అప్పుల గుదిబండ! | TDP Govt is taking loans unnecessarily | Sakshi
Sakshi News home page

అప్పుల గుదిబండ!

Published Thu, Jul 26 2018 3:20 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM

TDP Govt is taking loans unnecessarily - Sakshi

సాక్షి, అమరావతి: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే రీతిలో అధికారంలో ఉండగానే అందినకాడికి అప్పులు చేస్తూ కాంట్రాక్టర్లకు బిల్లుల పేరుతో రూ. వేల కోట్లు వెనకేసుకునేలా టీడీపీ సర్కారు వ్యవహరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఇక అధికారంలోకి రాలేమనే నిస్పృహతో రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదు అనే ధోరణితో ఉంది. ఫలితంగా తదుపరి ప్రభుత్వాలపై భారీగా అప్పుల భారం పడనుంది. స్వయంగా ఉన్నతాధికారులే ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం. కార్పొరేషన్ల పేరుతో రుణాలు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అప్పులు చేయడంపై కేంద్ర ప్రభుత్వం పలు పరిమితులు విధించింది.

మరోపక్క తలకు మించిన అప్పులకు ద్రవ్య జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనలు అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ పరిధిలో కాకుండా వివిధ రకాల కార్పొరేషన్ల పేరుతో వాటి ఆస్తులను తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పులు చేయాలని టీడీపీ సర్కారు నిర్ణయించింది. అయితే కార్పొరేషన్ల ఆస్తులు తాకట్టు పెట్టినప్పటికీ సర్కారు గ్యారెంటీ ఇస్తేనే అప్పులిస్తామని వాణిజ్య బ్యాంకులు స్పష్టం చేశాయి. దీంతో గ్యారెంటీ ఇచ్చి బయట అప్పులు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే తదుపరి ఏర్పాటయ్యే ప్రభుత్వాలు అప్పులకు గ్యారెంటీ ఇచ్చే వెసులుబాటు కూడా లేకుండా చేసే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 

జలవనరుల నెత్తిన రూ.30 వేల కోట్ల భారం
ఇప్పటి వరకు తన గ్యారెంటీతో వివిధ సంస్థల ఆస్తులను తాకట్టు పెట్టి రూ. 65 వేల కోట్ల అప్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌ పేరుపై ఏకంగా రూ. 30 వేల కోట్ల అప్పు చేయాలని నిర్ణయించింది గమనార్హం. జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌ పేరుపై తొలుత రూ. 3,000 కోట్ల అప్పు చేయడానికే కేబినెట్‌ నిర్ణయించింది. కొద్దిరోజుల క్రితం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఆ పరిమితిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాగునీటి ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టి వాణిజ్య బ్యాంకుల ద్వారా రూ.30 వేల కోట్ల అప్పు తీసుకునేందుకు అనుమతించింది. గోదావరి–పెన్నా అనుసంధానం పేరుతో ఏకంగా రూ.80 వేల కోట్ల పనులకు టెండర్లను పిలిచి ఖరారు చేయడంతో పాటు ప్రస్తుతం పది శాతంగా ఉన్న మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ను 12.50 శాతానికి పెంచి కమీషన్లను దండుకునే ఎత్తుగడలో భాగంగానే సర్కారు భారీ అప్పులకు సిద్ధమైందని ఉన్నత అధికారి ఒకరు తెలిపారు. 

కమీషన్ల నిధులతో ఎన్నికలు ఎదుర్కొనే వ్యూహం
సాగునీటి ప్రాజెక్టులన్నిటినీ జలవనరుల కార్పొరేషన్‌ ఆస్తి కింద చూపిస్తూ వాటిని తాకట్టు పెట్టి ఇప్పటికే వాణిజ్య బ్యాంకుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.6 వేల కోట్ల అప్పు చేసింది. జలవనరుల కార్పొరేషన్‌ పేరుతో మరో రూ. 24 వేల కోట్ల అప్పు చేయనున్నారు. మరోపక్క రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌ పేరుపై మూడు వేల కోట్ల రూపాయలు వాణిజ్య బ్యాంకుల నుంచి అప్పు చేశారు. ఇదికాకుండా తాగునీటి ప్రాజెక్టుల ఆస్తులను తాకట్టు పెట్టి రూ.5,000 కోట్ల అప్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రహదారులన్నీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌కు బదిలీ చేసి వాటిని ఆస్తులుగా చూపించి వాణిజ్య బ్యాంకుల నుంచి ప్రభుత్వ గ్యారెంటీతో అప్పులు చేస్తున్నారు. ఆ నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించి కమీషన్లు దండుకుని వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలనేది రాష్ట్ర సర్కారు పెద్దల ఆలోచన అని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. 

రాజధాని భూములపై రూ.10 వేల కోట్లు
రాజధాని భూములను సీఆర్‌డీఏ ఆస్తుల కింద చూపించి వాణిజ్య బ్యాంకుల నుంచి పది వేల కోట్ల రూపాయల అప్పు తీసుకునేందుకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అంగీకారం తెలిపింది. రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు మున్సిపల్‌ ఆస్తులను బదిలీ చేసి ఆ ఆస్తులను తాకట్టు పెట్టి వాణిజ్య బ్యాంకుల నుంచి 13 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వనుంది. 

ఆర్టీసీ ఖాతాలో రూ. వెయ్యి కోట్లు
ఆర్టీసీ ఆస్తులను తాకట్టు పెట్టి వెయ్యి కోట్ల రూపాయల అప్పు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే 700 కోట్ల రూపాయలను వాణిజ్య బ్యాంకుల నుంచి ఆర్టీసీ అప్పు చేసింది. రైతు సాధికార సమితి పేరు మీద  కూడా 3,000 కోట్ల రూపాయలు అప్పు చేయాలని నిర్ణయించగా ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు తీసుకుంది. ఇలా వీలైన చోటల్లా అప్పులు చేసేసి టీడీపీ సర్కారు రాష్ట్రాన్ని పరాధీనంలోకి నెట్టివేస్తోందని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

‘శాశ్వతం’ ఒక్కటీ లేదు..
రాష్ట్ర బడ్జెట్‌లో అప్పులు బాగా పెరిగిపోతుండగా ఆస్తులు రేషియో తగ్గిపోతోందని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర బడ్జెట్‌లో అప్పులే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 2,49,435.37 కోట్ల రూపాయలకు చేరుకుంటాయని బడ్జెట్‌లోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. 2014–15లో అప్పులు 1,48,743.45 కోట్ల రూపాయలుండగా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఏకంగా 2,49,435.37 కోట్ల రూపాయలకు చేరుకోవడం గమనార్హం. చేసిన అప్పులను ఆస్తుల కల్పకు వెచ్చించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రంగాలకు వెచ్చిస్తోంది.

అప్పులతో శాశ్వత రాజధాని గానీ శాశ్వత సాగునీటి ప్రాజెక్టులను గానీ చేపట్టలేదు. కమీషన్ల కోసం తాత్కాలికంగా పట్టిసీమ ప్రాజెక్టును రూ.1,600 కోట్లతో చేపట్టగా అందులో 450 కోట్ల రూపాయలు కమీషన్లు చేతులు మారినట్లు స్వయంగా కాగ్‌ నివేదిక స్పష్టం చేసింది. కాంట్రాక్టర్‌కు ఆయాచిత లబ్ది చేకూర్చినట్లు పేర్కొంది. సాగునీటి రంగానికి గత మూడున్నరేళ్లలో సెప్టెంబర్‌ వరకు 35,819 కోట్ల రూపాయలను వ్యయం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే ఇందులో సాగునీటి పనులకు వ్యయం చేసింది తక్కువ కాగా జీవో 22 ప్రకారం పాత పనులకు ఎస్కలేషన్‌ పేరుతో భారీగా కాంట్రాక్టర్లకు చెల్లించేసి కమీషన్లు కాజేసింది ఎక్కువగా ఉండటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement