సాక్షి, అమరావతి: ప్రభుత్వం సూచించిన మార్పుల ప్రకారం రాజధాని పరిపాలనా నగరం డిజైన్లను మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ సంస్థ సీఆర్‌డీఏకు సమర్పించింది. లండన్ నుంచి వచ్చిన సంస్థ ప్రతినిధులు మంగళవారం విజయవాడలోని సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో తాము రూపొందించిన డిజైన్లపై అధికారులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్‌పై మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, మాస్టర్‌ప్లాన్ అధికారులు చర్చలు జరిపారు. అసెంబ్లీ భవనం డిజైన్ దాదాపు ఖరారు కావడంతో ప్రధానంగా హైకోర్టు భవనంపైనే ఫోస్టర్ సంస్థ దృష్టిపెట్టి పలు డిజైన్లు రూపొందించినట్లు తెలిసింది.సచివాలయ భవనానికి సంబంధించి కొన్ని డిజైన్లను ఫోస్టర్ ప్రతినిధులు అధికారుల ఎదుట ఉంచినట్లు సమాచారం. ఈ డిజైన్లను బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట పెట్టనున్నారు.