
సాక్షి, అమరావతి: రాజధాని కోసం భూములిచ్చిన వంద మంది రైతులను సీఆర్డీఏ మూడు విడతలుగా సింగపూర్ తీసుకెళ్లనుంది. ఇందుకు రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అక్టోబర్ 22 నుంచి 26 వరకూ మొదటి బ్యాచ్‌ను, నవంబర్ ఐదు నుంచి తొమ్మిది వరకూ రెండో బ్యాచ్‌ను, నవంబర్ 19 నుంచి 23 వరకూ మూడో బ్యాచ్‌ను సింగపూర్ తీసుకెళ్లాలని నిర్ణయించింది. పర్యటనకు ఎంపికైన వారికి మూడు రాత్రులు, నాలుగు పగళ్ల వసతి, సింగపూర్‌లో స్థానిక రవాణా సదుపాయాన్ని మాత్రమే సీఆర్‌డీఏ కల్పిస్తుంది.
రానుపోనూ విమాన చార్జీలు, వీసా ఫీజు, ఆరోగ్య బీమా తదితర ఖర్చులన్నింటినీ రైతులే భరించుకోవాల్సి వుంటుంది. 2014 డిసెంబర్ ఎనిమిదో తేదీ నాటికి రాజధానిలో భూ యజమానిగా గుర్తింపు పొందిన వారు, భూసమీకరణ పథకం కింద రాజధాని నిర్మాణానికి భూములిచ్చి 9.14 అగ్రిమెంట్ పొందిన వారిని మాత్రమే ఈ పర్యటనకు అర్హులుగా పరిగణిస్తారు. వంద మంది కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే లాటరీ పద్ధతి ద్వారా రైతులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను అక్టోబరు ఐదో తేదీలోపు సమర్పించాల్సి వుంటుంది.