ఘట్‌కేసర్: ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరగడంతో రూ. 5 లక్షల ఆస్తినష్టం సంభవించింది. ఈ సంఘటన మండలంలోని ఏదులాబాద్ అనుబంధ మర్పల్లిగూడలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. సకాలంలో ఫైర్ ఇంజిన్ రాకపోవడంతో స్థానికులు బకెట్లతో నీళ్లుపోసి మంటలు ఆర్పారు. వివరాలు.. మర్పల్లిగూడలోని కేకే పాలిమర్స్ పరిశ్రమను నగరానికి చెందిన ఖాజా ఖలీముద్దీన్ లీజుకు తీసుకొని నాలుగేళ్లుగా నడిపిస్తున్నాడు.
నగరంలోని పలు ప్రింటింగ్ ప్రెస్‌లలోని వేస్టేజీ, సీడ్స్ కంపెనీల్లోని ప్యాకేజీలకు సంబంధించిన నిరుపయోగమైన ప్లాస్టిక్ బ్యాగులను, ఇతర వస్తువులను తీసుకువచ్చి రీసైక్లింగ్ చేసి ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ తయారు చేస్తుంటారు. వీటి ద్వారా పైపులు, షీట్‌లు తయారు చేసి విక్రయిస్తుంటారు. పరిశ్రమలో సుమారు 12 మంది కార్మికులు పనిచేస్తున్నారు. సోమవారం కంపెనీ ఆవరణలో ప్లాస్టిక్ వేస్టేజీ కుప్పలుగా ఉంది. దానికి సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో నిప్పురవ్వలు ఏర్పడి ప్లాస్టిక్ వేస్టేజీ పైన పడ్డాయి. దీంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి.
గమనించిన సిబ్బంది పరిశ్రమలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ సిలిండర్లను ఉపయోగించినా ఫలితం లేకుండా పోయింది. కొంత ప్లాస్టిక్ ముడిసరుకును దూరంగా వేశారు. ఫైరింజన్‌కు సమాచారం ఇచ్చినా సకాలంలో రాలేకపోయింది. దీంతో మర్పల్లిగూడ యువకులు, పరిశ్రమ సిబ్బంది కలిసి బకెట్లతో నీటిని పోసి గంటసేపు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం తాపీగా అగ్నిమాపక వాహనం వచ్చి పూర్తిగా మంటలను పూర్తిగా ఆర్పేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రాణనష్టం సంభవించకపోవడంతో కంపెనీ యాజమాన్యం, స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.
ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
Published Mon, Aug 25 2014 11:41 PM | Last Updated on Fri, Mar 22 2019 7:18 PM
Advertisement