రాజధాని నిర్మాణం పేరుతో చెవిలో పూలు
సర్కారుపై పార్థసారథి ధ్వజం
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం పేరుతో జనం చెవుల్లో ఇంకెంతకాలం పూలు పెడతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. మూడున్నరేళ్ల తెలుగుదేశం పాలనలో అప్పులు పెరిగాయే కానీ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి రూ. 90వేల కోట్ల అప్పుంటే, చంద్రబాబు దాన్ని రూ. 2.25 లక్షల కోట్లకు పెంచారని తెలిపారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం పార్థసారథి మీడియా సమావేశంలో మాట్లాడారు. మూడున్నరేళ్లయినా రాజధాని నిర్మాణ ఆకృతులను ఖరారు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉండటం శోచనీయమన్నారు.
తాము అధికారంలోకి వస్తే కేంద్రం నుంచి నిధులు రాబట్టి ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు మూడేన్నరేళ్లయినా డిజైన్లను సైతం ఖరారు చేయలేకపోయారని పార్థసారథి ధ్వజమెత్తారు. 2018 కల్లా మొదటి దశ రాజధాని నిర్మాణం పూర్తిచేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలమైందన్నారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకే డబ్బులు లేవని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెబుతుండగా... ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం ఏ విధంగా చేపడతారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.