Sri Venkateswara Institute of Medical Sciences
-
స్విమ్స్ కూడా ‘సీమ’ వాసులకే కాదు
సాక్షి ప్రతినిధి-తిరుపతి: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల సీట్ల భర్తీ వ్యవహారంలో రాయలసీమ వాసుల గొంతుకోసిన రాష్ట్ర ప్రభుత్వం తన పంతం నెగ్గించుకోవడానికి స్విమ్స్ కూడా రాయలసీమది కాదనే వాదన అందుకుంది. ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 28వ తేదీ దాఖలుచేసిన పిటిషన్లో స్విమ్స్ రాష్ట్ర యూనివర్శిటీ అనీ, అలాంటప్పుడు దాని ఆధీనంలో నడుస్తున్న శ్రీపద్మావతీ మహిళా వైద్య కళాశాల రాయలసీమ వాసులది మాత్రమే ఎలా అవుతుందనే వాదన లేవదీసింది. మెడిసిన్ సీట్ల వ్యవహారంలోనే తమకు అన్యాయం జరిగిందని పెద్దఎత్తున ఆందోళనకు దిగిన సీమవాసులకు, ఇకపై స్విమ్స్‌లో జరిగే ఉద్యోగ నియామకాల్లో కూడా అన్యాయం చేయడానికి కత్తి సిద్ధమైంది. శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల.. శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ పరిధిలోకి వస్తుంది. దీని ప్రకారం ఈ కళాశాలలోని 150 సీట్లలో 107 సీట్లు రాయలసీమ, నెల్లూరు వాసులకు కేటాయించాలి. 85 శాతం కోటాకు రాష్ట్ర ప్రభుత్వం 120 జీవోతో కత్తెర వేసింది. ఈ కళాశాలను రాష్ట్ర కళాశాలగా చూపుతూ ఇక్కడి సీట్లను భర్తీ చేయడంతో రాయలసీమ, నెల్లూరు జిల్లాల వాసులు 95 మెడిసిన్ సీట్లు కోల్పోయారు. ఈ సీట్లన్నీ కోస్తా ప్రాంతానికి చెందిన విద్యార్థులకు దక్కాయి. ఈ అన్యాయంపై రాయలసీమ విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టుకెక్కారు. ప్రభుత్వం జారీచేసిన 120 జీవో రాజ్యాంగ విరుద్ధమైనదనీ, దీన్ని కొట్టేసి తమ ప్రాంతానికి 85 శాతం సీట్లు లభించేలా తిరిగి కౌన్సెలింగ్ జరిపేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును అభ్యర్థించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు జీవో 120 రాజ్యాంగ విరుద్ధమైందిగా తేల్చి రాయలసీమ, నెల్లూరు జిల్లాల విద్యార్థులకు 85 శాతం సీట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రాయలసీమ వ్యతిరేక తీరుపై జనం పెద్ద ఎత్తున ఉద్యమించారు. ప్రభుత్వ పట్టుదలతో శాశ్వత అన్యాయం శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల సీట్ల భర్తీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తన పంతం నెగ్గించుకోడానికి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌తో రాయలసీమ వాసులకు శాశ్వతంగా అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడింది. 1995లో స్విమ్స్ యూనివర్శిటీగా ప్రభుత్వం చట్టం చేసింది. దీన్ని ఆయుధంగా వాడుకుని తమ వాదన నెగ్గించుకునే ఎత్తుగడ వేసింది. శ్రీపద్మావతి మెడికల్ కళాశాలే కాదు స్విమ్స్ కూడా రాయలసీమకు మాత్రమే చెందినది కాదనే వాదన లేవదీసింది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల వాసులకు 85 శాతం సీట్లు కేటాయించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టి వేయాలనీ, అలా కాని పక్షంలో తీవ్ర ఇబ్బందులు పడతామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు విన్నవించుకుంది. సుప్రీం కోర్టు ఈ వాదనతో ఏకీభవిస్తే భవిష్యత్తులో స్విమ్స్లోను, టీటీడీలో కూడా ఉద్యోగాల భర్తీ విషయంలో రాయలసీమ వాసులకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడుతుంది. స్విమ్స్‌ను కేవలం రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతోనే దివంగత సీఎం ఎన్టీ రామారావు నిర్మింప చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం దీన్ని రాష్ట్రం మొత్తానికి సంబంధించిన సంస్థగా పేర్కొంటూ సుప్రీం కోర్టు కెక్కడంతో భవిష్యత్తులో ఇతర ప్రాంతాల వాసులు చట్టపరమైన వివాదాలు లేవనెత్తేందుకు ప్రభుత్వమే అవకాశం కల్పించింది. -
