
చెవిలో కాలీఫ్లవర్లు పెడుతున్నారు: రోజా
అమరావతి: శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు మరో డ్రామాకు తెర లేపారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ రాజధానిని సింగపూర్‌లా కడతామంటూ గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేశారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే రోజా శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ రాజధానిపై ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు...సింగపూర్ డిజైన్లను గాలికొదిలేశారా అని ప్రశ్నించారు. మాకీ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకుని మరో సంస్థకు మార్చడం వెనుక మతలబు ఏంటో చెప్పాలన్నారు. ఎవరితో చర్చించకుండానే చంద్రబాబు రాజధానిని ఎంపిక చేశారని,ఆనాడు రాజధాని ఎంపిక విషయంలో ప్రతిపక్షాన్ని, అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని రోజా సూటిగా ప్రశ్నించారు.
రాజధానిలో డిజైన్లలో 51 శాతం గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకునే చంద్రబాబు ....మూడు పంటలు పండే 33వేల ఎకకాల భూమిని లాక్కుని ఎక్కడ నుంచో తెచ్చి చెట్లు పెడతానని చెవిలో కాలీఫ‍్లవర్లు పెడుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. ప్రస్తుత రాజధానిలో చూసేందుకు ఓ చెట్టుకూడా లేదని అన్నారు. ఇక మహిళా మంత్రులు, ప్రతినిధులు వెళ్లేందుకు టాయిలెట్లు కూడా లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని ఆమె పేర్కొన్నారు.
మొదట సింగపూర్ డిజైన్లు, తర్వాత పొగ గొట్టాల డిజైన్లను తెర మీదకు తెచ్చారని, తాజాగా ఫోస్టర్ సంస్థ డిజైన్లపై ప్రజంటేషన్ ఇస్తున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆ రెండు గ్రాఫిక్‌లను పక్కనపెట్టి ఇప్పుడు మూడో గ్రాఫిక్‌ను తెచ్చారని, దాన్ని కూడా ఖరారు చేస్తారో లేదో తెలియదన్నారు. రైతుల సమస్యలపై చర్చించాలని తాము కోరితే, గ్రాఫిక్ డిజైన్ల పేరుతో సభా సమయాన్ని వృధా చేస్తున్నారన్నారు.
గతంలో సింగపూర్ సంస్థతో కుదుర్చుకున్న సీల్డ్ కవర్ ఒప్పందాన్ని అసెంబ్లీలో ఎందుకు బయటపెట్టలేదని రోజా డిమాండ్ చేశారు. అలాగే రాజధాని డిజైన్లలో ఏపీ సర్కార్ తమతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంపై మకీ సంస్థ కేంద్రానికి ఫిర్యాదు చేసిందన్నారు. దానిపై ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడంలేదని ఆమె ప్రశ్నించారు. ప్రజలకు చూపించాల్సింది బొమ్మలు కాదనీ, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే రాజధాని కావాలన్నారు. శాశ్వత రాజధాని డిజైన్లను సభలో ప్రదర్శించాలని రోజా డిమాండ్ చేశారు. గొప్పలు చెప్పుకుంటూ డిజైన్ల పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగానే, పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు వైఎస్‌ఆర్ సీపీ హాజరు కాలేదని ఆమె తెలిపారు.