స్విమ్స్ పాలన గాడి తప్పిందని చెప్పే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. మొన్నటికి మొన్న స్విమ్స్‌లో జర్నలిస్టులపై దాడి, ఆ తర్వాత టీటీడీ అంబులెన్స్ డ్రైవర్‌కు వైద్యం నిరాకరణ, ఆరోగ్యశ్రీ అమలులో అవినీతి, ఇప్పుడేమో స్విమ్స్ ఉద్యోగులు, వైద్యుల నుంచి అక్రమ వసూళ్లకు లిఖిత పూర్వక ఉత్తర్వులు జారీ చేయడం సీఎం బంధువు కీలకమైన పదవిలో కూర్చుని అక్రమాలకు తెర తీశారన్న ఆరోపణలకు ఈ సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి.
సాక్షి, తిరుపతి: స్విమ్స్ అధికారులు సిల్వర్ జూబ్లీ పేరుతో నేరుగా వసూళ్ల దందాకు దిగారు. స్విమ్స్ సిల్వర్ జూబ్లీ ఆర్చ్(స్వాగత తోరణం) ఏర్పాటుకు రెగ్యులర్ ఉద్యోగుల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే విరాళాలకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేయడం గమనార్హం. ఉద్యోగులు నేరుగాగాని, వేతనం నుంచి అయినా అందించవచ్చని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొనడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇప్పటికే ఈ దందాను అధిక శాతం మంది వైద్యులు తిరస్కరించారు. వారం రోజులు గా ఈ తంతు స్విమ్స్‌లో గుట్టుగా సాగుతోంది.
సిల్వర్ జూబ్లీ వసూళ్లు..
స్విమ్స్ ఆస్పత్రి 1993 ఫిబ్రవరి 26న ప్రారంభమైంది. ఇప్పుడు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ వరకు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు సమీప బంధువుగా చలామణి అవుతూ స్విమ్స్‌లో కీలక పదవిలో ఉన్న వ్యక్తి చక్రం తిప్పుతూ స్విమ్స్ పరువు తీస్తున్నారని చెప్పడానికి నిదర్శనమే ఈ వసూళ్లు. సిల్వర్ జూబ్లీ ఆర్చ్ ఏర్పాటుకు స్విమ్స్‌లోని 600 మంది రెగ్యులర్ ఉద్యోగుల నుంచి నగదును సమకూర్చాలని సీఎం సమీప బంధువు ఉన్నతాధికారులకు సూచించి నట్లు çసమాచారం. ఆయన సూచించడమే తడువుగా వారం రోజుల క్రితం స్విమ్స్‌లోని అన్ని విభా గాలకు సర్క్యులర్ జారీ చేశారు.
విరాళం ఇవ్వడానికి ఇష్టమైతే ఒక రోజు, రెండు రోజుల వేతనం, అంతకంటే ఎక్కువే ఇవ్వచ్చని ఉత్తర్వుల్లో సూచిం చారు. నగదును నేరుగా అధికారులకు అందజేసే వెసులుబాటును కూడా కల్పించారు. వసూళ్ల దందాతో ఉద్యోగులు బిత్తరపోతున్నారు. అధికా రులు జారీ చేసిన సర్క్యులర్‌లో ఆర్చ్ ఎస్టిమేషన్ చూపకపోవడం కొసమెరుపు. అయితే ఈ వసూళ్ల దందాను సగానికి పైగా వైద్యులు తిరస్కరిం చారు. కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాల్లోని వైద్యులు పూర్తిగా దీన్ని వ్యతిరేకించి నట్లు సమాచారం.
టీటీడీ తలచుకుంటే...
స్విమ్స్ సిల్వర్ జూబ్లీ ఆర్చ్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు టీటీడీకి రిక్విజేషన్ లెటర్ పెట్టుకుంటే చాలు ఆర్చ్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది. అయితే స్విమ్స్‌లో కీలక పదవిలో ఉన్న సీఎం బంధువు ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించడం వల్లే వసూళ్ల దందాకు తెరతీశారు. ఇప్పటికే దీనిపై స్విమ్స్ ఉద్యోగుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. స్విమ్స్ పరువును బజారుపాలు చేసే ఇటువంటి నిర్ణయాలపై ఉన్నతాధికారులు పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్విమ్స్ ఉద్యోగులు చెబుతున్నారు. వసూళ్లపై సాక్షి అధికారులను వివరణ అడిగే ప్రయత్నం చేయగా వారు అందుబాటులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment