వ్యవసాయ, విద్యుత్ శాఖల సమీక్ష సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి
నల్లగొండ : ‘జిల్లా విద్యుత్ శాఖలో అధికారులు, ఉద్యోగులు అవినీతిని తగ్గించుకోండి.. చిన్న చిన్న తప్పులు చేసిన ఉద్యోగులు దొరుకుతున్నారు.. కానీ ఎప్పుడూ తప్పులు చేస్తూ తింటున్న వాళ్లు తప్పించుకుంటున్నారు.’అని జిల్లా విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సొంత శాఖ పనితీరుపైనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండ కలెక్టరేట్ కార్యాలయంలో విద్యుత్, వ్యవసాయ శాఖల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యుత్ శాఖ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.
ఇటీవల కాలంలో ఏసీబీ పట్టుబడిన కేసుల్లో ఎక్కువ మంది విద్యుత్ శాఖ ఏఈలే ఉన్నారు.. దీంతో కిందిస్థాయి ఉద్యోగులను ఉద్దేశిస్తూ మాట్లాడిన మంత్రి చిన్న చిన్న తప్పులకు అనవసరంగా బలవుతున్నారని...పై స్థాయిలో ఉంటూ ఎప్పుడూ తప్పులు చేస్తున్న అధికారులు సులువుగా తప్పించుకుంటున్నారని చురకలు అంటిం చారు. నిజాయితీగా మీరు వ్యవహరిస్తే.. మేం మీ జోలికి రాకుండా ఉంటామని.. మా వైపు నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలుఉంటాయని హామీ ఇచ్చారు.
సీఎం, మంత్రులు ఏవిధంగా అయితే నిజాయితీగా వ్యవహరిస్తున్నారో అదేవిధంగా అధికారులు నడుచుకోవాలని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్లు రిపేరుకు వచ్చిన వాటిని రోజుల తరబడి ఉంచుకోకుండా రెండు, మూడు గంటల్లో రిపేర్లు చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌ఫార్మర్ల కోసం డీడీలు కట్టిన రైతులకు ప్రాధాన్యత క్రమంలో మంజూరు చేయాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు అవసరమయితే తన దృష్టికి తీసుకరావాలన్నారు. డబ్బులు ఆశించకుండా పనిచేసేందుకు అధికారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
విత్తనాల కొరత రాకుండా చూడాలి
వర్షాలు కురుస్తున్నందున రైతులకు విత్తనాల కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదే శించారు. ఆరుతడి పంటలు వేసేందుకు రైతులు సిద్ధంగా ఉంటారు కాబట్టి పెసర, కంది విత్తనాల సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. జిల్లాకు సబ్సిడీ విత్తనాలు రాలేదన్న విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథితో ఫోన్‌లో మాట్లాడి జిల్లాకు తక్షణమే 4 వేల క్వింటాళ్ల పెసర విత్తనాలు పంపించాలని కోరారు. మన తెలంగాణ-మన వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ పనితీరును మంత్రి అభినందించారు.
జాతీయ ఆహార భద్రత మిషన్ పథకంలో భాగంగా ప్రతి మండలంలో వెయ్యి ఎకరాలు పెసర సాగు పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఎరువులు, విత్తనాలకు సంబంధించి రైతులు ఎలాం టి సమస్య ఎదుర్కొన్నా దానికి మండల స్థాయిలో పనిచేసే అధికారులే బాధ్యత వహించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ సమన్వయంతో ఏమండలానికి ఏ మేరకు ఎరువులు, విత్తనాలు అవసరమవుతాయో అంచనా వేయాలన్నారు. శాఖాపరంగా ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈస మావేశంలో కలెక్టర్ పి.సత్యనారాయణ రెడ్డి, జేసీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిషోర్, పాండ్య తదితరులు పాల్గొన్నారు.
అవినీతిని తగ్గించుకోండి
Published Wed, Jun 17 2015 11:56 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement