Norman Foster
-
కన్సల్టెన్సీలకు స్వస్తి
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం పేరుతో కన్సల్టెన్సీల ఇష్టారాజ్యానికి తెరపడింది. ఏ విభాగంలోనూ కన్సల్టెన్సీలు ఇకపై కొనసాగరాదని సీఆర్డీఏ, ఏడీసీ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్)లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 30 కన్సల్టెన్సీల సేవలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. జూలై 31వ తేదీ నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. దుబారా లెక్కలపై ఆరా తీయటంతో.. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ పెద్దల సూచనలకు అనుగుణంగా రాజధానిలో ప్రతి పనికి సీఆర్డీఏ, ఏడీసీలు ఇష్టానుసారంగా కన్సల్టెన్సీలను నియమించుకుని కోట్ల రూపాయలు ముట్టచెప్పాయి. అవసరం లేకున్నా విదేశీ, స్వదేశీ కన్సల్టెన్సీలను ఎడాపెడా నియమించాయి. ఈ భారం రూ.460 కోట్లకుపైనే ఉండగా గతంలోనే రూ.329 కోట్లను చెల్లించారు. కన్సల్టెన్సీలు ఇప్పటికీ సీఆర్డీఏ, ఏడీసీ కార్యాలయాల్లో తిష్ట వేసి పని లేకపోయినా పెత్తనం చలాయిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దుబారా వ్యయాలపై దృష్టి సారించడంతో కన్సల్టెన్సీల లెక్కలు బయటకు వచ్చాయి. గత ఐదేళ్లలో నియమించిన కన్సల్టెన్సీలు, పనులు, ఖర్చుల గురించి ఉన్నతాధికారుల కమిటీ ఇటీవలే నివేదిక అందచేసింది. దీని ప్రకారం 30 కన్సల్టెన్సీలను తాత్కాలికంగా ఉపసంహరించుకుంటున్నట్లు గత నెల 31వ తేదీన సమాచారం ఇచ్చారు. తక్షణం పనులు నిలిపివేయాలని ఆదేశించారు. తదుపరి వాటిని కొనసాగించాల్సిన అవసరం ఉంటే సమాచారం ఇస్తామని తెలిపారు. అన్ని విభాగాల డైరెక్టర్లకు నియమించిన కన్సల్టెన్సీలు, చేపట్టిన పని, చెల్లించిన సొమ్ము, ప్రస్తుతం వాటి అవసరం ఉందా? అనే అంశాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కన్సల్టెన్సీలకు కోట్లకు కోట్లు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో నిపుణులైన అధికారులతోపాటు దేశంలో నైపుణ్యం కలిగిన పలు సంస్థలున్నా పట్టించుకోకుండా టీడీపీ హయాంలో భారీ వ్యయంతో ఇష్టానుసారంగా కన్సల్టెన్సీలను నియమించారు. మొత్తం 70కిపైగా కన్సల్టెన్సీలను నియమించగా సీఆర్డీఏలో 50, ఏడీసీలో 20 వరకు కన్సల్టెన్సీలున్నాయి. పరిపాలనా నగరం డిజైన్ల పేరుతో హడావుడి చేసిన నార్మన్ పోస్టర్ సంస్థకు సీఆర్డీఏ ద్వారా రూ.112 కోట్లను చెల్లించారు. హఫీజ్ కాంట్రాక్టర్‌ను పార్టనర్‌గా నియమించుకునేలా లండన్ కంపెనీ నార్మన్ ఫోస్టర్‌పై ఒత్తిడి తెచ్చి అదనంగా రూ.60.72 కోట్లు ముట్టచెప్పారు. ఈ రెండు సంస్థలు అందచేసిన రంగుల బొమ్మల కోసమే రూ.173.31 కోట్లు వ్యయం చేశారు. పెత్తనం అంతా వాటిదే! ఒకపక్క వందల సంఖ్యలో కొత్తగా ఇంజనీర్ల నియామకం మరోపక్క డిప్యుటేషన్లపై వివిధ శాఖల నుంచి పనిచేయించుకుంటూనే ప్రాజెక్టుల నిర్వహణ పేరుతో గత సర్కారు ప్రతి పనికి మేనేజ్మెంట్ కన్సల్టెంట్లను నియమించింది. ఈ నిర్వహణ సంస్థలకే రూ.100 కోట్లకుపైనే చెల్లించింది. రాజధాని ప్రకటనకు ముందే మాస్టర్‌ప్లాన్ కోసం సింగపూర్‌కు చెందిన సుర్బానా ఇంటర్నేషనల్‌ను కన్సల్టెన్సీగా నియమించుకున్న టీడీపీ సర్కారు రూ.14.8 కోట్లు చెల్లించింది. బ్లూ కన్సల్టెంట్, గ్రీన్ కన్సల్టెంట్, రాజధాని స్ట్రాటజీ ప్రోగ్రాంను తయారు చేసేందుకు రూ.29 కోట్లు చెల్లించి మెకన్సీని నియమించింది. సీఆర్డీఏ కమిషనర్ కార్యాలయానికి సలహాలిచ్చేందుకు కూడా ఒక కన్సల్టెంట్‌ను నియమించుకున్నారు. సీఆర్డీఏ, ఏడీసీ కార్యాలయాల్లో అసలు ఉద్యోగుల కంటే ఈ కన్సల్టెంట్ల హడావుడే ఎక్కువగా ఉంది. -
చంద్రబాబు ఇంద్ర భవనానికి సర్కారు సొమ్మే
