‘రామయ్య’ బ్రహ్మోత్సవాలకు కసరత్తు
ఒంటిమిట్ట రామాలయం(రాజంపేట): వచ్చేనెల 5నుంచి 14వరకు జరిగే ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) కసరత్తు చేస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఆలయంలోని రంగమండపంలో అధికారులతో టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ సమీక్షించారు. సీఈ చంద్రశేఖరరెడ్డి, డీఎఫ్‌ఓ శివరాంప్రసాద్, ఎస్‌ఈ రాములు, వెంకటేశ్వర్లు, విజలెన్స్ అధికారి సుకుమార్, ఏపీఎస్పీడీసీఎల్ డీఈ చంద్రశేఖర్, స్ధానిక తహసీల్దారు శ్రీనివాసులరెడ్డి, టీటీడీ డిప్యూటీ ఈఓ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ నాగరాజు, ఆలయ ప్రధానఅర్చకులు వీణారాఘవచార్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ నిర్ణయాలు..
ఒంటిమిట్ట రామయ్య బ్రçహ్మోత్సవాలకు రూ.3,86 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాశరధి కల్యాణాన్ని 70వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ఉత్సవాలు జరిపేందుకు ప్రణాళికలు రూపొందించారు. రామాలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలను కల్పించే అంశాలను ప్రస్తావించారు. కల్యాణవేదిక వద్ద ఎల్‌ఈడీలు ఏర్పాటు చేస్తున్నారు. కళ్యాణవేదిక నుంచి రామాలయంతోపాటు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల విద్యుత్ పనులకు సంబంధించి రూ 1,01,75,000,00 ఖర్చు చేయనున్నారు. వివిధ సౌకర్యాలకు సంబంధించి ఏర్పాట్లు నిమిత్తం రూ.259లక్షలను వ్యయం చేస్తున్నారు. ఈ పనుల చేపట్టేం తేదిలను టీటీడీ ఖరారు చేస్తుంది. అలాగే రూ.977లక్షల వ్యయంతో ప్రతిపాదనలను సిద్ధం చేశారు.
సమన్వయంతో పనిచేయాలి
ఒంటిమిట్టలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ ఆదేశించారు. రంగమండపంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి అధికారికంగా రామాలయంలో జరిగే నవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకముందుగా స్వామివారిని జేఈఓ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.