సాక్షి, అమరావతి : నిధుల లభ్యత లేకపోయినా, పెద్దగా అవసరం లేకపోయినా రాజధానిలో గత తెలుగుదేశం ప్రభుత్వం ఎడాపెడా మొదలుపెట్టిన 73 పనుల్లో 35 నిర్మాణాలకు సంబంధించిన పనులు 25 శాతంలోపే అయినట్లు తేలింది. వాటిలో కొన్ని ఐదు శాతం కూడా పూర్తికాలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ప్రభుత్వ శాఖల్లో పనుల తీరుపై నివేదికలు కోరిన విషయం తెలిసిందే. ఏప్రిల్ ఒకటో తేదీ కంటే ముందు కేటాయించిన పనుల్లో ఇప్పటివరకూ అసలు మొదలు కానివి.. కేటాయించిన పనుల్లో 25 శాతం కన్నా తక్కువ పూర్తయిన వాటి వివరాలతో సీఆర్‌డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ), ఏడీసీ (అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్) అధికారులు నివేదికలు సిద్ధంచేస్తున్నారు.
నాలుగున్నరేళ్లల్లో కట్టినవి ఇవే..
టీడీపీ పాలనలోని నాలుగున్నరేళ్లలో రాజధాని నగర పరిధిలో మొత్తం 73 పనులు చేపట్టగా వాటిలో అందుబాటులోకి వచ్చినవి కేవలం తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలు, సిటీ సివిల్ కోర్టు కాంప్లెక్స్ మాత్రమే. మిగిలిన పనులన్నీ వివిధ దశల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వీటిలో 38 పనులే 25 శాతానికి మించి జరిగినట్లు చెబుతున్నారు. ఏడీసీ అధ్వర్యంలో జరిగిన రోడ్ల పనులు కొన్ని సగానికి పైగా పూర్తయ్యాయి. రాజధానిని జాతీయ రహదారితో అనుసంధానం చేసే సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా అందులో ఉన్నా ఒక ప్యాకేజీలోనే పనులు జరిగాయి. రెండో ప్యాకేజీకి ఇంకా టెండర్లే పిలవకపోవడంతో ఈపని అసంపూర్తిగానే ఉంది. గెజిటెడ్, నాన్–గెజిటెడ్ అధికారుల కోసం నిర్మిస్తున్న అపార్టుమెంట్లు కొంతవరకూ పూర్తయ్యాయి.
అన్ని పనులు అప్పులతోనే ముందుకు
ఇదిలా ఉంటే.. మొదలైన ఈ మొత్తం పనుల విలువ రూ.35 వేల కోట్లకు పైనే ఉంటుందని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. కానీ, నిధులు లేకపోవడంతో అన్ని పనుల్ని దాదాపు అప్పులతోనే మొదలుపెట్టారు. పీపీపీ కింద కేటాయించిన పనులు మినహా మిగిలిన పనుల కోసం ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకులు, పలు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారు. ఏ పనికి ఎంత రుణం తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారనే పూర్తి వివరాలను సీఆర్‌డీఏ ఇప్పటివరకూ బయట పెట్టకపోయినా తీసుకున్న రుణాల్లో నిర్మాణ సంస్థలకు చెల్లించింది మాత్రం మూడు వేల కోట్ల వరకే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఆయా నిర్మాణాలు చేపట్టిన సంస్థలు చాలారోజుల నుంచి బిల్లుల కోసం గత ప్రభుత్వ పెద్దలు, సీఆర్‌డీఏ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నా వారు ఏదో ఒక సాకుతో తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి చేపట్టిన పనులన్నింటినీ సమీక్షిస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి పూర్తి వాస్తవాలను బయటపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హడావుడి తప్ప పురోగతి లేని పనులు
గత ప్రభుత్వం మూడున్నరేళ్ల నుంచి డిజైన్ల పేరుతో హడావుడి చేసినా పూర్తిస్థాయి అసెంబ్లీ నిర్మాణం ఇంకా మొదలు కాలేదు. లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్స్ సంస్థతో దీని డిజైన్ రూపొందించినా నిర్మాణ పనుల్ని ఇంకా ఎవరికీ అప్పగించలేదు. అలాగే..
- సచివాలయం కోసం నిర్మించే ఐదు టవర్లు, హైకోర్టు, ముఖ్యకార్యదర్శులు.. కార్యదర్శుల నివాస భవనాలు, మంత్రులు..జడ్జీల బంగ్లాలు, ఎమ్మెల్యేలు–ఐఏఎస్ అధికారుల భవన నిర్మాణ పనులు 25 శాతానికి మించలేదు.
- సచివాలయ టవర్లు, హైకోర్టు పనులైతే ఐదు శాతం కూడా దాటకపోవచ్చని అధికారులు చెబుతున్నారు.
- ఇబ్రహీంపట్నం నుంచి లింగాయపాలెం వరకూ కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎన్నికలకు ముందు హడావుడిగా శంకుస్థాపన చేసినా మొదలు పెట్టలేదు.
- అలాగే, సింగపూర్ కన్సార్టియంకు అప్పగించిన స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కూడా వివాదాల కారణంగా ఒక్కడుగూ ముందుకు పడలేదు.
- భూసమీకరణ పథకం కింద రైతుల నుంచి సేకరించిన భూమికి బదులుగా వారికిచ్చే ప్లాట్ల లేఅవుట్ల అభివృద్ధి పనుల్లో ఒక్కటీ మొదలు కాలేదు. మొత్తం 11 జోన్ల కింద విభజించిన ఈ లేఅవుట్ల అభివృద్ధి పనులపై ఇప్పటికీ స్పష్టత లేవకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment