ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
రూ. 7 లక్షల ఆస్తి నష్టం
- మంటలను ఆర్పిన ఫైర్ సిబ్బంది
- శంషాబాద్ సమీపంలో ఘటన
శంషాబాద్: ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో అగ్ని ప్రమాదం జరిగి రూ. 7 లక్షలు విలువ చేసే ఆస్తినష్టం జరిగింది. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ పట్టణానికి సమీపంలో ఉన్న వైష్ణో ప్లాస్టిక్ పరిశ్రమలో పాత ప్లాస్టిక్ కవర్లను రీసైక్లింగ్ చేసి ముద్దలుగా తయారుచేస్తుంటారు. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పరిశ్రమలో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి.
పరిశ్రమలో భారీ ఎత్తున పాత ప్లాస్టిక్ కవర్లు ఉండడంతో మంటలు ఉధృతంగా వ్యాపించాయి. కంపెనీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రెండు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేయడానికి సుమారు రెండు గంటల పాటు సిబ్బంది కష్టపడ్డారు. కంపెనీలో ఉన్న ప్లాస్టిక్ కవర్ల పూర్తిగా కాలిపోవడంతో పాటు యంత్రాలకు కూడా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో రూ. 7 లక్షల మేరకు ఆస్తినష్టం జరిగిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.