అది హైదరాబాద్‌లోనే అతి ఖరీదైన జూబ్లీహిల్స్ ప్రాంతం. అక్కడ రోడ్డు నంబర్ 65లో సుమారుగా అర ఎకరం విస్తీర్ణంలో నిర్మించిన అత్యంత విలాసవంతమైన ఆధునిక భవంతి.... అందులో...ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంటీరియర్స్.. కళ్లు చెదిరే షాండ్లియర్స్... ఇటాలియన్ మార్బుల్స్... విశాలమైన గదుల్లో ఎటుచూసినా అద్భుతమైన కళాకృతులు.. ముట్టుకుంటే మాసిపోతాయా అన్నట్లుండే ఖరీదైన సామగ్రి... ఇక టెర్రస్ కూడా ఖరీదైనదే.. దానిపై అరుదైన విదేశీ మొక్కలతో కూడిన పచ్చిక బయలు.. ఇవన్నీ చూడడానికి రెండు కళ్లూ సరిపోవు. ఇంతకీ ఎవరిదీ ఇంద్రభవనం? ఇంకెవరిది? సీఎం చంద్రబాబుది. 14 ఏళ్లు ముఖ్యమంత్రి.. కొడుకు ఎమ్మెల్సీ.. ఐటీ మంత్రి.. భార్యది పాల వ్యాపారం.. కోడలు కూరగాయల వ్యాపారం.. ఇంతమంది సంపాదిస్తున్నారు.. ఆమాత్రం బిల్డింగ్ కట్టుకోలేరా అని ఎవరైనా అనుకోవచ్చు... కానీ..కాణీ ఖర్చు కాకుండా అలాంటి ఇంద్ర భవనం ఎవరైనా కట్టగలరా..? నయాపైసా ఖర్చు లేకుండా ప్రపంచంలోనే ఖరీదైన ఇంటీరియర్ అమర్చుకోగలరా..?అసలు జేబులో రూపాయి తీయకుండా జూబ్లీహిల్స్‌లో భవనమా అని ఆశ్చర్యపోకండి..ఇవన్నీ సాధ్యమేనని చంద్రబాబుగారు నిరూపించారు. అదెలాగో చూడండి.. సాక్షి, అమరావతి: చంద్రబాబు గారి ఇంటి నిర్మాణం నుంచి ఇంటీరియర్స్ పనులన్నీ చేసిపెట్టింది ఆషామాషీ సంస్థ కాదు.. ఇంటి ప్లాన్ నుంచి నిర్మాణం, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్ సరఫరా వరకూ అన్నీ అదే చూసింది. అదే.. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న సంస్థ జెనిసిస్ ప్లానర్స్.. ఈ పేరెక్కడో విన్నట్లుంది కదూ.. రాజధాని అమరావతికి డిజైన్లను రూపొందించిన సంస్థ ఇది. అదేమిటి.. ఆ సంస్థ చంద్రబాబు ఇంటికి ఎందుకు ఖర్చుపెట్టింది? తెరవెనుక ఏం జరిగింది? కావాల్సిన వారి కోసం మకీని తప్పించారు.. రాజధాని అమరావతిలో నిర్మించే భవనాలకు అవసరమైన డిజైన్ల రూపకల్పనకు గాను తొలుత జపాన్‌లోని టోక్యోకు చెందిన మకి అండ్ అసోసియేట్స్‌ను చంద్రబాబు ప్రభుత్వం ఎంపిక చేసింది.. ఇందుకోసం ఆ సంస్థకు రూ.87 కోట్లు ఫీజుగా చెల్లించాలని నిర్ణయించారు. అయితే తనకు కావాల్సిన సంస్థలను పార్టనర్స్‌గా చేర్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మకి అసోసియేట్స్‌కి షరతు విధించారు. ముంబైకి చెందిన హఫీజ్ కాంట్రాక్టర్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన జెనిసిస్ ప్లానర్స్ను భాగస్వాములుగా చేర్చుకోవాలని చంద్రబాబు కండిషన్ పెట్టారట. ఇందుకు మకీ ససేమిరా అంది. దీంతో ముఖ్యమంత్రి ఆగ్రహించారు. మకీ అసోసియేట్స్‌ను డిజైన్ల రూపకల్పన బాధ్యత నుంచి ఏకపక్షంగా తప్పించేశారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ అప్పట్లోనే మకీ అసోసియేట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అవినీతి కార్యక్రమాలకు తమపై ఒత్తిడి తెచ్చారని, ఇందుకు అంగీకరించపోవడంతో ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేశారని మకీ ఆ లేఖలో స్పష్టం చేసింది. కాగా మకీని తప్పించిన నేపథ్యంలో డిజైన్ల కోసం కొత్తగా లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్‌ను ఎంపిక చేశారు. ఈ నార్మన్ ఫోస్టర్‌కు స్థానిక భాగస్వామిగా హఫీజ్ కాంట్రాక్టర్‌ను అధికారికంగా చేర్చారు. ఆ తర్వాత ముఖ్యనేత ఆదేశాలతో హైదరాబాద్‌కు చెందిన జెనిసిస్ ప్లానర్స్ను కూడా భాగస్వామిని చేశారు. రూ.250 కోట్లకు పెంచింది అందుకేనా... రాజధాని డిజైన్లను అధికారికంగా నార్మన్ ఫోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్‌కు అప్పగించామని ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత రహస్యంగా జెనిసిస్‌ను ఎందుకు చేర్చాల్సి వచ్చిందో చెప్పాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఫోస్టర్ తొలుత రూ.67.86 కోట్ల ఫీజుకు అంగీకరించి, సంప్రదింపుల తర్వాత రూ.60.72 కోట్లకే డిజైన్లు ఇచ్చేందుకు అంగీకరించిందంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. కానీ ఆ మొత్తాన్ని రూ.112.58 కోట్లకు ఎందుకు పెంచాల్సి వచ్చిందో.. అది కూడా కాదని.. రూ. 250 కోట్లకు పెంచేయడమేమిటో.. అందులోనూ రూ.210 కోట్లు హడావిడిగా ఎందుకు చెల్లించాల్సి వచ్చిందో సమాధానం లేని ప్రశ్నలు... ఆడిట్లో స్పష్టంగా దొరికిపోయిన ఆ రూ.130 కోట్లు మాత్రం జెనిసిస్ ద్వారా ‘ఇంటి’బాట పట్టాయని అధికారులు అంటున్నారు. రూ.60 కోట్ల నుంచి రూ.250 కోట్లకు.. నార్మన్ ఫోస్టర్ రూ.67.86 కోట్లకే రాజధాని డిజైన్లను రూపొందించేందుకు కోట్ చేసిందని, అయితే సంప్రదింపుల అనంతరం రూ.60.72 కోట్లకు ఆ మొత్తాన్ని తగ్గించామని, అంటే మకీ అసోసియేట్స్ కన్నా చాలా తక్కువకు నార్మన్ ఫోస్టర్‌ను ఎంపిక చేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెప్పింది. 