా అన్ని దేవాలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దాంతో టీటీడీ పాలక మండలి ఖాళీ అయ్యింది. ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవిని చేజిక్కించుకోవడానికి టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి శాసనసభ టీడీపీ టికెట్ కోసం చదలవాడ కృష్ణమూర్తి, ఎం.వెంకటరమణ పోటీపడ్డారు. ఎమ్మెల్యే టికెట్‌ను వెంకటరమణకు ఇచ్చిన చంద్రబాబు.. టీటీడీ చైర్మన్ పదవిని చదలవాడకు ఇస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చినట్లు చదలవాడ వర్గీయులు చెబుతున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు గుంటూరు జిల్లాకు చెం దిన రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్‌లో మూడు దశాబ్దాలపాటు పనిచేశారు. ఎన్నికలకు ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న కాలంలో టీటీడీ చైర్మన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించిన రాయపాటి ఆ పదవిని దక్కించుకోవడం విఫలమయ్యారు. టీడీపీలో చేరే ముందు.. పార్టీ అధికారంలోకివస్తే టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానని రాయపాటికి చంద్రబాబు హామీ ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన రాయపాటి విజయం సాధించారు.. నరేంద్రమోడీ మంత్రివర్గంలో టీడీపీ కోటాలో తనకు మంత్రి పదవి దక్కుతుందని భావించారు.
కానీ.. మంత్రి పదవి దక్కకపోవడంతో ఆ వెంటనే చంద్రబాబుతో సమావేశమై టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని తనకు ఇవ్వాలని పట్టుపట్టారు. ఇప్పుడు టీటీడీ పాలక మండలిని రద్దు చేయడంతో తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని రాయపాటి ఓ వైపు.. చదలవాడ మరో వైపు చంద్రబాబుపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. 2009 నుంచి సార్వత్రిక ఎన్నికల వరకూ చంద్రబాబుకు గాలి ముద్దుకృష్ణమనాయుడు వెన్నుదన్నుగా నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుంచి పోటీచేసిన గాలి ఓటమి పాలయ్యారు.
తాను గెలిచి ఉంటే మంత్రివర్గంలో స్థానం దక్కేదని.. ఓడిపోయిన నేపథ్యంలో తనకు టీటీడీ చైర్మన్ పదవిని ఇవ్వాలని చంద్రబాబుపై గాలి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వని పక్షంలో ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి.. మంత్రివర్గంలోకి తీసుకోవాలని గాలి కోరుతున్నారు. ఇక చంద్రబాబు సన్నిహితుడుగా ముద్రపడిన రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ టీటీడీ చైర్మన్ పదవిపై మక్కువ పెంచుకున్నారు.
ఇటీవల 75వ జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మురళీమోహన్ తన మనసులోని మాటను బయటపెట్టారు. టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని దక్కించుకోవడం కోసం చంద్రబాబుపై మురళీమోహన్ తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు చైర్మన్ పదవి స్థానికులకు దక్కుతుందా? స్థానికేతరులకు దక్కుతుందా అన్నది తేలాలంటే మరి కొంత కాలం వేచిచూడక తప్పదు మరి!