స్విమ్స్ కూడా ‘సీమ’ వాసులకే కాదు
సాక్షి ప్రతినిధి-తిరుపతి: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల సీట్ల భర్తీ వ్యవహారంలో రాయలసీమ వాసుల గొంతుకోసిన రాష్ట్ర ప్రభుత్వం తన పంతం నెగ్గించుకోవడానికి స్విమ్స్ కూడా రాయలసీమది కాదనే వాదన అందుకుంది. ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 28వ తేదీ దాఖలుచేసిన పిటిషన్‌లో స్విమ్స్ రాష్ట్ర యూనివర్శిటీ అనీ, అలాంటప్పుడు దాని ఆధీనంలో నడుస్తున్న శ్రీపద్మావతీ మహిళా వైద్య కళాశాల రాయలసీమ వాసులది మాత్రమే ఎలా అవుతుందనే వాదన లేవదీసింది. మెడిసిన్ సీట్ల వ్యవహారంలోనే తమకు అన్యాయం జరిగిందని పెద్దఎత్తున ఆందోళనకు దిగిన సీమవాసులకు, ఇకపై స్విమ్స్‌లో జరిగే ఉద్యోగ నియామకాల్లో కూడా అన్యాయం చేయడానికి కత్తి సిద్ధమైంది.
శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల.. శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ పరిధిలోకి వస్తుంది. దీని ప్రకారం ఈ కళాశాలలోని 150 సీట్లలో 107 సీట్లు రాయలసీమ, నెల్లూరు వాసులకు కేటాయించాలి. 85 శాతం కోటాకు రాష్ట్ర ప్రభుత్వం 120 జీవోతో కత్తెర వేసింది. ఈ కళాశాలను రాష్ట్ర కళాశాలగా చూపుతూ ఇక్కడి సీట్లను భర్తీ చేయడంతో రాయలసీమ, నెల్లూరు జిల్లాల వాసులు 95 మెడిసిన్ సీట్లు కోల్పోయారు. ఈ సీట్లన్నీ కోస్తా ప్రాంతానికి చెందిన విద్యార్థులకు దక్కాయి.
ఈ అన్యాయంపై రాయలసీమ విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టుకెక్కారు. ప్రభుత్వం జారీచేసిన 120 జీవో రాజ్యాంగ విరుద్ధమైనదనీ, దీన్ని కొట్టేసి తమ ప్రాంతానికి 85 శాతం సీట్లు లభించేలా తిరిగి కౌన్సెలింగ్ జరిపేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును అభ్యర్థించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు జీవో 120 రాజ్యాంగ విరుద్ధమైందిగా తేల్చి రాయలసీమ, నెల్లూరు జిల్లాల విద్యార్థులకు 85 శాతం సీట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రాయలసీమ వ్యతిరేక తీరుపై జనం పెద్ద ఎత్తున ఉద్యమించారు.
ప్రభుత్వ పట్టుదలతో శాశ్వత అన్యాయం
శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల సీట్ల భర్తీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తన పంతం నెగ్గించుకోడానికి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌తో రాయలసీమ వాసులకు శాశ్వతంగా అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడింది. 1995లో స్విమ్స్ యూనివర్శిటీగా ప్రభుత్వం చట్టం చేసింది. దీన్ని ఆయుధంగా వాడుకుని తమ వాదన నెగ్గించుకునే ఎత్తుగడ వేసింది. శ్రీపద్మావతి మెడికల్ కళాశాలే కాదు స్విమ్స్ కూడా రాయలసీమకు మాత్రమే చెందినది కాదనే వాదన లేవదీసింది.
రాయలసీమ, నెల్లూరు జిల్లాల వాసులకు 85 శాతం సీట్లు కేటాయించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టి వేయాలనీ, అలా కాని పక్షంలో తీవ్ర ఇబ్బందులు పడతామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు విన్నవించుకుంది. సుప్రీం కోర్టు ఈ వాదనతో ఏకీభవిస్తే భవిష్యత్తులో స్విమ్స్‌లోను, టీటీడీలో కూడా ఉద్యోగాల భర్తీ విషయంలో రాయలసీమ వాసులకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడుతుంది.
స్విమ్స్‌ను కేవలం రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతోనే దివంగత సీఎం ఎన్‌టీ రామారావు నిర్మింప చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం దీన్ని రాష్ట్రం మొత్తానికి సంబంధించిన సంస్థగా పేర్కొంటూ సుప్రీం కోర్టు కెక్కడంతో భవిష్యత్తులో ఇతర ప్రాంతాల వాసులు చట్టపరమైన వివాదాలు లేవనెత్తేందుకు ప్రభుత్వమే అవకాశం కల్పించింది.