15–12–2016వ తేదీన జరిగిన ఏపీసీఆర్డీఏ 12వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం మినిట్స్‌లో దీనిని పొందుపరిచారు. ఆ తర్వాతే అసలు కథ మొదలయ్యింది. 2017 జూన్ 16వ తేదీన జరిగిన ఏపీసీఆర్డీఏ 10వ అథారిటీ సమావేశంలో నార్మర్ ఫోస్టర్ ఫీజును రెట్టింపునకు పైగా రూ.112.58 కోట్లకు పెంచారు. కానీ ఇప్పటివరకు నార్మన్ ఫోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్, జెనిసిస్‌కు మొత్తం రూ.210 కోట్ల చెల్లింపులు చేయడం గమనార్హం. ఈ చెల్లింపులు సీఆర్డీఏ ఆడిట్ నివేదికల్లో స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటివరకు చెల్లించిన రూ.210 కోట్లలో హఫీజ్ కాంట్రాక్టర్‌కు రూ.40 కోట్లు ఇస్తే జెనిసిస్‌కు రూ.90 కోట్లు చెల్లించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ మొత్తం రూ.130 కోట్లూ జెనిసిస్ ద్వారా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ‘ఇంద్ర’భవనం కోసం మళ్లించేశారంటూ అధికార వర్గాలు ఇప్పుడు గుట్టు కాస్తా విప్పేశాయి. జెనిసిస్ ప్లానర్స్ అధినేత ‘ముఖ్య’ నేతకు సన్నిహితుడు కావడంతో, హఫీజ్ కాంట్రాక్టర్‌ను జత చేసి ఈ తతంగం అంతా నడిపించారని ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నతస్థాయి అధికారి ఒకరు చెప్పారు. జెనిసిస్ కోసం, తద్వారా ముఖ్యనేత కోసమే.. రాజధాని డిజైన్ల ఫీజును పెంచుకుంటూ వెళ్లినట్టుగా స్పష్టం అవుతోందని, ఇప్పటికే రూ.210 కోట్లు చెల్లించగా మరో రూ.40 కోట్లు చెల్లించాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
హైకోర్టు భవనానికి 11 డిజైన్లు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పరిపాలనా నగరంలో ప్రతిపాదించిన హైకోర్టు భవన నిర్మాణానికి నార్మన్ ఫోస్టర్ సంస్థ తాజాగా 11 డిజైన్లు రూపొందించింది. గతంలో ఇచ్చిన పలు డిజైన్లపై ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేయకపోవడంతో మళ్లీ కొత్త వి రూపొందించి సీఆర్డీఏకు సమర్పించింది. దీర్ఘ చతురస్రాకా రంలో పలు డిజైన్లు రూపొందించగా, భారత సంస్కృతిని ప్రతిబింబించేలా కొన్నింటిని ఫోస్టర్ సంస్థ రూపొందించింది. రేపు సీఆర్డీఏ అధికారులతో సీఎం సమావేశం ఏడాదిన్నర క్రితం బౌద్ధ స్థూపాకారంలో హైకోర్టు డిజైన్‌ను రూపొందించగా ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అయితే వీటిపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో ప్రభుత్వ సూచనల మేరకు ఫోస్టర్ సంస్థ కొత్త తరహా డిజైన్లు ఇచ్చినా ఆమోదం లభించలేదు. అసెంబ్లీ భవనానికి టవర్ ఆకృతి ఖరారు చేసిన సమయంలోనే స్థూపాకారంలో ఉన్న హైకోర్టు డిజైన్‌కు ప్రభుత్వం ప్రాథమికంగా అంగీకారం తెలిపింది. అయితే బాహ్య రూపం మార్చాలని చెప్పడంతో ఫోస్టర్ ప్రతినిధులు అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ఇచ్చిన డిజైన్లలో కొన్నింటికి పలు మార్పులు చేసి కొత్తవి తయారు చేయడంతోపాటు పూర్తిగా కొత్త తరహావి కూడా రూపొందించి ఇటీవలే సీఆర్డీఏకు సమర్పించారు. ప్రజల అభిప్రాయం కోసం వీటిని సోషల్ మీడియా, సీఆర్డీఏ వెబ్సైట్లో పొందుపరిచారు. బుధవారం జరిగే సీఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని పరిశీలించాక ఒకటి ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెండు ఐటీ టవర్లకు డిజైన్ల పరిశీలన రాజధాని అమరావతిలో నిర్మించాలని భావిస్తున్న ఐటీ టవర్లకు కూడా 19 డిజైన్లను పరిశీలిస్తున్నారు. ఐటీ పార్కులో రెండు ఐటీ టవర్ల నిర్మాణానికి సంబంధించి షాపూర్ జీ పల్లోంజి సంస్థ రూపొందించిన పలు డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర సంస్థల ప్రతిపాదనలు కూడా ఇవ్వాలని సూచించారు. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలతో 19 డిజైన్లను సిద్ధం చేసిన సీఆర్డీఏ ప్రజాభిప్రాయం కోసం వాటిని ఆన్లైన్లో పెట్టింది. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీతోపాటు ఇతర దేశాల్లోని ఐటీ టవర్లను అధ్యయనం చేసి వీటిని రూపొందించారు. ముఖ్యమంత్రి పరిశీలించాక ఇందులో ఒకటి ఖరారయ్యే అవకాశం ఉంది. -
