ఈ కేన్సరుకు మందులేదా..
► ఆంకాలజీ ఓపీలో పడిగాపులు
► ఫుట్‌పాత్‌లను ఆశ్రయిస్తున్న వైనం
► పట్టించుకోని వైద్యులు..సిబ్బంది
► పరికరాలున్నా అందని సేవలు
తిరుపతి మెడికల్: శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞా న సంస్థ (స్విమ్స్) కేన్సర్ విభాగంలో రోగులకు పడిగాపులు తప్పడం లేదు. స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నా రోగులకవి చేరే పరిస్థితి లేదు. ఆసుపత్రిలోని వైద్య విభాగాల మధ్య సమన్వయం తీసుకురావడంలో విఫలం అవుతున్నారు. ప్రధానంగా కేన్సర్ విభాగంలో ఆంకాలజి, సర్జికల్ ఆం కాలజి, రేడియేషన్ ఆంకాలజి అనే మూడు ఉప విభాగాలున్నాయి.
రూ.12 కోట్లతో పెట్ స్కానింగ్, రూ.14 కోట్లతో వ్యాధి నిర్థారణ పరికరాలు, రూ.1.2 కోట్ల విలువైన రెండు రేడియోథెరపీ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. 80 పడకల సామర్థ్యముంది. రేడియేషన్ ఆంకాలజీకి ఆరోగ్యశ్రీ అనుమతి ఉంది. నిర్ధారించేందుకు ఖరీదైన పరికరాలున్నాయి. రేడియేషన్ థెరపీలోనూ ఆధునిక పరికరాలున్నాయి. మూడు విభాగాలకూ వైద్యాధికారులున్నారు. రెండు విభాగాల్లో ఐదుగురు రెసిడెన్స్ డాక్టర్లు (పీజీ), నలుగురు రేడియో థెరపీ టెక్నీషియన్లు ఉన్నారు. వీరితో పాటు నర్సులు .. సిబ్బంది 50 మంది వరకూ ఉన్నారు. రాయలసీమ పేదలు ఇక్కడికే వస్తుంటారు.
ఇక్కడ సమస్యల్లా వైద్యులు అందుబాటులో ఉండరనేదే. ఇద్దరు విభాగాధిపతుల ఉదాశీనత ఫలితంగా రోగులకు కష్టమేర్పడుతోందని తెలుస్తోంది. సోమవారం రేడియేషన్ థెరపీ కోసం 150 మందికి పైగా రోగులు వెనుదిరిగారు. కారణం డాక్టర్లు లేకపోవడమే. వి«భాగాధిపతులు పట్టనట్టు వ్యవహరించడంతో సేవలకు ఇబ్బంది కలుగుతోందనేది విమర్శ. తమకు పరిపాలనా విభాగంలో ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఇద్దరు విభాగాధికారులు వైద్యసేవలు అందించేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. మరో ప్రాంతానికి బదిలీపై వెళ్లి పోయేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో విధులకు సరిగ్గా రావడం లేదు. దీంతో కింది స్థాయి వైద్యులు, వైద్య సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా సేవలందిస్తున్నారు.
సరిపడని పడకలు
రోజు రోజుకూ పెరుగుతున్న రోగుల సంఖ్యకు తగ్గట్టుగా పడకలు సరిపోవడం లేదు. 300 పడకలు కావాల్సి ఉంది. గతంలో యాజమాన్యం ప్రభుత్వానికి నివేదిక కూడా పంపింది. 300 పడకలతో పాటు వంద మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు కావాలని కోరింది. ప్రభుత్వం స్పందించక పోవడంతో ప్రత్యామ్నాయంగా టీటీడీకి చెందిన సత్రంలో 20 గదులను తీసుకుని రోజూ ప్రత్యేక వాహనంలో రోగులను తరలిస్తున్నారు.