సీఎం చెప్పినా దిక్కులేదు
♦ విద్యుత్ పనులు జరగటం లేదు
♦ ఆత్మహత్య చేసుకుంటామన్నా రైతులను పట్టించుకోరా
♦ జెడ్పీ స్థాయీ సంఘ సమావేశంలో సభ్యుల ఆగ్రహం
సాక్షి, సంగారెడ్డి : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినా ఆయన సొంత నియోజకవర్గంలో కరెంటు పనులు సక్రమంగా సాగటంలేదు. కరెంటు కష్టాలు తీర్చాలంటూ ఎస్‌ఈ కార్యాలయం ముందు రైతులు పురుగుల మందు తీసుకుని ఆత్మహత్య చేసుకుంటామ న్నా స్పందించరు. ఇదేం పద్ధతి అంటూ ట్రాన్స్‌కో పనితీ రుపై జెడ్పీటీసీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం సంగారెడ్డిలోని జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి మురళీయాదవ్ అధ్యక్షతన పనులు, ప్రణాళిక-ఫైనాన్స్ స్థాయీ సంఘ సమావేలు జరిగాయి. సమావేశంలో పాల్గొన్న జెడ్పీటీసీలు నిధులు కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
జెడ్పీటీసీలకు నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని అధికారపార్టీ తీరును కాంగ్రెస్ జెడ్పీటీసీ ప్రభాకర్, పనుల కమిటీ సభ్యులు తప్పుబట్టారు. జిల్లా పరిషత్ నుంచి కేటాయిస్తున్న నిధులు, వ్యయంపై కాకి లెక్కలు చూపుతున్నారని జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో పాల్గొన్న అధికారులు జెడ్పీటీసీలను నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు సంతృప్తి చెందలేదు. ఇదిలా ఉంటే పనుల కమిటీ సభ్యురాలైన మెదక్ జెడ్పీటీసీ లావణ్యరెడ్డి... ప్రణాళిక-ఆర్థిక కమిటీ సమావేశంలో పాల్గొనటంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల కమిటీ సభ్యురాలైన ఆమె ఆర్థిక కమిటీ చర్చల్లో పాల్గొనటంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
వివక్ష తగదు...
జిల్లా పరిషత్ సభ్యులకు నిధులు కేటాయింపులో వివక్ష చూపటం సరికాదని పనుల కమిటీ సభ్యులు ప్రభాకర్, అంజయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. జెడ్పీ జనరల్ ఫండ్ ఇతర పద్దుల కింద సభ్యులకు పారదర్శకంగా నిధులు కేటాయించటం లేదన్నారు. సిద్దిపేట జెడ్పీటీసీకి రూ.71 లక్షలు కేటాయించి తమకు మాత్రం రూ.20 లక్షలు ఇచ్చారని, ఇదేం పద్ధతని అధికారులను ప్రశ్నించారు. దీనిపై జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి స్పందిస్తూ... వివక్షకు తావు లేదన్నారు.
ఏమిటీ నిర్లక్ష్యం!
జెడ్పీటీసీ సత్తయ్య మాట్లాడుతూ సీఎం నియోజకవర్గమైన గజ్వేల్‌లో కరెంటు పనుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించినా ఇంత వరకు పనులు పూర్తి చేయటంలేదన్నారు. నాలుగు సబ్‌స్టేషన్ పనులు, ఇతర పనులు నత్తనడకన సాగుతున్నట్లు చెప్పారు. జిన్నారం జెడ్పీటీసీ ప్రభాకర్... ఇటీవల సంగారెడ్డి మండలానికి చెందిన రైతులు కరెంటు సమస్యలు పరిష్కరించాలంటూ ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు ప్రయత్నించినా అధికారులు పట్టించుకోలేదన్నారు. తెల్లాపూర్‌లో ప్రియాసిమెంట్ సంస్థ మేళ్ల చెరువు శిఖం భూమి 30 గుంటలకు, సంకల్ప వెంచర్స్ 20 గుంటల భూమి ఆక్రమించుకున్నట్లు ఆరోపించారు.
సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాల్లోని చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్థారణలో అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించారు. పీఆర్ నుంచి చేపట్టిన పనులకు బిల్లుల మంజూరులో ఆలస్యం జరుగుతందని, దీనిని ఆరికట్టేందుకు ఈఈలు ఎక్కడిక్కడే నిధులు ఇచ్చేలా వెసులుబాటు కల్పించాలని ఈఈలు కోరారు. చైర్‌పర్సన్ రాజమణి స్పందిస్తూ ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని సీఈఓ, సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.