మార్పులతో డిజైన్లకు ఆమోదం
సాక్షి, అమరావతి: రాజధాని డిజైన్ల వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించిన తుది డిజైన్ల పట్ల సీఎం చంద్రబాబునాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తంగా ఈ డిజైన్లకు ఆమోదం తెలిపిన సీఎం అదే సందర్భంలో కొన్ని మార్పులు సూచించారు. హైకోర్టు ఆకృతికి దాదాపుగా ఓకే చెప్పిన చంద్రబాబు అసెంబ్లీ ఆకృతిలో మరికొన్ని మార్పులు చేయాలని కోరారు. విదేశీ పర్యటనలో భాగంగా లండన్‌లో పర్యటిస్తున్న సీఎం బుధవారం మరోసారి ఆయన నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులతో విడతలవారీగా సమావేశమయ్యారు. సంస్థకు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ నార్మన్ రాబర్ట్ ఫోస్టర్తోనూ మాట్లాడారు. మరోవైపు సచివాలయం డిజైన్లకు ఆమోదం తెలియజేశారు. ఆ మేరకు సచివాలయాన్ని ఐదు టవర్లుగా నిర్మించనున్నారు. పలు సంస్థల అధిపతులతో సీఎం భేటీ.. లండన్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు బృందం పలు సంస్థల అధిపతులతో సమావేశమైంది. ఇందులో భాగంగా పంచదారకు ప్రత్యామ్నాయంగా సహజసిద్ధ చక్కెర(నేచురల్ స్వీటనర్)ను ఆహార, పానీయాల పరిశ్రమలకు అందిస్తున్న ప్యూర్ సర్కిల్ సంస్థ సీఈవో మెగోమెట్ మసగోవ్తో భేటీ అయింది. మసగోవ్ స్పందిస్తూ.. వచ్చేనెల మొదటివారంలో తమ బృందాన్ని రాష్టానికి పంపిస్తామని, నవంబర్ నెలాఖరులో తాను అమరావతికి వస్తానని తెలిపారు. యూకేలోని గ్లోబల్ కార్పొరేట్ బ్యాంకింగ్ సంస్థ శాంటండర్ ఇండియా డెస్క్ డైరెక్టర్ ఎడ్వర్ట్ డిక్సన్, ఎక్స్‌పోర్ట్స్ ఏజెన్సీ ఫైనాన్స్ అధిపతి ఫిలిప్స్‌తో సీఎం సమావేశమయ్యారు. కాగా, అమరావతిలో నెలకొల్పే హెల్త్ సిటీ ప్రాజెక్టు పనుల్ని డిసెంబర్ నుంచి మొదలుపెడతామని ఇండో–యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు చెందిన అజయ్ రాజన్‌గుప్తా తెలిపారు. టెలిమేటిక్ అండ్ బయోమెడికల్ సర్వీసెస్(టీబీఎస్) గ్రూప్ చైర్మన్, యూకేఐబీసీ విదేశీ వ్యవహారాల జీఎం నికోలా పాంగెర్తో సీఎం సమావేశమై ఏపీలో మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ కర్మాగారాన్ని నెలకొల్పాలని కోరారు.యూకే మంత్రి(సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్) ప్రీతి పటేల్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం తదితర అంశాల్ని వివరించారు. -
రాజధాని డిజైన్లపై లండన్‌లో సమాలోచనలు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లపై సీఎం చంద్రబాబునాయుడు లండన్‌లో నార్మన్ ఫోస్టర్ బృందంతో మంగళవారం రాత్రి సమావేశమయ్యారు. విదేశీ పర్యటనలో భాగంగా దుబాయ్ నుంచి మంగళవారం లండన్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. సినీ దర్శకుడు రాజమౌళితో కలసి ఫోస్టర్ బృందాన్ని కలుసుకున్నారు. రాత్రి బాగా పొద్దుపోయేవరకూ ప్రత్యేకంగా చర్చలు జరిపారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి లండన్‌కు చెందిన నార్మన్ పోస్టర్ సంస్థ ఇప్పటివరకు ఐదారుసార్లు డిజైన్లు రూపొందించినా అవి సీఎంను ఆకట్టుకోలేకపోవడం తెలిసిందే. మరోసారి రూపొందించిన డిజైన్లపై నార్మన్ పోస్టర్ సంస్థ అధినేత లార్డ్ ఫోస్టర్‌తో నేరుగా చంద్రబాబు, రాజమౌళి సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా డిజైన్లను వారు స్వయంగా పరిశీలించారు. అయితే ఎలాంటి డిజైన్ అయితే బాగుంటుందనే విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సమావేశంలో రాజమౌళితోపాటు సీఎం చంద్రబాబు కూర్చోగా ఉన్నతాధికారులు వారి వెనుక నిల్చోవడం గమనార్హం. లండన్ ప్రజా రవాణా వ్యవస్థ పరిశీలన.. అంతకుముందు సీఎం చంద్రబాబు తన బృందంతో కలసి లండన్ రవాణా విభాగం సెంట్రల్ కమాండ్ సెంటర్‌ను సందర్శించారు. భవిష్యత్తులో అమరావతిలో వాహనాల రద్దీ పెరుగుతుందనే అంచనాతో లండన్ తరహా రవాణా వ్యవస్థను నెలకొల్పే విషయమై అధ్యయనం చేశారు. లండన్ తరహా రవాణా వ్యవస్థను అమరావతిలో ఏర్పాటు చేసే అవకాశాల్ని పరిశీలించాలని రాష్ట్ర అధికారులకు సీఎం సూచించారు. ఈ సందర్భంగా లండన్ నగరంలో రైలు, బస్సు, కార్లు, భూగర్భ రైల్వే, ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలన్నింటినీ కమాండ్ సెంటర్ నుంచి నియంత్రించే విధానాన్ని అక్కడి అధికారులు సీఎం బృందానికి వివరించారు. లండన్‌లో 86 లక్షలకుపైగా జనాభా ఉండగా, ప్రతిరోజూ సెంట్రల్ లండన్‌కు 12 లక్షలమంది వచ్చి వెళ్తుంటారని, అక్కడ నివసించేవారి సంఖ్య లక్షమందేనని చెప్పారు. లండన్ తరహాలోనే అమరావతిలోనూ అక్కడ నివసించేవారికన్నా నిత్యం అనేక పనులతో వచ్చి వెళ్లేవారి సంఖ్యే అధికంగా ఉండే అవకాశముంటుందని, దానికి తగ్గట్టుగా ఇప్పటినుంచే పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కాగా, లండన్ చేరుకున్న చంద్రబాబును యూకేలోని భారత డిప్యూటీ హైకమిషనర్ దినేశ్ కె.పట్నాయక్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాజధానికి సంబంధించిన వివరాలను సీఎం ఆయనకు వివరించారు. -
‘నార్మన్ ఫోస్టర్’కు సలహాలిచ్చిన రాజమౌళి
సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగరంలో నిర్మించనున్న అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లపై సినీ దర్శకుడు రాజమౌళి లండన్‌లో నార్మన్ ఫోస్టర్ ఆర్కిటెక్ట్ సంస్థ ప్రతినిధులకు సలహాలిచ్చారు. రాజధాని డిజైన్లపై నార్మన్ ఫోస్టర్ సంస్థ రెండురోజులపాటు నిర్వహించిన సదస్సులో మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌తోపాటు రాజమౌళి బృందం కూడా పాల్గొంది. ఈ బృందాన్ని సీఆర్డీఏ అధికారులు ప్రత్యేకంగా లండన్ తీసుకెళ్లారు. సదస్సులో రాజమౌళి భవనాల డిజైన్లు ఎలా ఉండాలనే దానిపై ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీ భవనం ఎలా ఉండాలి, ఇక్కడి చరిత్ర, సంస్కృతి, వారసత్వం తదితర అంశాలను ఆయన వివరించినట్లు తెలిసింది. కొద్ది రోజుల కిందట ఫోస్టర్ సంస్థ ఇచ్చిన తుది డిజైన్లను తిరస్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, రాజమౌళిని సంప్రదించాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. -
చంద్రబాబుతో దర్శకుడు రాజమౌళి భేటీ
►రాజధాని డిజైన్లపై మళ్లీ లండన్‌కు సీఆర్డీఏ అధికారులు ►ఈ నెలాఖరు లేదా అక్టోబర్ మొదటివారంలో వెళ్లే అవకాశం ► తమ వెంట దర్శకుడు రాజమౌళిని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు ►మూడేళ్లుగా విదేశీ పర్యటనలు.. ►అయినా డిజైన్ల ఖరారులో తీవ్ర జాప్యం సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి బుధవారం ఉదయం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాజమౌళితో పాటు మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు కూడా పాల్గొన్నారు. ఏపీ రాజధానిలో నిర్మించబోయే అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్లపై చర్చించారు. రాజధాని డిజైన్ల విషయంలో సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా రాజమౌళి తెలిపారు. భేటీ అనంతరం రాజమౌళి మాట్లాడుతూ... రాజధాని డిజైన్లు ఎలా ఉండాలో సీఎం సూచించారు. మధ్యాహ్నం మరోసారి సీఎంను కలవనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్లను తిరస్కరించిన ముఖ్యమంత్రి వెంటనే రాజమౌళిని కలసి సలహాలు తీసుకోవాలని మంత్రి నారాయణను ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు టీవీ సీరియల్ మాదిరిగా సాగు..తున్న రాజధాని డిజైన్ల కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) అధికారులు మళ్లీ లండన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వీలైతే ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటివారంలో లండన్‌లోని నార్మన్ ఫోస్టర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాలని వారు భావిస్తున్నారు. తమతోపాటు దర్శకుడు రాజమౌళి, ఆయన అనుచరులను తీసుకెళ్లాలని చూస్తున్నారు. లండన్ వెళ్లడానికి తనకు ఇబ్బంది లేదని చెప్పిన రాజమౌళి దానికి ముందు సీఎంతో మాట్లాడి తన సినీ సెట్టింగ్‌ల అనుభవం డిజైన్ల రూపకల్పనకు ఏ మేరకు ఉపయోగపడుతుందో చర్చించినట్లు సమాచారం. అయినా ఆయన్ను లండన్ తీసుకెళ్లడానికి సీఆర్డీఏ అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిజైన్ల కోసం మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు మూడుసార్లు లండన్ వెళ్లారు. మూడు నెలల నుంచి వరుసగా లండన్ పర్యటనలు జరిపినా డిజైన్లు మాత్రం ఖరారు కాలేదు. వాస్తవానికి రాజధాని పేరుతో మూడేళ్ల నుంచి అదేపనిగా సీఆర్డీఏ అధికారులు విదేశీ యాత్రలు చేస్తూనే ఉన్నారు. 2015లో రాజధాని మాస్టర్ప్లాన్ల కోసం పలుమార్లు సింగపూర్‌లో పర్యటించారు. సీఎం చంద్రబాబే రెండుమార్లు సింగపూర్ వెళ్లగా అధికారుల బృందాలు నాలుగైదుసార్లు అక్కడికెళ్లి వచ్చాయి. 2016 ఆగస్టులో సీఆర్డీఏ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి ‘బెస్ట్ ప్రాక్టీసెస్ స్టడీ టూర్’ పేరుతో ఆస్థానా, టోక్యో, పుత్రజయ, సింగపూర్ వంటి పలు నగరాలను సందర్శించారు. అదేనెలలో రవాణా రంగంపై అధ్యయనం కోసం లండన్ వెళ్లారు. మళ్లీ సింగపూర్, చైనా, లండన్లలోనూ పలుసార్లు పర్యటించారు. ఈ ఏడాది ఇప్పటికే నాలుగుసార్లకుపైగా లండన్‌తో పాటు చైనాలో పర్యటన జరిపారు. ఇలా అదేపనిగా కోట్ల ఖర్చుతో విదేశీయాత్రలు చేస్తున్నా డిజైన్లు మాత్రం ఖరారవలేదు. ఈ నేపథ్యంలో మరలా లండన్ పర్యటనతో పాటు మళ్లీ రాజధాని కోసం ‘బెస్ట్ ప్రాక్టీసెస్ స్టడీ టూర్’ చేపట్టేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం. సంబంధిత వార్తలు... ‘బాహుబలి’ గ్రాఫిక్సే కావాలి డిజైన్లలో రాజీ పడను.. -
రాజధాని నిర్మాణం పేరుతో చెవిలో పూలు
సర్కారుపై పార్థసారథి ధ్వజం సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం పేరుతో జనం చెవుల్లో ఇంకెంతకాలం పూలు పెడతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. మూడున్నరేళ్ల తెలుగుదేశం పాలనలో అప్పులు పెరిగాయే కానీ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి రూ. 90వేల కోట్ల అప్పుంటే, చంద్రబాబు దాన్ని రూ. 2.25 లక్షల కోట్లకు పెంచారని తెలిపారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం పార్థసారథి మీడియా సమావేశంలో మాట్లాడారు. మూడున్నరేళ్లయినా రాజధాని నిర్మాణ ఆకృతులను ఖరారు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉండటం శోచనీయమన్నారు. తాము అధికారంలోకి వస్తే కేంద్రం నుంచి నిధులు రాబట్టి ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు మూడేన్నరేళ్లయినా డిజైన్లను సైతం ఖరారు చేయలేకపోయారని పార్థసారథి ధ్వజమెత్తారు. 2018 కల్లా మొదటి దశ రాజధాని నిర్మాణం పూర్తిచేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలమైందన్నారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకే డబ్బులు లేవని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెబుతుండగా... ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం ఏ విధంగా చేపడతారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. -
తుది డిజైన్లు వచ్చాయి
-
తుది డిజైన్లు వచ్చాయి
వీటిపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు నేడు మంత్రులతో సమావేశం సాక్షి, అమరావతి: రాజధాని పాలనా నగరంలో హైకోర్టు భవనం డిజైన్‌పై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. నార్మన్ ఫోస్టర్ బృందం బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఎంకు తుది డిజైన్లపై ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ...హైకోర్టు భవనం లోపల సౌకర్యాలు, అంతర్గత నిర్మాణ శైలిపై న్యాయమూర్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిపారు. బాహ్య ఆకృతి మాత్రం తనతోపాటు అందరికీ నచ్చేలా ఉండాలన్నారు.హైకోర్టు బాహ్య డిజైన్ అద్భుతంగా ఉండేలా రూపొందించి తీసుకురావాలన్నారు. మిగిలిన డిజైన్ల అంతర్గత నిర్మాణ శైలి బాగుందని, బాహ్య ఆకృతులపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుందామని తెలిపారు. వీటిపై మంత్రులు, ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు గురువారం ఉదయం పది గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. నాలుగు అంతస్తుల్లో అసెంబ్లీ ఫోస్టర్ సంస్థ ఇచ్చిన డిజైన్ల ప్రకారం అసెంబ్లీ భవనం వజ్రాకృతిలో నాలుగంతస్తుల్లో ఉంటుంది. మొదటి అంతస్థును నాలుగు భాగాలుగా విభజించి మధ్యలో పబ్లిక్ ప్లేస్ ఉంచారు. మొదటి అంతస్థును మంత్రులు, సీఎం, స్పీకర్, పబ్లిక్, ప్రెస్ కోసం కేటాయించి వాటికి నాలుగు వైపులా ద్వారాలు ఏర్పాటు చేశారు. శాసనసభ, మండలి కోసం రెండు వేర్వేరు భవనాలు ఈ సముదాయంలోనే అంతర్గతంగా ఉంటాయి. శాసనసభ కింది అంతస్థులోని మధ్య భాగం నుంచి వజ్రాకృతి మొదలై మొత్తం భవనంపై అంతస్థు వరకూ ఉంటుంది. సచివాలయానికి సంబంధించి మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు ఒకే ప్రాంగణంలో ఉండాలనే ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో రెండు ఆప్షన్లను పరిగణలోకి తీసుకున్నట్లు సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. -
