సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎల్లో మీడియా, అమరావతి రైతుల ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నారు. అక్కడ వచ్చేది కాలనీలు కావని.. ప్రపంచంలోనే అతి పెద్ద మురికివాడలు వస్తాయని తప్పుడు ప్రచారం చేస్తూ లబ్దిదారుల్లో అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా సీఆర్‌డీఏ పరిధిలో 50,793 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. పేదలకు ఇళ్ల స్థలాలివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్లి అడ్డుకోవడం చూశాం. పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని చంద్రబాబు అండ్ కో వాదించారు.
చంద్రబాబునాయుడు మరో అడుగు ముందుకేసి.. ఒక సెంట్ స్థలం సమాధులకు సరిపోతుందని వ్యాఖ్యానించడం.. దానిపై పేదలు, సామాజికవేత్తలు భగ్గుమనడంతో ఇప్పుడు తాజాగా ఆయన వర్గం మురికివాడలు అంటూ ప్రచారం ప్రారంభించింది.
పక్కా ప్లానింగ్‌తో నిర్మాణం
ప్రభుత్వం 25 లే అవుట్‌లలో 50,793 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ప్రతి లే అవుట్‌ను కూడా సీఆర్‌డీఏ, టౌన్ ప్లానింగ్ నిబంధనలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. లే అవుట్‌లో 38 శాతం మాత్రమే ప్లాట్ల కోసం, మిగిలిన స్థలాన్ని మౌలిక సదుపాయాల కోసం కేటాయించారు. ఉదాహరణకు కృష్ణాయపాలెం లే అవుట్ 58.15 ఎకరాల్లో వేశారు. ఇందులో 2,234 మంది లబ్దిదారులకు స్థలాలు కేటాయించారు. ప్రతి ప్లాట్ ఆరు మీటర్ల వెడల్పు, 6.80 మీటర్ల పొడవు ఉండేలా ఏర్పాటు చేశారు.
మొత్తం స్థలంలో 38.72 శాతం మాత్రమే ఇళ్ల స్థలాలకు కేటాయించారు. 36.52 శాతం రోడ్లకు, 10.28 శాతం భూమిని ఓపెన్ స్పేస్‌గా, ఇతర అవసరాల కోసం 8.79 శాతం, పార్కింగ్ కోసం 5.69 శాతం కేటాయించారు. ప్రతి లేఅవుట్‌లో ప్రధాన రహదారులు 40 అడుగులు, అంతర్గత రహదారులు 30 అడుగులు ఉండేలా ఏర్పాటు చేశారు. ప్రతి కాలనీలో అంగన్న్‌వాడీ కేంద్రం, విలేజి క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, పార్కులు ఏర్పాటు చేయనున్నారు.
పెద్ద లేఅవుట్లలో ప్రైమరీ స్కూల్ కూడా మంజూరు చేస్తారు. నవులూరు, కృష్ణాయపాలెంలో ఉన్న చెరువులను అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇన్ని మౌలిక సదుపాయాలతో వచ్చే కాలనీలు మురికివాడలు ఎలా అవుతాయో తెలుగుదేశం నాయకులే చెప్పాలని ప్రజలు నిలదీస్తున్నారు.
ఆధిపత్యం తగ్గిపోతుందని టీడీపీ భయం
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులో కూడా సామాజిక న్యాయం చేకూర్చడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. ఎన్‌టీఆర్, గుంటూరు జిల్లాలకు సంబంధించి 50,793 మందికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అందులో సగానికి పైగా బీసీలకు దక్కాయి. రెండు జిల్లాల్లో 26,869 మంది బీసీలకు, 8,495 మంది ఎస్సీలకు, 1579 మంది ఎస్టీలకు, మిగిలిన 13,850 మంది ఇతరులకు ఇళ్ల స్థలాలు వచ్చాయి. వీరందరూ వస్తే తమ ఆధిపత్యం తగ్గి పోతుందనే భయం తెలుగుదేశం పార్టీని వెంటాడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment