
రాష్ట్రాభివృద్ధికి సహకరించండి
⇒ చైనా మంత్రులు, కమ్యూనిస్టు పార్టీ అగ్రనేతలతో చంద్రబాబు భేటీ
⇒ సీఎంకు సిచువాన్ గవర్నర్ విందు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన చైనా పర్యటనలో నాలుగోరోజు.. బుధవారం బీజింగ్‌లో ఆ దేశ మంత్రులు, కమ్యూనిస్టు పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న మౌలిక వసతులను ఆయన వారికి వివరించారు.
అనంతరం చంద్రబాబు బృందం చెంగ్డో నగరానికి చేరుకుంది. చంద్రబాబు గౌరవార్థం సిచువాన్ ప్రావిన్స్ గవర్నర్ వుయ్ హంగ్ విందు ఇచ్చారు. ఆయనతో భేటీ అయిన చంద్రబాబు మాట్లాడుతూ.. చైనా స్వల్ప కాలంలో గణనీయంగా అభివృద్ధి సాధించిందని, ఇదెలా సాధ్యమైందో పరిశీలించేందుకు తాను చైనా వచ్చానని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో పరస్పరం సహకరించుకుందామన్నారు. విద్యారంగంలో సిచువాన్ అగ్రగామిగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ.. ఏపీని ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చాలన్న తమ లక్ష్యసాధనకు సహకరించాలని హంగ్‌ను కోరారు.
ఏపీలో ఉన్న సహజ సంపదలను చంద్రబాబు వివరించారు. వుయ్ హంగ్ మాట్లాడుతూ.. ఐటీ, వ్యవసాయ రంగంలో ఏపీ బాగున్నప్పటికీ నిర్మాణ రంగంలో మౌలికసదుపాయాల్లో మెరుగుపడాల్సి ఉందని అన్నారు. సిచువాన్, ఏపీలు సోదర భావంతో కలసి పని చేయాలని చెప్పారు. గురువారం నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి 130 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు హాజరవుతారని తెలిపారు. చంద్రబాబు గవర్నర్ హంగ్‌ను భారత్ పర్యటనకు ఆహ్వానించి.. ఏపీలో కొన్ని రోజులు ఉండాలని కోరారు.
భారతదేశానికి వస్తే మొదట ఏపీకి వస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు ఏపీ ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.. చెంగ్డో నగరంలోని రహదారుల సందర్శనకు చంద్రబాబు బృందం ఆసక్తి చూపించడంతో అందుకు గురువారం వేకువజామున ఏర్పాట్లు చేస్తామని హంగ్ చెప్పారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కార్మిక మంత్రి కె.అచ్చెన్నాయుడు, ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ఎంపీలు సీఎం రమేష్, గల్లా జయదేవ్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సతీష్ చంద్ర, పీవీ రమేష్, ఎస్.ఎస్.రావత్, అజయ్ జైన్, కార్తికేయ మిశ్రా, సీహెచ్. వెంకయ్య చౌదరి తదితరులున్నారు.
పంట, ఆస్తి నష్టంపై ఆరా..
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో వాటిల్లిన పంట, ఆస్తి నష్టంపై ముఖ్యమంత్రి బుధవారం ఇక్కడి అధికారులతో సమీక్షించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని మంత్రులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఇతర అధికారులను ఆదేశించారు. పంట, ఆస్తి నష్టంపై సమగ్ర నివేదికను రూపొందించేందుకు వెంటనే సర్వే ప్రారంభించాలని ఆదేశించినట్టు సమాచార సలహాదారు కార్యాలయం పేర్కొంది.