
మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది
నాయుడుపేట టౌన్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలోని మేనకూరు పరిశ్రమల కేంద్రంలో ఉన్న లాయల్ టెక్స్‌టైల్స్ పరిశ్రమలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రూ.కోట్లలో ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారుల కథనం మేరకు.. పరిశ్రమలో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు రావడంతో కార్మికులు బయటకు పరుగులు పెట్టారు. పరిశ్రమ ప్రతినిధులు వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారమిచ్చారు.
అగ్ని మాపక శాఖ ఇన్‌చార్జి అధికారి టి.చలమయ్య ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేశారు. నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, కోట తదితర ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలను రప్చించారు. పరిశ్రమలోని దూది గోదాముతో పాటు వస్త్రాలు భద్రపరిచే గోడౌన్లను మంటలు చుట్టముట్టాయి. రాత్రి పొద్దు వరకు కూడా ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. సీఐ సోమయ్య సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలతో కలిసి వెళ్లి సహాయక కార్యక్రమాలు చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment