కన్సల్టెన్సీలకు స్వస్తి  | CRDA notices to more than 30 organizations including Norman Foster and Mackenzie | Sakshi
Sakshi News home page

కన్సల్టెన్సీలకు స్వస్తి 

Published Sat, Aug 3 2019 3:19 AM | Last Updated on Sat, Aug 3 2019 5:08 AM

CRDA notices to more than 30 organizations including Norman Foster and Mackenzie - Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం పేరుతో కన్సల్టెన్సీల ఇష్టారాజ్యానికి తెరపడింది. ఏ విభాగంలోనూ కన్సల్టెన్సీలు ఇకపై కొనసాగరాదని సీఆర్‌డీఏ, ఏడీసీ (అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 30 కన్సల్టెన్సీల సేవలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. జూలై  31వ తేదీ నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. 

దుబారా లెక్కలపై ఆరా తీయటంతో.. 
గత ప్రభుత్వ హయాంలో టీడీపీ పెద్దల సూచనలకు అనుగుణంగా రాజధానిలో ప్రతి పనికి సీఆర్‌డీఏ, ఏడీసీలు ఇష్టానుసారంగా కన్సల్టెన్సీలను నియమించుకుని కోట్ల రూపాయలు ముట్టచెప్పాయి. అవసరం లేకున్నా విదేశీ, స్వదేశీ కన్సల్టెన్సీలను ఎడాపెడా నియమించాయి. ఈ భారం రూ.460 కోట్లకుపైనే ఉండగా గతంలోనే రూ.329 కోట్లను చెల్లించారు. కన్సల్టెన్సీలు ఇప్పటికీ సీఆర్‌డీఏ, ఏడీసీ కార్యాలయాల్లో తిష్ట వేసి పని లేకపోయినా పెత్తనం చలాయిస్తున్నాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం దుబారా వ్యయాలపై దృష్టి సారించడంతో కన్సల్టెన్సీల లెక్కలు బయటకు వచ్చాయి. గత ఐదేళ్లలో నియమించిన కన్సల్టెన్సీలు, పనులు, ఖర్చుల గురించి ఉన్నతాధికారుల కమిటీ ఇటీవలే నివేదిక అందచేసింది. దీని ప్రకారం 30 కన్సల్టెన్సీలను తాత్కాలికంగా ఉపసంహరించుకుంటున్నట్లు గత నెల 31వ తేదీన సమాచారం ఇచ్చారు. తక్షణం పనులు నిలిపివేయాలని ఆదేశించారు. తదుపరి వాటిని కొనసాగించాల్సిన అవసరం ఉంటే సమాచారం ఇస్తామని తెలిపారు. అన్ని విభాగాల డైరెక్టర్లకు నియమించిన కన్సల్టెన్సీలు, చేపట్టిన పని, చెల్లించిన సొమ్ము, ప్రస్తుతం వాటి అవసరం ఉందా? అనే అంశాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.  

కన్సల్టెన్సీలకు కోట్లకు కోట్లు  
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో నిపుణులైన అధికారులతోపాటు దేశంలో నైపుణ్యం కలిగిన పలు సంస్థలున్నా పట్టించుకోకుండా టీడీపీ హయాంలో భారీ వ్యయంతో ఇష్టానుసారంగా కన్సల్టెన్సీలను నియమించారు. మొత్తం 70కిపైగా కన్సల్టెన్సీలను నియమించగా సీఆర్‌డీఏలో 50, ఏడీసీలో 20 వరకు కన్సల్టెన్సీలున్నాయి. పరిపాలనా నగరం డిజైన్ల పేరుతో హడావుడి చేసిన నార్మన్‌ పోస్టర్‌ సంస్థకు సీఆర్‌డీఏ ద్వారా రూ.112 కోట్లను చెల్లించారు. హఫీజ్‌ కాంట్రాక్టర్‌ను పార్టనర్‌గా నియమించుకునేలా లండన్‌ కంపెనీ నార్మన్‌ ఫోస్టర్‌పై ఒత్తిడి తెచ్చి అదనంగా రూ.60.72 కోట్లు ముట్టచెప్పారు. ఈ రెండు సంస్థలు అందచేసిన రంగుల బొమ్మల కోసమే రూ.173.31 కోట్లు వ్యయం చేశారు.  

పెత్తనం అంతా వాటిదే! 
ఒకపక్క వందల సంఖ్యలో కొత్తగా ఇంజనీర్ల నియామకం మరోపక్క డిప్యుటేషన్లపై వివిధ శాఖల నుంచి పనిచేయించుకుంటూనే ప్రాజెక్టుల నిర్వహణ పేరుతో గత సర్కారు ప్రతి పనికి మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్లను నియమించింది. ఈ నిర్వహణ సంస్థలకే రూ.100 కోట్లకుపైనే చెల్లించింది. రాజధాని ప్రకటనకు ముందే మాస్టర్‌ప్లాన్‌ కోసం సింగపూర్‌కు చెందిన సుర్బానా ఇంటర్నేషనల్‌ను కన్సల్టెన్సీగా నియమించుకున్న టీడీపీ సర్కారు రూ.14.8 కోట్లు చెల్లించింది. బ్లూ కన్సల్టెంట్, గ్రీన్‌ కన్సల్టెంట్, రాజధాని స్ట్రాటజీ ప్రోగ్రాంను తయారు చేసేందుకు రూ.29 కోట్లు చెల్లించి మెకన్సీని నియమించింది. సీఆర్‌డీఏ కమిషనర్‌ కార్యాలయానికి సలహాలిచ్చేందుకు కూడా ఒక కన్సల్టెంట్‌ను నియమించుకున్నారు. సీఆర్‌డీఏ, ఏడీసీ కార్యాలయాల్లో అసలు ఉద్యోగుల కంటే ఈ కన్సల్టెంట్ల హడావుడే ఎక్కువగా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement