
సాక్షి, అమరావతి: రాజధాని డిజైన్ల వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించిన తుది డిజైన్ల పట్ల సీఎం చంద్రబాబునాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తంగా ఈ డిజైన్లకు ఆమోదం తెలిపిన సీఎం అదే సందర్భంలో కొన్ని మార్పులు సూచించారు. హైకోర్టు ఆకృతికి దాదాపుగా ఓకే చెప్పిన చంద్రబాబు అసెంబ్లీ ఆకృతిలో మరికొన్ని మార్పులు చేయాలని కోరారు. విదేశీ పర్యటనలో భాగంగా లండన్‌లో పర్యటిస్తున్న సీఎం బుధవారం మరోసారి ఆయన నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులతో విడతలవారీగా సమావేశమయ్యారు. సంస్థకు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ నార్మన్ రాబర్ట్ ఫోస్టర్‌తోనూ మాట్లాడారు. మరోవైపు సచివాలయం డిజైన్లకు ఆమోదం తెలియజేశారు. ఆ మేరకు సచివాలయాన్ని ఐదు టవర్లుగా నిర్మించనున్నారు.
పలు సంస్థల అధిపతులతో సీఎం భేటీ..
లండన్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు బృందం పలు సంస్థల అధిపతులతో సమావేశమైంది. ఇందులో భాగంగా పంచదారకు ప్రత్యామ్నాయంగా సహజసిద్ధ చక్కెర(నేచురల్ స్వీటనర్)ను ఆహార, పానీయాల పరిశ్రమలకు అందిస్తున్న ప్యూర్ సర్కిల్ సంస్థ సీఈవో మెగోమెట్ మసగోవ్‌తో భేటీ అయింది. మసగోవ్ స్పందిస్తూ.. వచ్చేనెల మొదటివారంలో తమ బృందాన్ని రాష్టానికి పంపిస్తామని, నవంబర్ నెలాఖరులో తాను అమరావతికి వస్తానని తెలిపారు. యూకేలోని గ్లోబల్ కార్పొరేట్ బ్యాంకింగ్ సంస్థ శాంటండర్ ఇండియా డెస్క్ డైరెక్టర్ ఎడ్వర్ట్ డిక్సన్, ఎక్స్‌పోర్ట్స్ ఏజెన్సీ ఫైనాన్స్ అధిపతి ఫిలిప్స్‌తో సీఎం సమావేశమయ్యారు.
కాగా, అమరావతిలో నెలకొల్పే హెల్త్ సిటీ ప్రాజెక్టు పనుల్ని డిసెంబర్ నుంచి మొదలుపెడతామని ఇండో–యూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు చెందిన అజయ్ రాజన్‌గుప్తా తెలిపారు. టెలిమేటిక్ అండ్ బయోమెడికల్ సర్వీసెస్(టీబీఎస్) గ్రూప్ చైర్మన్, యూకేఐబీసీ విదేశీ వ్యవహారాల జీఎం నికోలా పాంగెర్‌తో సీఎం సమావేశమై ఏపీలో మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారీ కర్మాగారాన్ని నెలకొల్పాలని కోరారు.యూకే మంత్రి(సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్) ప్రీతి పటేల్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం తదితర అంశాల్ని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment