గుడిసెలు కాలిపోవడంతో దీనస్థితిలో కూర్చొని ఉన్న బాధితులు (ఇన్‌సెట్) మంటల్లో కాలి చనిపోయిన సర్పం
వారంతా నిరుపేదలు... పనికి వెళ్తేనే పూట గడిచేది... లేకపోతే పస్తులే... ఎంతో కష్టపడి తలదాచుకోవడానికి గూడు వేసుకున్నారు... రోజు వారి జీవనానికి అవసరమయ్యే వస్తువులను సమకూర్చున్నారు... అంతో ఇంతో కూడబెట్టుకున్నారు... ఒక్క సారిగా వారి జీవితాన్ని.. అగ్ని ప్రమాదం బుగ్గిపాలు చేసింది... గుడిసెలు కాలిపోయాయి... అందులో ఉన్న కొద్దిపాటి సామగ్రి బూడిదైంది... కట్టుబట్టలతో మిగిలారు... పుస్తకాలు కాలిపోవడంతో తాము బడికెలా వెళ్లాలని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... ఇది బద్వేలు సమీపంలోని బాధితుల పరి(దు)స్థితి.
బద్వేలు/బద్వేలు అర్బన్ : బద్వేలు సమీపంలోని నెల్లూరు రోడ్డులో గురుకుల పాఠశాల వెనుక ప్రాంతంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయారు. అక్కడ దాదాపు 3,200 మంది ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగించే వారు. గురువారం రాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో మొత్తం 2 వేల గుడిసెలు కాలిపోయాయి. దాదాపు ఆరు వేల మంది నిరాశ్రయులుగా మిగిలారు. రూ.60 లక్షల పైనే ఆస్తి నష్టం సంభవించింది. ఈ ప్రమాదం జరగడానికి గల కారణం స్థానికులు తెలిపిన ప్రకారం ఇలా ఉంది. ఒక గుడిసెలో వంట చేస్తుండగా నిప్పురవ్వలు చెలరేగి మంటలు వ్యాపించాయి. గాలితో ఇవి చాలా స్వల్ప సమయంలో మిగతా గుడిసెలకు వ్యాపించాయి. ఆ గుడిసెలన్నింటినీ కేవలం ఎండుకర్రలు, బోద, ప్లాస్టిక్‌తో నిర్మించారు. దీంతో మంటలు అదుపులోకి రాలేదు. మంటలు నలుదిశలా వ్యాపించడంతో ఆగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చేందుకు వీలు లేని పరిస్థితి ఏర్పడింది. ఒక గుడిసె నుంచి మరో గుడిసెకు ఇలా... రెండు గంట వ్యవధిలో రెండు వేల గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. తెల్లవారే సరికి బూడిద మాత్రమే మిగిలింది.
అధిక శాతం దినసరి కూలీలే: బాధితులలో చాలా మంది దినసరి కూలీలే. కూ లికెళితే గానీ పూట గడవని పరిస్థితి. మున్సిపల్ కూలీలు, హమాలీలు, బేల్దారులు, మెకానిక్ షెడ్డులలోని దినసరి కూలీలు.. ఇలా ప్రతి ఒక్కరూ రోజూ పనికి వెళ్లి జీవనం సాగించే వారే. ఈ స్థలం మంజూరు చేయాలని కోరుతూ.. వీరంతా ఇక్కడే నివాసం ఉంటున్నారు. ప్రస్తుత ప్రమాదంలో సర్వస్వం కోల్పోయారు. కట్టుబట్టతో మిగిలారు. అధిక శాతం మందిది ఇదే పరిస్థితి.
ఏమీ మిగల్లే..
ప్రమాదంలో అగ్ని కీలలు చుట్టుపక్కల ఒక్కసారిగా వ్యాపించాయి. గాలులతో అవి తీవ్రమయ్యాయి. ఉన్నవి చిన్నపాటి గది ఉన్న గుడిసెలే. చాలా మంది సామగ్రిని అదే గుడిసెలలో ఉంచుకుని జీవనం సాగిస్తున్నారు. ఆగ్ని ప్రమాదం విషయం తెలుసుకునేలోపే ప్లాస్టిక్ పట్టలు, బోదతో మంటలు చుట్టుముట్టాయి. దీంతో ఒక్కరూ కూడా తమ సామగ్రిని బయటకు తెచ్చుకునే అవకాశం లేకపోయింది. సిలిండర్లు పేలే ప్రమాదం ఉండటంతో.. బాధితులు తమ గుడిసెల వద్దకు వెళ్లేందుకు సాహసం చేయలేదు. ప్రమాదంలో నాలుగు సిలిండర్లు సైతం పేలిపోయాయి.
నుసిగా మారిన పుస్తకాలు, గుర్తింపు కార్డులు
ప్రభుత్వ స్థలంలో ని వాసముంటున్న తమ కు అధికారులు స్థలం కేటాయించాలనే ఉద్దేశంతో.. చాలా మంది అక్కడే ఆ ధార్‌కార్డులు, రేషన్‌కార్డులు తెచ్చుకుని ఉంటున్నారు. ప్రమాదంలో వీరంతా వాటితోపాటు తాము పని చేసే సంస్థలలో ఇచ్చిన గుర్తింపుకార్డులను పొగోట్టుకున్నారు. ప్రస్తుతం వీటితో ఏదైనా అవసరం పడితే తమ పరిస్థితి ఏమిటని బాధితులు వాపోతున్నారు. గుడిసెలలో నివాసముంటున్న వారి పిల్లలు దాదాపు 200 మంది చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యపురం, మార్తోమ నగర్, గౌరీశంకర్ నగర్ పాఠశాలలో చదువుకుంటున్నారు. ప్రమాదంలో వీరంతా తమ దుస్తులతో పాటు పుస్తకాలు, బ్యాగులను పొగోట్టుకున్నారు. తాము పాఠశాలకు వెళ్లాలంటే ఎలా అని వారు వాపోతున్నారు.
రూ.50 వేలు నష్టపోయా
ప్రమాదంలో రూ.50 వేలు పైనే నష్టపోయా. కూలీ పనికెళ్లి పైసా పైసా కూడబెట్టి సామగ్రిని సమకూర్చుకోగా.. కేవలం నిమిషాల వ్యవధిలో అన్ని కోల్పోయా. పెట్టలో ఉన్న బంగారం, నగదు, టీవీ, ఇతర సామగ్రి ఇలా అన్ని బూడిదగా మారాయి. – సరోజ, బాధితురాలు
స్థలం కోసమే అగచాట్లు
ఇక్కడ స్థలమిస్తారనే ఉద్దేశంతో గుడిసె వేసుకుని ఉంటున్నాం. చలితో నెల కిందట అనారోగ్యం బారిన పడి మా తల్లి కూడా మరణించింది. ఇదే ప్రాంతంలో గత మూడు నెలల కాలంలో ముగ్గురు వృద్ధులు చలితో చనిపోయారు. స్థలం వస్తుందని ఇక్కడే ఉంటే.. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలాం. – సుబ్బరాయుడు, బాధితుడు
Comments
Please login to add a commentAdd a comment