టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు టీమార్ట్‌ అగ్ని ప్రమాదం కేసు | - | Sakshi
Sakshi News home page

టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు టీమార్ట్‌ అగ్ని ప్రమాదం కేసు

Jun 28 2023 1:04 AM | Updated on Jun 28 2023 11:27 AM

మంటల్లో కాలిపోయిన షాపు(ఫైల్‌)  - Sakshi

మంటల్లో కాలిపోయిన షాపు(ఫైల్‌)

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ నగరంలోని టీమార్ట్‌ అగ్నిప్రమాదం కేసు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చేరింది. నగరంలోని హైదరాబాద్‌ రోడ్డులోని ఆర్యనగర్‌లో గల టీమార్ట్‌ సూపర్‌ మార్కెట్‌లో 2022 ఆగస్టు 28న రాత్రి 2 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. టీమార్ట్‌లో ఉన్న సుమారు రూ. 2 కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితుడు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అగ్ని ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమా లేక ఇతర కారణలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. కేసులో నగరంలోని ఓ ప్రజాప్రతినిధి బంధువుతో పాటు మరి కొందరు, ఓ పోలీస్‌ అధికారి ఎంట్రీ కావడంతో కేసు డీలా పడింది. ప్రమాదానికి కారణమైన ఆధారాలను సేకరించిన పోలీసులు.. కొన్నింటిని లేకుండా చేశారనే ఆరోపణలున్నాయి. దీంతో కేసు ఆలస్యం కావడంతో బాధితుడు కొంత కాలంగా పోలీసు అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇన్‌చార్జి సీపీ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఏసీపీ కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో టీమార్ట్‌ కేసు ఫైల్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. కేసును ట్రాస్క్‌ఫోర్స్‌కు అప్పగించడంతో కేసు వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

రంగంలోకి టాస్క్‌ఫోర్స్‌
టీమార్ట్‌ అగ్నిప్రమాదం కేసును నీరుకార్చడానికి ప్రయత్నించిన ఓ ప్రజాప్రతినిధి బంధువు, ఓ పోలీసు అధికారి, కొంత మంది వివరాలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. కేసును పక్కదారి పట్టించడానికి ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. దీంతో 10 నెలలుగా కేసును పోలీసులు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. తాజాగా ఈ కేసును మళ్లీ టాస్క్‌ఫోర్స్‌కు చేరడంతో ప్రజాప్రతినిధి బంధువుతో పాటు ఓ పోలీసు అధికారి, మరి కొందరు కలిసి బాధితుడితో ఒప్పందం పేరుతో రాజీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

మంత్రి, సీపీకి ఫిర్యాదు చేయడంతో..!
బాధితుడు శేఖర్‌ అగ్నిప్రమాదం కేసు విషయమై మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఇన్‌చార్జి సీపీ ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసును పరిశీలించాలని పోలీసులకు మంత్రి ఆదేశాాలు జారీ చేయడంతో టీమార్ట్‌ కేసులో పురోగతి వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఏసీపీ కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కేసు వివరాలను సేకరించే పనిలో పడినట్లు తెలిసింది. కేసు ఈ సారైనా కొలిక్కి వస్తుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది. అయితే కేసు విషయమై టాస్క్‌ఫోర్స్‌ సీఐ శ్రీధర్‌ను సంప్రదించగా ఇన్‌చార్జి సీపీ, ఏసీపీల ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement