‘రోను’తో అపార నష్టం
సాక్షి నెట్‌వర్క్: ‘రోను’ తుపాను ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి, అరటి, పెసర, మొక్కజొన్న పంటలకు అపార నష్టం కలిగింది. మూడు రోజులుగా భారీ వర్షాల వల్ల శ్రీకాకుళం జిల్లాలోని 29 మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఒక్క వజ్రపుకొత్తూరు ప్రాంతంలోనే సుమారు రూ.30 లక్షల వరకు నష్టపోయినట్లు ఉప్పు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తూర్పున రూ.2 కోట్లు నష్టం
తూర్పుగోదావరి జిల్లాలో 16 వేల ఎకరాల్లో అపరాలు సాగు కాగా, 90 శాతం పంటకు నష్టం వాటిల్లింది. దీంతో రైతులు రూ.రెండు కోట్ల మేర నష్టపోయారు.
500 గ్రామాల్లో అంధకారం
సాక్షి, హైదరాబాద్: రోను తుపానుకు రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ కకావికలమైంది. శుక్రవారం రాత్రికి 91 మండలాల పరిధిలోని 1053 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. 156 ఫీడర్లలో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. రాత్రి వరకు 80 శాతం మేర విద్యుత్ సరఫరా చేయగలిగామని ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర తెలిపారు. కానీ దాదాపు 500 గ్రామాలకు పైగా చీకటిలో మగ్గుతున్నాయి.