
బూడిదే మిగిలింది
చొర్లంగిలో 25 ఎకరాల వరికుప్పలు దగ్ధం
రూ.7.5 లక్షల ఆస్తి నష్టం
చొర్లంగి(ఎల్.ఎన్.పేట): మండలంలోని చొర్లంగి గ్రామంలో వరిచేను కుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి తరువాత జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 25 ఎకరాలకు చెందిన వరిచేను కుప్ప లు కాలిపోయాయి. ప్రమాదం అర్ధరాత్రి సమయంలో జరగడం.. ఎవరూ గుర్తించకపోవడంతో తెల్లవారే సరికి బూడిదే మిగిలింది. బాధితులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన 9 మంది రైతు లు వరి పంటను కళ్లాల్లో కుప్పలుగా ఉంచారు. ఈ రైతు ల్లో ఒకరైన కరగాన సూరప్పడు తన కళ్లంలో విత్తనాలకు సంబంధించిన చేను మంగళవారమే నూర్చాడు. అదే రోజు రాత్రి అగ్ని ప్రమాదం జరగడంతో తాము సాగు చేస్తున్న భూమిపై వివాదం చేస్తున్న గిరిజనులే కుప్పలకు నిప్పంటించి ఉంటారని బాధితులు ఆరోపిస్తున్నారు.
అగ్ని ప్రమాదంలో రైతులు లండ పాపినాయుడువి 6 ఎకరాలు, కరగాన సూరప్పడుకు చెందిన 4 ఎకరాలు, కరగాన సింహాద్రినాయుడువి 3 ఎకరాలు, కరగాన రామస్వామివి 2 ఎకరాలు, కరగాన వరహాలునాయుడువి 3 ఎకరాలు, లండ మొఖలింగంవి 3 ఎకరాలు, లండ రామారావుది ఎకరా, మహాంతి అర్జునది ఎకరా, బుడ్డపు రామారావుకు చెందిన 1.5 ఎకరాల్లోని పంట అగ్నికి ఆహుతైంది. పంటంతా కాలిపోవడంతో బాధిత రైతులు బోరుమన్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.7.5 లక్షల ఆస్తినష్టం జరిగి ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు.
భూమి వివాదాలే కారణమా?
30 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ విధిస్తూ చొర్లంగికి సమీపంలో ఉన్న బిడ్డికిపేట గ్రామం జాతాపు తెగకు చెందిన కొంతమందికి సుమారు 6 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. ఆయా లబ్ధిదారులు భూములను పక్క గ్రామాలకు చెందిన రైతులకు అమ్ముకున్నారు. కొన్నాళ్లుగా జాతాపు తెగవారు తమ భూములను తమకు అప్పగించాలని కొనుగోలు చేసిన రైతులను డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది జూన్, జూలైల్లో మండల పెద్దల సమక్షంలో తగాదా కూడా జరిగింది. అప్పటికే పంటలు వేశారని, కోతలు పూర్తయిన తరువాత రైతుల వద్ద తీసుకున్న నగదు చెల్లించి భూములు స్వాధీనం చేసుకోవాలని పెద్దలు సూచించారు. అయితే భూములు అప్పగించలేదన్న ఉద్దేశంతో గిరిజనులు పంటలకు నిప్పు అంటించి ఉంటారని పలువురు ఆరోపిస్తున్నారు. బిడ్డికిపేటకు చెందిన నిమ్మక ఎర్రయ్య, కుండంగి భుజంగరావు, నిమ్మక బారికి, నిమ్మక అప్పారావు, నిమ్మక రవి, కుండంగి మజ్జిబాబు, నిమ్మక ప్రశాంత్‌లతో పాటు గార్లపాడుకు చెందిన కడ్రక సింహాచలం అగ్ని ప్రమాదానికి కారణమై ఉంటారని బాధిత రైతులు సరుబుజ్జిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎం.శ్రీనివాస్ చెప్పారు.