
తిరుపతి అర్బన్(చిత్తూరు జిల్లా): రాయలసీమను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో హెలి టూరిజాన్ని వర్చువల్ పద్ధతిలో ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతితో పాటు అవసరమైన ప్రధాన కేంద్రాల్లో స్టార్ హోటళ్లను నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ఆలయాల సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామన్నారు. అవసరాన్ని బట్టి రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలున్న పట్టణాలకూ ఇదే పద్ధతిని అవలంభిస్తామని చెప్పారు.
కరోనా కారణంగా తగ్గిన ఆదాయం.. ప్రస్తుతం పెరుగుతోందన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి నగరానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారని, తిరుపతితో పాటు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని అన్ని ఆలయాలనూ పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రత్యేకంగా 20కి పైగా టూరిజం బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. రాయలసీమ జిల్లాల్లోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలను హబ్‌గా మార్చి, మెరుగైన వసతులు కల్పించి.. పర్యాటకులను ఆకర్షించేలా పలు సంస్కరణలు చేపట్టనున్నట్టు మంత్రి అవంతి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment