డేంజర్‌లో ‘సింగూరు’ డ్యామేజీ!
♦ రిజర్వాయర్ ఎండిపోవడంతో పగుళ్లు
♦ యుద్ధప్రాతిపదికన డ్యామ్ పటిష్టతను
♦ నిర్ధారించాలంటూ గేట్‌కు లేఖ
♦ మార్చిలో సింగూరు రానున్న నిపుణులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సింగూరు డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉంది. రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోవడంతో డ్యాంకు పగుళ్లు ఏర్పడి, నైబారే ప్రమాదం ఉందని సాగునీటి శాఖ అధికారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం కేవలం 0.07 టీఎంసీల నీళ్లు మాత్రమే సింగూరులో ఉన్నాయి. డ్యాం పునాదుల వరకు నీళ్లు ఎండిపోయి సిమెంట్స్ బెడ్స్ బయటికి తేలాయి. పునాదుల వద్ద నీళ్లు లేకపోవడంతో మట్టి ఎండిపోయి క్రమంగా అది రాలిపోవడంతో రంధ్రాలు పడతాయని అధికారులు చెబుతున్నారు. నీటి ప్రవాహం వచ్చినప్పుడు ఈ రంధ్రాల గుంగా నీళ్లు బయటికి కారిపోయి.. క్రమంగా పెద్ద పగుళ్లుగా మారి డ్యాం ఉనికిని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోనళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన డ్యాం మరమ్మతు పనులను చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులు గేట్‌కు లేఖ రాశారు.
1977-78లో సింగూరు రిజర్వాయర్ రూపుదిద్దుకుంది. 30 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ ఇప్పటి వరకు ఎండిపోలేదు. కనిష్ట నీటి మట్టం 10 టీఎంసీలు (డెడ్ స్టోరేజ్). గత ఏడాది ఫిబ్రవరి 19న డ్యాంలో 9 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి చుక్క నీరు కూడా చేరలేదు. ఉన్న నీటినే తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ చివరి వారంలోనే నీ టి నిల్వలు 0.09 టీఎంసీలకు చేరటం తో ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నీటి సరఫరాను నిలిపివేశారు. కేవలం మెదక్ జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకే నీటిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయింది. గుంతల్లో మాత్రమే నీళ్లు ఉన్నాయి.
ఏళ్ల తరబడి నీటి అలల తాకిడికి ప్రాజెక్టు పునాదుల వద్ద చిన్న చిన్న రంధ్రాలు పడతాయి. అయితే ఈ రంధ్రాల్లో వెంటనే ఒండ్రు మట్టి చేరిపోతుంది కాబట్టి డ్యాంకు ఎటాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అధికారులు డ్యాం పునాదుల వద్ద నిరంత రం నీళ్లు ఉండేటట్లు జాగ్రత్త పడతారు. ప్రస్తుతం నీళ్లు లేకపోవడంతో మట్టి ఎండిపోయింది. ఈ నేపధ్యంలో రంధ్రాల్లోని మట్టి రాలిపోతున్నట్లు, అక్కడక్కడ సిమెంటు గోడలకు పగుళ్లు ఏర్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు.
పటిష్టతపై లేఖ రాశాం.. ఇరిగేషన్ డిప్యూటీ ఇఇ జగన్నాథం: ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 0.07 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. నీళ్లు లేకపోవడం వల్ల ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయిన నేపథ్యంలో ప్రాజెక్టు పటిష్టతను పరిశీలించాలని కోరుతూ గేట్ డివిజన్ జనరల్ సూపరింటెండెంట్ గోవింద్‌కు లేఖ రాశాం. మార్చి తర్వాత హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా యంత్రాలను తెప్పించి, వాటి సహాయంతో ప్రాజెక్టు గేట్లు ఇతర నిర్మాణాల పటిష్టతను పశీలించి నివేదిక రూపొందిస్తారు. అవసరం అనుకుంటే గేట్లు, డ్యాంకు మరమ్మతు చేస్తారు.