రాజధాని డిజైన్లు ఇచ్చిన నార్మన్ ఫోస్టర్
సాక్షి, అమరావతి: ప్రభుత్వం సూచించిన మార్పుల ప్రకారం రాజధాని పరిపాలనా నగరం డిజైన్లను మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ సంస్థ సీఆర్డీఏకు సమర్పించింది. లండన్ నుంచి వచ్చిన సంస్థ ప్రతినిధులు మంగళవారం విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో తాము రూపొందించిన డిజైన్లపై అధికారులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్‌పై మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, మాస్టర్‌ప్లాన్ అధికారులు చర్చలు జరిపారు. అసెంబ్లీ భవనం డిజైన్ దాదాపు ఖరారు కావడంతో ప్రధానంగా హైకోర్టు భవనంపైనే ఫోస్టర్ సంస్థ దృష్టిపెట్టి పలు డిజైన్లు రూపొందించినట్లు తెలిసింది.సచివాలయ భవనానికి సంబంధించి కొన్ని డిజైన్లను ఫోస్టర్ ప్రతినిధులు అధికారుల ఎదుట ఉంచినట్లు సమాచారం. ఈ డిజైన్లను బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట పెట్టనున్నారు. -
900 ఎకరాల్లో ఏపీ రాజధాని అడ్మినిస్ట్రేటివ్ సిటీ
-
ఎవర్ని మోసం చేయడానికి...
-
900 ఎకరాల్లో ఏపీ రాజధాని అడ్మినిస్ట్రేటివ్ సిటీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిని అద్భుతంగా నిర్మిస్తామని మూడేళ్లుగా ఘనంగా చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం రాజధాని పరిపాలన నగరాన్ని 900 ఎకరాలకే పరిమితం చేయబోతోంది. అందులోనే అసెంబ్లీ, సచివాలయం,హైకోర్టు ఉండబోతున్నాయి. నదీ అభిముఖంగా అమరావతి నగరం 27 కిలోమీటర్ల పరిధిలో ఉంటుందని ప్రకటించింది. నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించిన డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో ప్రదర్శించింది. డిజైన్ల కోసం రకరకాల సంస్థల సేవలు ఉపయోగించుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు రాజధాని నిర్మాణంలో సలహాలు, సూచనలు తీసుకునేందుకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన కన్సల్టెంట్లను నియమించుకునే ఆలోచనలో ఉంది. రాజధాని పరిధిలో మొత్తం తొమ్మిది థీమ్ సిటీల నిర్మాణం చేపడతామని ప్రకటించింది. అలాగే రాజధానికి దారితీసే ఏడు ప్రాధాన్య రహదారులకు ఉగాది రోజున సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ డిజైన్లు కూడా తుది డిజైన్లు కాకపోవడం గమనార్హం. అయితే ఏప్రిల్ నెలాఖరు నాటికి తుది ప్రణాళిక ఖరారు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. 2018 డిసెంబర్ నాటికి ఐకానిక్ భవంతుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపింది. కాగా రాజధాని డిజైన్ ప్రజంటేషన్పై ప్రశ్నల పరంపరతో సర్కార్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఫోస్టర్ ప్రతినిధితో పాటు ఐఏఎస్ అధికారి శ్రీధర్‌కు ఎమ్మెల్యేలు ప్రశ్నలు సంధించారు. కొత్త రాజధాని డిజైన్‌లో రోడ్లు ఇరుకుగా ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనగా, క్యాపిటర్ వాటర్ బాడీస్‌కు నీళ్లు ఎక్కడ నుంచి తెస్తారని అధికారపార్టీ సభ్యుడు వేణుగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. హైకోర్టు సరే, న్యాయమూర్తులు ఉండే ప్రాంతానికి డిజైన్ ఎలా ఉంటుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అడిగారు. అయితే ఫోస్టర్ ప్రతినిధి ఇంగ్లీష్‌లో సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఐఏఎస్ అధికారి శ్రీధర్ తెలుగులో అనువదించి సమాధాలు చెప్పారు. ఎమ్మెల్యేల ప్రశ్నల పరంపర కొనసాగడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని ఇది తొలి కాపీ మాత్రమే అని చెప్పారు. ఇందులో చాలా మార్పులు ఉన్నాయని, ఎవరైనా సూచనలు ఇస్తే మార్పులు చేస్తామన్నారు. -
చెవిలో కాలీఫ్లవర్లు పెడుతున్నారు: రోజా
అమరావతి: శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు మరో డ్రామాకు తెర లేపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ రాజధానిని సింగపూర్‌లా కడతామంటూ గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేశారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే రోజా శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ రాజధానిపై ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు...సింగపూర్ డిజైన్లను గాలికొదిలేశారా అని ప్రశ్నించారు. మాకీ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకుని మరో సంస్థకు మార్చడం వెనుక మతలబు ఏంటో చెప్పాలన్నారు. ఎవరితో చర్చించకుండానే చంద్రబాబు రాజధానిని ఎంపిక చేశారని,ఆనాడు రాజధాని ఎంపిక విషయంలో ప్రతిపక్షాన్ని, అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని రోజా సూటిగా ప్రశ్నించారు. రాజధానిలో డిజైన్లలో 51 శాతం గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకునే చంద్రబాబు ....మూడు పంటలు పండే 33వేల ఎకకాల భూమిని లాక్కుని ఎక్కడ నుంచో తెచ్చి చెట్లు పెడతానని చెవిలో కాలీఫ్లవర్లు పెడుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. ప్రస్తుత రాజధానిలో చూసేందుకు ఓ చెట్టుకూడా లేదని అన్నారు. ఇక మహిళా మంత్రులు, ప్రతినిధులు వెళ్లేందుకు టాయిలెట్లు కూడా లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని ఆమె పేర్కొన్నారు. మొదట సింగపూర్ డిజైన్లు, తర్వాత పొగ గొట్టాల డిజైన్లను తెర మీదకు తెచ్చారని, తాజాగా ఫోస్టర్ సంస్థ డిజైన్లపై ప్రజంటేషన్ ఇస్తున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆ రెండు గ్రాఫిక్‌లను పక్కనపెట్టి ఇప్పుడు మూడో గ్రాఫిక్‌ను తెచ్చారని, దాన్ని కూడా ఖరారు చేస్తారో లేదో తెలియదన్నారు. రైతుల సమస్యలపై చర్చించాలని తాము కోరితే, గ్రాఫిక్ డిజైన్ల పేరుతో సభా సమయాన్ని వృధా చేస్తున్నారన్నారు. గతంలో సింగపూర్ సంస్థతో కుదుర్చుకున్న సీల్డ్ కవర్ ఒప్పందాన్ని అసెంబ్లీలో ఎందుకు బయటపెట్టలేదని రోజా డిమాండ్ చేశారు. అలాగే రాజధాని డిజైన్లలో ఏపీ సర్కార్ తమతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంపై మకీ సంస్థ కేంద్రానికి ఫిర్యాదు చేసిందన్నారు. దానిపై ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడంలేదని ఆమె ప్రశ్నించారు. ప్రజలకు చూపించాల్సింది బొమ్మలు కాదనీ, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే రాజధాని కావాలన్నారు. శాశ్వత రాజధాని డిజైన్లను సభలో ప్రదర్శించాలని రోజా డిమాండ్ చేశారు. గొప్పలు చెప్పుకుంటూ డిజైన్ల పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగానే, పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు వైఎస్ఆర్ సీపీ హాజరు కాలేదని ఆమె తెలిపారు. -
చెవిలో కాలీఫ్లవర్లు పెడుతున్నారు
-
ఎవర్ని మోసం చేయడానికి...: వైఎస్ జగన్
అమరావతి: మూడేళ్లు అయినా ఏపీ రాజధాని నిర్మాణానికి ఇటుక కూడా పెట్టలేదని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజధాని డిజైన్లను ఇవాళ అసెంబ్లీలో ప్రదర్శించారు. అయితే ఆ ప్రజంటేషన్‌కు వైఎస్ జగన్ హాజరు కాలేదు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఎవరిని మోసం చేయడానికి రాజధాని డిజైన్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్లు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజంటేషన్‌తో మరో గంట సమయం వృథా తప్ప ఒరిగేదేమీ లేదన్నారు. కాగా మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన రాజధాని పరిపాలనా నగరం వ్యూహ డిజైన్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ కొన్ని మార్పులు సూచించిన విషయం తెలిసిందే. పాలనా నగరం మీదగా నిర్మించాలనుకుంటున్న జలమార్గం, అందుకు అవసరం అయిన నీరు, రాజధాని భవిష్యత్ జల అవసరాలు, పులిచింతల ప్రాజెక్టు దిగువన నిర్మించబోయే బ్యారేజీ నుంచి వచ్చే నీటిపై జలవనరుల శాఖ, బ్లూ, గ్రీన్ కన్సల్టెంట్లతో చర్చించి తుది ప్రణాళిక ఇవ్వాలని సీఎం సూచనలు చేశారు.