
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పరిపాలనా నగరంలో ప్రతిపాదించిన హైకోర్టు భవన నిర్మాణానికి నార్మన్ ఫోస్టర్ సంస్థ తాజాగా 11 డిజైన్లు రూపొందించింది. గతంలో ఇచ్చిన పలు డిజైన్లపై ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేయకపోవడంతో మళ్లీ కొత్త వి రూపొందించి సీఆర్‌డీఏకు సమర్పించింది. దీర్ఘ చతురస్రాకా రంలో పలు డిజైన్లు రూపొందించగా, భారత సంస్కృతిని ప్రతిబింబించేలా కొన్నింటిని ఫోస్టర్ సంస్థ రూపొందించింది.
రేపు సీఆర్‌డీఏ అధికారులతో సీఎం సమావేశం
ఏడాదిన్నర క్రితం బౌద్ధ స్థూపాకారంలో హైకోర్టు డిజైన్‌ను రూపొందించగా ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అయితే వీటిపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో ప్రభుత్వ సూచనల మేరకు ఫోస్టర్ సంస్థ కొత్త తరహా డిజైన్లు ఇచ్చినా ఆమోదం లభించలేదు. అసెంబ్లీ భవనానికి టవర్ ఆకృతి ఖరారు చేసిన సమయంలోనే స్థూపాకారంలో ఉన్న హైకోర్టు డిజైన్‌కు ప్రభుత్వం ప్రాథమికంగా అంగీకారం తెలిపింది. అయితే బాహ్య రూపం మార్చాలని చెప్పడంతో ఫోస్టర్ ప్రతినిధులు అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ఇచ్చిన డిజైన్లలో కొన్నింటికి పలు మార్పులు చేసి కొత్తవి తయారు చేయడంతోపాటు పూర్తిగా కొత్త తరహావి కూడా రూపొందించి ఇటీవలే సీఆర్‌డీఏకు సమర్పించారు. ప్రజల అభిప్రాయం కోసం వీటిని సోషల్ మీడియా, సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. బుధవారం జరిగే సీఆర్‌డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని పరిశీలించాక ఒకటి ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
రెండు ఐటీ టవర్లకు డిజైన్ల పరిశీలన
రాజధాని అమరావతిలో నిర్మించాలని భావిస్తున్న ఐటీ టవర్లకు కూడా 19 డిజైన్లను పరిశీలిస్తున్నారు. ఐటీ పార్కులో రెండు ఐటీ టవర్ల నిర్మాణానికి సంబంధించి షాపూర్ జీ పల్లోంజి సంస్థ రూపొందించిన పలు డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర సంస్థల ప్రతిపాదనలు కూడా ఇవ్వాలని సూచించారు. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలతో 19 డిజైన్లను సిద్ధం చేసిన సీఆర్‌డీఏ ప్రజాభిప్రాయం కోసం వాటిని ఆన్‌లైన్‌లో పెట్టింది. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీతోపాటు ఇతర దేశాల్లోని ఐటీ టవర్లను అధ్యయనం చేసి వీటిని రూపొందించారు. ముఖ్యమంత్రి పరిశీలించాక ఇందులో ఒకటి ఖరారయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment