మెడికల్ హబ్ దిశగా తిరుపతి! | Medical Hub to Tirupati! | Sakshi
Sakshi News home page

మెడికల్ హబ్ దిశగా తిరుపతి!

Published Fri, Sep 12 2014 1:59 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

Medical Hub to Tirupati!

  •      ఆరు వైద్య కేంద్రాలను అనుసంధానించే యోచన
  •      12 మంది కమిటీతో కీలక నివేదిక
  •      నిర్వహణతోపాటు కీలకపోస్టులో టీటీడీ ఈవో
  •      హబ్ డెరైక్టర్‌పై ఆశలు పెంచుకున్న బర్డ్ డెరైక్టర్
  •      నేడు సీఎం చంద్రబాబు అంగీకారమే తరువాయి
  • తిరుపతి సిటీ: వైద్య రంగంలో తిరుపతి మరో ముందడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఆరు వైద్య కే్రందాలను అనుసంధానిస్తూ కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

    ప్రస్తుతం నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్, బర్డ్, సెంట్రల్ హాస్పిటల్స్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పెత్తనంతో నడుస్తున్న ఎస్వీ వైద్యకళాశాల, రుయా, మెటర్నిటీ హాస్పిటల్స్‌ను ప్రాథమికంగా ఎంపిక చేశారు. మెడికల్ హబ్ ఏర్పాటు కు సంబంధించిన వ్యవహారాలపై రెండు రో జులుగా జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి టీటీడీ ఈవో ఎంజీ గోపాల్‌తోపాటు ఆరు వైద్య కేంద్రాల ప్రధాన అధికారులతో చర్చలు జరుపుతున్నారు. దీనిపై అధికారులు పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు.

    ఆస్పత్రులలో ప్రధానంగా రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, లోపాలను గుర్తించి నివేదిక తయారు చేసేందుకు 12 మందితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. కమిటీలో టీటీడీ ఈవో, జేఈవోలతో పాటు డీఎంఈ, అడిషనల్ జాయింట్ కలెక్టర్, అర్బన్ ఎస్పీ, మున్సిపల్ కమిషనర్, ఎండోమెంట్ కార్యదర్శి, ఆరు విభాగాలకు చెందిన హెచ్‌వోడీలు ఉండేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. ఏర్పాటు కాబోయే మెడికల్ హబ్‌కు టీటీడీ ఈవో చైర్మన్‌గా వ్యవహరించే విధంగా చర్యలు తీసుకోనున్నారు.
     
    శ్రీవెంకటేశ్వర మెడికల్ హబ్..

    కొత్తగా ఏర్పడే మెడికల్ హబ్ ఎక్కువగా టీటీడీ ఆధ్వర్యంలో నడవనున్న నేపథ్యంలో ‘శ్రీవేంకటేశ్వర మెడికల్ హబ్’గా పిలిస్తేనే సార్థకత అవుతుందనే ఉద్దేశంతో అధికారులు ఉన్నట్లు సమాచారం. నేడు తిరుపతికి సీఎం చంద్రబాబు రానున్నారు. దీనిని సీఎం ముందు ఉంచి గ్రీన్ సిగ్నల్ పొందాలనే యోచనలో అధికారులు ఉన్నారు. ఏది ఏమైనా తమను ప్రభుత్వం, టీటీడీ ఇబ్బందులకు గురిచేయకుండా నిధులను సకాలంలో అందించాలని ఆరు వైద్య కేంద్రాలకు చెందిన అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వరుస సమావేశాలలో ఆస్పత్రులకు సంబంధించిన పాత జీవోలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

    ప్రతి 3 నెలలకు వైద్య కేంద్రాలకు అవసరమయ్యే నిధులు ప్రభుత్వం నుంచి రావడం ఆలస్యమైతే వాటిని తొలుత టీటీడీ భరించి ప్రభుత్వ నిధులు వచ్చిన వెంటనే పొందేవిధంగా కమిటీ నిర్ణయించింది. అలాగే పేదరోగుల సహాయార్థం స్విమ్స్ ఆస్పత్రికి అందిస్తున్న విధంగా రుయా, మెటర్నిటీ ఆస్పత్రులకు కూడా టీటీడీ ప్రాణదాన నిధులను అందించేందుకు అంగీకారం తెలపాలని ఎండోమెంట్‌కు నివేదిక పంపాలని కమిటీ నిర్ణయించింది.
     
    బర్డ్ డెరైక్టర్ కోసమే.. అని ప్రచారం

    ప్రస్తుతం బర్డ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న జగదీష్‌కు సీఎం చంద్రబాబుతో సుదీర్ఘ పరిచయం ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నా లేక పోయినా పార్టీకి సంబంధించిన కేడర్‌కు బర్డ్ ఆస్పత్రిలో వైద్యం అవసరమైతే అందుబాటులో ఉంటూ చంద్రబాబుకు మరింత దగ్గరయ్యారు. దీంతో పదేళ్ల తర్వాత బాబు అధికారంలోకి రావడంతో బర్డ్ డెరైక్టర్ చిరకాల కోరిక తీర్చేందుకే మెడికల్ హబ్ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన దిశా నిర్దేశకాలు బర్డ్ డెరైక్టర్ ఇచ్చినవే అనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.

    తాత్కాలిక కమిటీలో కూడా జిల్లా మంత్రి బర్డ్ డెరైక్టర్ ఆలోచన మేరకు నివేదిక సిద్ధం చేయాలని పరోక్షంగా ఆదేశించినట్లు తెలిసింది. ఒక్క బర్డ్ ఆస్పత్రికే డెరైక్టర్‌గా ఇన్నాళ్లు చేశాం.. దీనికంటే పెద్ద పదవి కావాలంటే ఆరు వైద్య కేంద్రాలను కలిపి అందులో డెరైక్టర్‌గా కూర్చోవాలనే ఆలోచనతోనే ఈ కొత్త హబ్ ప్రస్తావన వచ్చినట్లు విమర్శలు ఉన్నాయి. అయితే ఎన్ని హబ్‌లు ఏర్పాటైనా సామాన్యుడికి వైద్యం అందుబాటులోకి తేవాలనే విషయాన్ని పాలకులు విస్మరించకుంటే చాలు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement