నార్మన్ ఫోస్టర్ గ్రూపు సభ్యులతో సీఎం చంద్రబాబు బృందం
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లపై సీఎం చంద్రబాబునాయుడు లండన్‌లో నార్మన్ ఫోస్టర్ బృందంతో మంగళవారం రాత్రి సమావేశమయ్యారు. విదేశీ పర్యటనలో భాగంగా దుబాయ్ నుంచి మంగళవారం లండన్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. సినీ దర్శకుడు రాజమౌళితో కలసి ఫోస్టర్ బృందాన్ని కలుసుకున్నారు. రాత్రి బాగా పొద్దుపోయేవరకూ ప్రత్యేకంగా చర్చలు జరిపారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి లండన్‌కు చెందిన నార్మన్ పోస్టర్ సంస్థ ఇప్పటివరకు ఐదారుసార్లు డిజైన్లు రూపొందించినా అవి సీఎంను ఆకట్టుకోలేకపోవడం తెలిసిందే.
మరోసారి రూపొందించిన డిజైన్లపై నార్మన్ పోస్టర్ సంస్థ అధినేత లార్డ్ ఫోస్టర్‌తో నేరుగా చంద్రబాబు, రాజమౌళి సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా డిజైన్లను వారు స్వయంగా పరిశీలించారు. అయితే ఎలాంటి డిజైన్ అయితే బాగుంటుందనే విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సమావేశంలో రాజమౌళితోపాటు సీఎం చంద్రబాబు కూర్చోగా ఉన్నతాధికారులు వారి వెనుక నిల్చోవడం గమనార్హం.
లండన్ ప్రజా రవాణా వ్యవస్థ పరిశీలన..
అంతకుముందు సీఎం చంద్రబాబు తన బృందంతో కలసి లండన్ రవాణా విభాగం సెంట్రల్ కమాండ్ సెంటర్‌ను సందర్శించారు. భవిష్యత్తులో అమరావతిలో వాహనాల రద్దీ పెరుగుతుందనే అంచనాతో లండన్ తరహా రవాణా వ్యవస్థను నెలకొల్పే విషయమై అధ్యయనం చేశారు. లండన్ తరహా రవాణా వ్యవస్థను అమరావతిలో ఏర్పాటు చేసే అవకాశాల్ని పరిశీలించాలని రాష్ట్ర అధికారులకు సీఎం సూచించారు. ఈ సందర్భంగా లండన్ నగరంలో రైలు, బస్సు, కార్లు, భూగర్భ రైల్వే, ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలన్నింటినీ కమాండ్ సెంటర్ నుంచి నియంత్రించే విధానాన్ని అక్కడి అధికారులు సీఎం బృందానికి వివరించారు. లండన్‌లో 86 లక్షలకుపైగా జనాభా ఉండగా, ప్రతిరోజూ సెంట్రల్ లండన్‌కు 12 లక్షలమంది వచ్చి వెళ్తుంటారని, అక్కడ నివసించేవారి సంఖ్య లక్షమందేనని చెప్పారు.
లండన్ తరహాలోనే అమరావతిలోనూ అక్కడ నివసించేవారికన్నా నిత్యం అనేక పనులతో వచ్చి వెళ్లేవారి సంఖ్యే అధికంగా ఉండే అవకాశముంటుందని, దానికి తగ్గట్టుగా ఇప్పటినుంచే పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కాగా, లండన్ చేరుకున్న చంద్రబాబును యూకేలోని భారత డిప్యూటీ హైకమిషనర్ దినేశ్ కె.పట్నాయక్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాజధానికి సంబంధించిన వివరాలను సీఎం ఆయనకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment