నార్మన్ ఫోస్టర్ బృందం సమర్పించిన ఓ డిజైన్
తుది డిజైన్లు వచ్చాయి
Published Thu, Sep 14 2017 1:23 AM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM
వీటిపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు నేడు మంత్రులతో సమావేశం
సాక్షి, అమరావతి: రాజధాని పాలనా నగరంలో హైకోర్టు భవనం డిజైన్‌పై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. నార్మన్ ఫోస్టర్ బృందం బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఎంకు తుది డిజైన్లపై ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ...హైకోర్టు భవనం లోపల సౌకర్యాలు, అంతర్గత నిర్మాణ శైలిపై న్యాయమూర్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిపారు. బాహ్య ఆకృతి మాత్రం తనతోపాటు అందరికీ నచ్చేలా ఉండాలన్నారు.హైకోర్టు బాహ్య డిజైన్ అద్భుతంగా ఉండేలా రూపొందించి తీసుకురావాలన్నారు. మిగిలిన డిజైన్ల అంతర్గత నిర్మాణ శైలి బాగుందని, బాహ్య ఆకృతులపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుందామని తెలిపారు. వీటిపై మంత్రులు, ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు గురువారం ఉదయం పది గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
నాలుగు అంతస్తుల్లో అసెంబ్లీ
ఫోస్టర్ సంస్థ ఇచ్చిన డిజైన్ల ప్రకారం అసెంబ్లీ భవనం వజ్రాకృతిలో నాలుగంతస్తుల్లో ఉంటుంది. మొదటి అంతస్థును నాలుగు భాగాలుగా విభజించి మధ్యలో పబ్లిక్ ప్లేస్ ఉంచారు. మొదటి అంతస్థును మంత్రులు, సీఎం, స్పీకర్, పబ్లిక్, ప్రెస్ కోసం కేటాయించి వాటికి నాలుగు వైపులా ద్వారాలు ఏర్పాటు చేశారు. శాసనసభ, మండలి కోసం రెండు వేర్వేరు భవనాలు ఈ సముదాయంలోనే అంతర్గతంగా ఉంటాయి. శాసనసభ కింది అంతస్థులోని మధ్య భాగం నుంచి వజ్రాకృతి మొదలై మొత్తం భవనంపై అంతస్థు వరకూ ఉంటుంది. సచివాలయానికి సంబంధించి మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు ఒకే ప్రాంగణంలో ఉండాలనే ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో రెండు ఆప్షన్లను పరిగణలోకి తీసుకున్నట్లు సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు.
Advertisement