చంద్రబాబుతో దర్శకుడు రాజమౌళి భేటీ | Star Director Rajamouli met Chandrababu Naidu over AP Capital Design | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో దర్శకుడు రాజమౌళి భేటీ

Published Wed, Sep 20 2017 9:44 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

చంద్రబాబుతో దర్శకుడు రాజమౌళి భేటీ - Sakshi

చంద్రబాబుతో దర్శకుడు రాజమౌళి భేటీ

►రాజధాని డిజైన్లపై మళ్లీ లండన్‌కు సీఆర్‌డీఏ అధికారులు
►ఈ నెలాఖరు లేదా అక్టోబర్‌ మొదటివారంలో వెళ్లే అవకాశం
► తమ వెంట దర్శకుడు రాజమౌళిని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు
►మూడేళ్లుగా విదేశీ పర్యటనలు..
►అయినా డిజైన్ల ఖరారులో తీవ్ర జాప్యం   


సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి బుధవారం ఉదయం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాజమౌళితో పాటు మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ అధికారులు కూడా పాల్గొన్నారు. ఏపీ  రాజధానిలో నిర్మించబోయే అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ ఇచ్చిన డిజైన్లపై చర్చించారు. రాజధాని డిజైన్ల విషయంలో సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా రాజమౌళి తెలిపారు.

భేటీ అనంతరం రాజమౌళి మాట్లాడుతూ... రాజధాని డిజైన్లు ఎలా ఉండాలో సీఎం సూచించారు. మధ్యాహ్నం మరోసారి సీఎంను కలవనున్నట్లు ఆయన వెల్లడించారు.  కాగా నార్మన్‌ ఫోస్టర్‌ ఇచ్చిన డిజైన్లను తిరస్కరించిన ముఖ్యమంత్రి వెంటనే రాజమౌళిని కలసి సలహాలు తీసుకోవాలని మంత్రి నారాయణను ఆదేశించిన విషయం తెలిసిందే.

మరోవైపు టీవీ సీరియల్‌ మాదిరిగా సాగు..తున్న రాజధాని డిజైన్ల కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) అధికారులు మళ్లీ లండన్‌ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వీలైతే ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటివారంలో లండన్‌లోని నార్మన్‌ ఫోస్టర్‌ ప్రధాన కార్యాలయానికి వెళ్లాలని వారు భావిస్తున్నారు. తమతోపాటు దర్శకుడు రాజమౌళి, ఆయన అనుచరులను తీసుకెళ్లాలని చూస్తున్నారు. లండన్‌ వెళ్లడానికి తనకు ఇబ్బంది లేదని చెప్పిన రాజమౌళి దానికి ముందు సీఎంతో మాట్లాడి తన సినీ సెట్టింగ్‌ల అనుభవం డిజైన్ల రూపకల్పనకు ఏ మేరకు ఉపయోగపడుతుందో చర్చించినట్లు సమాచారం. అయినా ఆయన్ను లండన్‌ తీసుకెళ్లడానికి సీఆర్‌డీఏ అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే డిజైన్ల కోసం మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ అధికారులు మూడుసార్లు లండన్‌ వెళ్లారు. మూడు నెలల నుంచి వరుసగా లండన్‌ పర్యటనలు జరిపినా డిజైన్లు మాత్రం ఖరారు కాలేదు. వాస్తవానికి రాజధాని పేరుతో మూడేళ్ల నుంచి అదేపనిగా సీఆర్‌డీఏ అధికారులు విదేశీ యాత్రలు చేస్తూనే ఉన్నారు. 2015లో రాజధాని మాస్టర్‌ప్లాన్ల కోసం పలుమార్లు సింగపూర్‌లో పర్యటించారు. సీఎం చంద్రబాబే రెండుమార్లు సింగపూర్‌ వెళ్లగా అధికారుల బృందాలు నాలుగైదుసార్లు అక్కడికెళ్లి వచ్చాయి. 2016 ఆగస్టులో సీఆర్‌డీఏ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి ‘బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ స్టడీ టూర్‌’ పేరుతో ఆస్థానా, టోక్యో, పుత్రజయ, సింగపూర్‌ వంటి పలు నగరాలను సందర్శించారు. అదేనెలలో రవాణా రంగంపై అధ్యయనం కోసం లండన్‌ వెళ్లారు.

మళ్లీ సింగపూర్, చైనా, లండన్‌లలోనూ పలుసార్లు పర్యటించారు. ఈ ఏడాది ఇప్పటికే నాలుగుసార్లకుపైగా లండన్‌తో పాటు చైనాలో పర్యటన జరిపారు. ఇలా అదేపనిగా కోట్ల ఖర్చుతో విదేశీయాత్రలు చేస్తున్నా డిజైన్లు మాత్రం ఖరారవలేదు. ఈ నేపథ్యంలో మరలా లండన్‌ పర్యటనతో పాటు మళ్లీ రాజధాని కోసం ‘బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ స్టడీ టూర్‌’ చేపట్టేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం.

 సంబంధిత వార్తలు...

‘బాహుబలి’ గ్రాఫిక్సే కావాలి

డిజైన్లలో రాజీ పడను..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement