‘తమ్ముళ్ల’తోనే సింగపూర్‌ యాత్ర! | Singapore tour only with tdp supporters | Sakshi
Sakshi News home page

‘తమ్ముళ్ల’తోనే సింగపూర్‌ యాత్ర!

Published Wed, Nov 1 2017 4:01 AM | Last Updated on Wed, May 29 2019 3:19 PM

Singapore tour only with tdp supporters - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: రైతులతో సింగపూర్‌ యాత్రకు జెండా ఊపిన 24గంటల్లో ప్రభుత్వ బండారం బయటపడింది. అక్కడ అభివృద్ధిని తిలకించడానికి వెళ్లిన రైతుల బృందంలో ఎక్కువమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఉండటంపై రాజధాని రైతుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. రాజధానిలో 26 వేల మంది రైతులు ఉండగా.. సింగపూర్‌ పర్యటన కోసం దరఖాస్తు చేసింది కేవలం 123 మందే కావడం గమనార్హం. అందులో తొలి విడతగా సోమవారం 34 మంది రైతులను సింగపూర్‌ పర్యటనకు సీఆర్‌డీఏ తీసుకెళ్లింది. సింగపూర్‌ పట్ల రైతుల్లో తీవ్రమైన ఆసక్తి ఉందని, ముఖ్యమంత్రి చెబుతున్న అభివృద్ధి నమూనాపై రైతుల్లో విశ్వాసం సన్నగిల్లలేదని చెప్పాలనే ఉద్దేశంతో సీఆర్‌డీఏ ‘సింగపూర్‌ పర్యటన’ ప్యాకేజీకి రూపకల్పన చేసిన విషయం విదితమే.

రైతుల ఆసక్తి విషయంలో సీఆర్‌డీఏ అంచనాలు తల్లకిందులు కావడాన్ని స్థానిక రైతులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. వేలాది దరఖాస్తులు వస్తాయని ఆశించిన సీఆర్‌డీఏ.. లాటరీ ద్వారా సింగపూర్‌ పర్యటనకు రైతులను ఎంపిక చేస్తామని, 100 మంది రైతులనే తీసుకెళ్తామని తొలుత ప్రకటించింది. కానీ.. దరఖాస్తులు 123 మాత్రమే రావడంతో ప్రభుత్వ పెద్దల ఉత్సాహం నీరుగారిపోయిందని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. రాజధాని నిర్మాణం, అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న గ్రాఫిక్స్, చెబుతున్న మాటలకు, రాజధానిలో వాస్తవ పరిస్థితికి పొంతన కుదరడంలేదని ఇక్కడి రైతులు చెబుతున్నారు. రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా వేయకుండా సింగపూర్‌ పర్యటనల వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటని తాము అడుగుతున్న ప్రశ్నకు ప్రభుత్వ పెద్దల వద్ద సమాధానంలేదని వారంటున్నారు. సింగపూర్‌ పర్యటనకు ఆసక్తి చూపించిన రైతుల్లో ఎక్కువమంది టీడీపీ నాయకులు, వారి అనుచరులే ఉండటం రైతుల వాదనకు బలం చేకూరుస్తోంది.

రైతుల బృందంలో టీడీపీ నేతలు వీరే..
- బెల్లంకొండ నరసింహారావు (తాడికొండ మార్కెట్‌ యార్డు చైర్మన్, టీడీపీ నేత)
- దామినేని శ్రీనివాసరావు (తుళ్లూరు జన్మభూమి కమిటీ అధ్యక్షుడు)
- పువ్వాడ గణేష్‌బాబు (రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, తుళ్లూరు టీడీపీ నేత)
- ఆకుల  ఉమామహేశ్వరరావు (ఎర్రబాలెం టీడీపీ నాయకుడు)
- ఆకుల జయసత్య (టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు, మంగళగిరి మండలం)
ఇడుపలపాటి సీతారామయ్య (వెలగపూడి గ్రామ టీడీపీ అధ్యక్షుడు)
- కారుమంచి శివప్రసాద్‌ (వెలగపూడి టీడీపీ నాయకుడు)
జొన్నలగడ్డ శివశంకర ప్రసాద్‌ (ఎత్తిపోతల పథకం మాజీ చైర్మన్, టీడీపీ నాయకుడు)
కట్టా వినయ్‌కుమార్‌ (ఉద్దండ్రాయునిపాలెం టీడీపీ నాయకుడు)
- ఆలూరి తారక బ్రహ్మం (మందడం టీడీపీ యూత్‌ నాయకుడు)
- దామినేని శ్రీనివాసరావు (జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, టీడీపీ నేత)
- పాలకాయల అర్జునరావు (ఐనవోలు గ్రామ టీడీపీ అధ్యక్షుడు)
- తరిగొప్పుల సాంబశివరావు (శాకమూరు గ్రామ టీడీపీ అధ్యక్షుడు)
- జొన్నలగడ్డ వినయ్‌చౌదరి (రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, అనంతవరం గ్రామ టీడీపీ కార్యదర్శి) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement