
పెదగొన్నూరులో రగులుతున్న చిచ్చు
- ఏడు ఇళ్లు దహనం
- రూ.10 లక్షల ఆస్తి నష్టం
నిన్నమొన్నటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలో కక్షల కార్చిచ్చు రాజుకుంది. 48 గంటల వ్యవధిలో గ్రామంలో ఒక హత్య, లక్షల విలువైన ధాన్యం రాశుల దహనం, తాజాగా ఏడు ఇళ్లు దగ్ధం ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
పెదగొన్నూరు (ముదినేపల్లి రూరల్), న్యూస్‌లైన్ : పెదగొన్నూరులో కక్షలు, కార్పణ్యాల చిచ్చు రగులుతూనే ఉంది. గ్రామంలో హత్య, ధాన్యం రాశుల దహనం ఘటనలు జరిగి 48 గంటలు గడవకముందే.. బుధవారం రెండో వర్గానికి చెందిన ఏడు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం రాత్రి గ్రామానికి చెందిన కోటప్రోలు గంగాధరరావు హత్యకు గురయ్యాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన పలువురు రైతుల ధాన్యం రాశులు, కుప్పలు, గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటనలు జరిగాయని, వీటన్నింటికీ గోకరకొండ ముత్యాలయ్య బాధ్యుడని స్థానికులు భావిస్తున్నారు. వారి అనుమానాలను బలపరుస్తూ ముత్యాలయ్య పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో నిందితుడైన ముత్యాలయ్య ఇంటినుంచి ఒక్కసారిగా మంటలు ఎగసి పడ్డాయి. వాటిని స్థానికులు అరికట్టే లోపుగానే ఇతర ఇళ్లకు వ్యాపించాయి. అదుపు చేయడం సాధ్యం కాకపోవడంతో ఏడు ఇళ్లు వరుసగా దగ్ధమయ్యాయి. ఇళ్లలోని నగదు, బంగారం, వెండి తదితర వస్తువులన్నీ కాలిపోయి.. బాధితులంతా కట్టుబట్టలతో మిగిలారు.
తప్పుదోవ పట్టించేందుకే...
హత్య, ధాన్యం దహనం చేసిన కేసులో నిందితుడు ముత్యాలయ్య పోలీసుల ఎదుట లొంగిపోయి స్టేషన్‌లోనే ఉన్నాడు. గ్రామంలో ముత్యాలయ్యపై తీవ్ర వ్యతిరే కత వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హతుడు గంగాధరరావు కుటుంబ సభ్యులపై దృష్టి మరల్చేందుకు ముత్యాలయ్య బావమరిది భార్య బత్తుల జ్యోతి మధ్యాహ్నం సమయంలో ముత్యాలయ్య ఇంటికి వచ్చి నిప్పంటించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ప్రమాద స్థలానికి చేరుకున్న గుడివాడ డీఎస్పీ జీ నాగన్న ఎదుట గ్రామస్తులంతా జ్యోతి మాత్రమే గృహ దహనాలకు కారణమని చెప్పారు. పలువురు మహిళలు ఇందుకు సంబంధించి డీఎస్పీకి వివరాలు తెలిపారు. వెంటనే స్పందించిన డీఎస్పీ జ్యోతిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. బాధితులంతా తమకు న్యాయంచేసి రక్షణ కల్పించాలని డీఎస్పీ, ఎస్‌ఐ వీ సతీష్‌లను కోరారు.
ప్రమాదంలో నిందితుడు ముత్యాలయ్య ఇంటితో పాటు తణుకు శ్రీనివాసరావు, బత్తుల క్రీస్తురాజు, వెంకట నాగమణి, రాములమ్మ, లక్ష్మీనరసింహం, నల్లగచ్చు వెంకటనారాయణ, నాంచారయ్యల ఇళ్లు కాలిపోయాయి. ఆర్‌ఐ గౌతమ్‌కుమార్, వీఆర్వో కాంతారావు బాధితులనుంచి వివరాలు సేకరించారు.
లక్ష రూపాయల నగదు కాలిపోయింది...
స్థలం రిజిస్ట్రేషన్ చేయించేందుకు, పొలం కౌలు చెల్లించేందుకు లక్ష రూపాయల నగదు ఇంట్లో దాచిపెట్టా. ప్రమాదంలో నగదుతో పాటు 5 కాసుల బంగారం, 10 తులాల వెండి కాలిపోయాయి.
- బత్తుల క్రీస్తురాజు, బాధితుడు
కట్టుబట్టలతో మిగిలాం
అగ్ని ప్రమాదంలో ఇంట్లోని వస్తువులు, పొలం దస్తావేజులు కాలిపోయాయి. కట్టుబట్టలతో మిగిలాం. ఏం పాపం చేశామని మాకిలాంటి పరిస్థితి ఏర్పడింది?
- నల్లగచ్చు నాగప్రసాద్, బాధితుడు
జ్యోతి వల్లే ప్రమాదం
ముత్యాలయ్య బంధువైన జ్యోతి ఇంటికి వచ్చి బయటకు వెళ్లిన వెంటనే ఆ ఇంటి నుంచి మంటలు వచ్చాయి. ప్రమాదానికి జ్యోతి కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
- ఎర్రంశెట్టి వరల క్ష్మి, ప్రత్యక్ష సాక్షి