
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు కేటాయించిన 1,691 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు అప్పులు చేయాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. రహదారులు, ప్రభుత్వ కాంప్లెక్స్, ల్యాండ్ పూలింగ్ స్కీం, వరద నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ, ఐకానిక్ వంతెన, విద్యుత్ తదితర మౌలిక వసతుల కల్పనకు తొలి దశలో రూ.51,208 కోట్లు అవసరమని సీఆర్‌డీఏ అంచనా వేసింది. ఈ నిధులను హడ్కో, ప్రపంచ బ్యాంకు, స్టాండర్డ్ చార్టెర్డ్ బ్యాంకు నుంచి అప్పు తీసుకోవడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా కొంత సమీకరించాలని నిర్ణయించింది.
భారం సీఆర్‌డీఏ పైనే..
అమరావతిలో సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన 1,691 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు అయ్యే వ్యయాన్ని సీఆర్‌డీఏ భరించాల్సి ఉంటుంది. ఆ మేరకు సింగపూర్ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రూ.5,500 కోట్ల వ్యయం అవుతుందని జీవో కూడా జారీ చేసింది. సింగపూర్ కంపెనీలకు ఇచ్చిన భూమిలో విద్యుత్, రహదారులు, మంచినీరు, పారిశుధ్యం తదితర వసతులను సీఆర్‌డీఏ అప్పులు చేసి కల్పించనుంది. ఆ భూమిని సింగపూర్ కంపెనీలు ప్లాట్లుగా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాయి.
రుణానికి రాçష్ట్ర సర్కారు గ్యారెంటీ
తొలి దశలో రూ.10వేల కోట్ల అప్పులు చేసేందుకు సీఆర్‌డీఏకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. అయితే వడ్డీ 8 శాతంలోపే ఉండాలని స్పష్టం చేసింది. సీఆర్‌డీఏకు వేల ఎకరాల భూములు ఉన్నప్పటికీ సొంతంగా అప్పులు చేసి, తీర్చే సామర్థ్యం లేదని రేటింగ్ ఇచ్చే సంస్థలు తేల్చాయి. అప్పులు పుట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ ఉండాలని స్పష్టం చేశాయి.