వెంగమ్మకు సీఎం బెదిరింపులు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి : స్విమ్స్ (శ్రీవెంకటేశ్వర వైద్య విజ్ఞానసంస్థ) డెరైక్టర్ డాక్టర్ వెంగమ్మ తనను పదవి నుంచి రిలీవ్ చేయమని చెప్పడం వెనుక పెద్దకథే నడిచినట్టు సమాచారం. నాలుగు రోజుల క్రితం జిల్లా పర్యటనకు వచ్చిన వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రేణిగుంట ఎయిర్‌పోర్టుకు డాక్టర్ వెంగమ్మను పిలిపించుకుని పదవి నుంచి తప్పుకోవాలని హెచ్చరికలు చేసినట్టు సమాచారం. ఇంతకుమునుపే ఆమెను స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగేలా చేసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ప్రభుత్వం పాచికగా ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే స్విమ్స్‌లోని కొన్ని పైళ్లను తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ తనిఖీల్లో ఎలాంటి ఆరోపణలు, అవినీతి ఆధారాలు లభించకపోగా డెరైక్టర్ నిక్కచ్చిగా వ్యవహరించినట్టు ప్రాథమిక సమాచారం అందింది. రంగంలోకి బాబు స్విమ్స్ డెరైక్టర్ పదవి నుంచి వెంగమ్మను తప్పించి, తమకు అనుకూలమైన వారిని నియమించుకోనేందుకు వీలుగా చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే స్విమ్స్ డెరైక్టర్ వెంగమ్మను కుప్పానికి పిలిపించుకుని పదవి నుంచి తప్పుకోవాలని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుగుదేశం వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. పదవి నుంచి తప్పుకోకపోతే సస్పెండ్ చేస్తానని బెదిరించినట్లు విశ్వసనీయ సమాచారం. దీనివెనుక ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ హస్తం ఉన్నట్టు వినికిడి. ముఖ్యంగా లోకేష్ తమకు అనుకూలమైనవారిని తెచ్చుకునే విధంగా పావులు కదిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే వెంగమ్మ తనను పదవి నుంచి రిలీవ్ చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. మూడు రోజుల క్రితమే హైదరాబాద్ వెళ్లి వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను కలసి లేఖ అందించారు. ఈ విషయాన్ని స్విమ్స్ వర్గాలు సైతం ధ్రువీకరించాయి. దీంతోపాటు వైద్య ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాసులు సైతం తమ బంధువులను స్విమ్స్ డెరైక్టర్‌గా తెచ్చేందుకు పావులు కదుపతున్నట్టు సమాచారం. -
స్విమ్స్ మహిళా వైద్యురాలికి లైంగింక వేదింపులు
తిరుపతి: శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్)లో మహిళా వైద్యురాలిని ఓ ఉన్నతాధికారి లైంగికంగా వేధిస్తుండటంపై జిల్లా ఎస్పీకి సోమవారం ఫిర్యాదు అందింది. వివరాలు... తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాధ్ జెట్టి బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తుండగా.... తిరుపతి స్విమ్స్‌లోని మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ అబీజిత్ చౌదరి గత మూడు సంవత్సరాలుగా మానసికంగా, శారీరకంగా వేదింపులకు గురిచేస్తున్నట్లు ఓ మహిళ( సీనియర్ మెడికల్ ఆఫీసర్) ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసాచారిని ఆదేశించారు. 2012 నుంచి మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ అబీజిత్ చౌదరి తనతో వివాహేతర సంబంధం కోసం ప్రయత్నించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించడం.. ఈమెయిల్స్.. మెసేజ్‌లు, ఫేస్బుక్లో అసభ్య రాతలు రాస్తూ తనను వేదిస్తున్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. వేదింపుల విషయం స్విమ్స్‌లోని ఉన్నతాధికారులకు రెండు మూడుసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని ఆమె వాపోయింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
'కర్నూలులో రూ. 45 కోట్లతో కేన్సర్ ఆసుపత్రి'
కర్నూలులో రూ. 45 కోట్ల వ్యయంతో కేన్సర్ ఆసుపత్రి నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం మంత్రి కామినేని శ్రీనివాస్ తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. స్విమ్స్‌లో ఏర్పాటు చేసిన రక్తనిధి కేంద్రం, రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ... గుంటూరు, విజయవాడల మధ్య ఎయిమ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకంలో సమూలంగా మార్పులు తీసుకు వస్తామన్నారు. అలాగే ఎన్టీఆర్ హెల్త్ కార్డులతో నిరుద్యోగులకు ఉచిత వైద్యం అందించనున్నట్లు తెలిపారు. అంతకుముందు మంత్రి కామినేని శ్రీనివాస్ తిరుమలలో విఐపీ ప్రారంభ సమయంలో శ్రీవారిని దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకున్నారు. ఆయనకు ఆలయ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.