అన్నదాతకు షాక్
♦ 9 గంటలు విద్యుత్ సరఫరా లేనట్టే
♦ నెరవేరని టీడీపీ ఎన్నికల హామీ
♦ సాగునీటికి తప్పని ఇబ్బందులు
సాక్షి, విశాఖపట్నం : అధికారంలోకి వస్తే వ్యవసాయానికి రోజుకు 9 గంటల విద్యుత్ అందిస్తామని చెప్పుకొచ్చిన టీడీపీ తాజాగా అన్నదాతకు షాకిచ్చింది. రేపో మాపో ఇచ్చేస్తామంటూ రైతులను నమ్మిస్తూ వచ్చిన సర్కారు మాట నెరవేరేమార్గం లేదు. 9 గంటల విద్యుత్ ఇవ్వలేమని విద్యుత్ పంపిణీ సంస్థలు తేల్చిచెప్పడంతో సర్కారు హామీ గాలిలో కలిసిపోయింది. రైతులు ఆశ వదులుకోవాల్సిందేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో దాదాపు 24వేల వ్యవసాయ విద్యుత్ సర్వీసులున్నాయి. వీటికి ప్రతి రోజూ రెండు విడతల్లో 7గంటల పాటు సరఫరా అందిస్తున్నామని అధికారులు చెబుతుంటారు.
ఎప్పుడూ ఒకటి రెండు గంటలు తగ్గించే ఇస్తుంటారు.అది కూడా రెండు మూడు విడతల్లోనూ, రాత్రి వేళల్లోనూ సరఫరా చేస్తుంటారు. ఏజెన్సీలో ఏరులు, ఊట వాగుల ద్వారా వచ్చే నీటిని సాగు అవసరాలకు వాడుతున్నారు. మిగతా ప్రాంతాల్లో బోరు బావులు, చెరువులే ఆధారం. ప్రస్తుతం వర్షాలు లేక నేల నెరలు తీసి ఉంది. ఎండలకు పంటలు ఎండిపోతున్నాయి. కనీసం 9గంటల సరఫరా అమలు చేస్తే వ్యవసాయానికి పుష్కలంగా సాగునీరు దొరకుతుందని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాటిపై విద్యుత్ శాఖ నీళ్లు చల్లింది.
తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా హామీ నుంచి తప్పించుకునేందుకే డిస్కంల చేత ప్రభుత్వం ఈ విధంగా పలికిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ నమ్మకంతో ఎన్నికల్లో హామీ ఇచ్చారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం రైతుల దృష్టిని ఈ విషయాలపై నుంచి మళ్లించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. సోలార్ బోర్లు వేసుకోమని, రాయితీలు కల్పిస్తామని చెబుతోంది. అక్రమ వ్యవసాయ విద్యుత్ సర్వీసులను క్రమబద్ధీకరించుకోమని సలహా ఇస్తోంది. మరోవైపు త్వరలోనే మోటార్లకు మీటర్లు అమర్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.