Squatters
-
ఆక్రమిత స్థలాల క్రమబద్దీకరణ: 80 శాతంపైగా తిరస్కరణ?
సాక్షి, హైదరాబాద్: సర్కారు అక్రమిత నివాస స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తులో సుమారు 80 శాతం పైగా తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. మిగతా దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ ప్రారంభమైంది. గత మూడు నెలల క్రితమే జీవో 58 కింద దరఖాస్తులపై విచారణ పూర్తి కాగా, తాజాగా జీవో 59 కింద దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ ప్రారంభమైంది. ప్రతి మండలానికీ ఒక జిల్లా స్థాయి అధికారిని కేటాయించడం ద్వారా క్రమబద్దీకరణ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను వేగవంతంగా కొనసాగుతోంది.గతంలో పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను మరోసారి పరిశీలించి అన్నీ సవ్యంగా ఉంటే క్రమబద్దీకరిస్తారు. చదవండి: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో వెళ్లొద్దు ప్రభుత్వ విలువ ఆధారంగా.. 59 జీవో కింద అక్రమిత స్థలాలను ప్రభుత్వం నిర్ధారించిన భూమి విలువ ఆధారంగా క్రమబద్దీకరించనున్నారు. 126 నుంచి 250 గజాల వరకు ప్రభుత్వం నిర్ధారించిన భూమి విలువలో 25 శాతం.. 251 నుంచి 500 గజాల వరకు 50 శాతం.. 500 నుంచి 100 గజాల వరకు 75 శాతం.. 1000 గజాలపైన పూర్తి విలువను దరఖాస్తుదారులు చెల్లించాల్సి ఉంటుంది. రెండు నెలల క్రితమే.. జీవో 58 కింద ఉచిత క్రమబద్దీకరణ కోసం వచ్చిన దరఖాస్తులపై రెండు నెలల క్రితమే క్షేత్ర స్థాయి విచారణ పూర్తయింది. ప్రతి 250 దరఖాస్తులకు ఒక బృందం చొప్పున రంగంలో దిగి క్షేత్రస్థాయిలో వివరాలు, ఫొటోలు, తదితర ఆధారాలు ప్రత్యేక రూపొందించిన ‘జీవో 58 మొబైల్ యాప్’లో నమోదు చేశారు.అనంతరం సమగ్ర నివేదికను అధికార యంత్రాంగాలకు సిఫార్సు చేశారు. దరఖాస్తుల సంఖ్య 1.14 లక్షలపైనే ప్రభుత్వం అక్రమిత స్థలాల క్రమబద్దీకరణకు మరో అవకాశం కల్పిస్తూ పాత జీవో 58, 59లకు అనుబంధంగా కొత్త జీవోలను జారీ చేసంది. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 31 వరకు సుమారు 1.14 లక్షల పైన కుటుంబాలు ఆక్రమిత స్థలాల క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 71,316, ఆతర్వాత రంగారెడ్డి జిల్లాలో 31,830, హైదరాబాద్ జిల్లా పరిధిలో 11,675 దరఖాస్తులు వచి్చనట్లు రెవెన్యూ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
పేదల బతుకులు కూల్చేశారు!
కర్నూలు సీక్యాంప్ : వారంతా పేదలు. రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్నారు. పొద్దున్నే బతుకు‘బండి’ తీసుకుని రోడ్డుపైకి వెళితే..రాత్రి పొద్దుపోయాక గానీ ఇళ్లకు తిరిగి రారు. వారంతా 40 ఏళ్లుగా అక్కడే బతుకుతున్నారు. అప్పట్లో ఖాళీ స్థలాల్లో పూరిగుడిసెలు, చిన్నపాటి ఇళ్లు నిర్మించుకున్నారు. వీటిని గురువారం నగర పాలక సంస్థ అధికారులు ఉన్నఫళంగా కూల్చేశారు. దాదాపు వంద కుటుంబాలను వీధిన పడేశారు. ‘అయ్యా..మాలాంటి పేదోళ్లపైనా మీ ప్రతాపం’ అంటూ బాధితులు కన్నీటి పర్యంతమైనా అధికారులు కనికరం చూపలేదు. కర్నూలు నగరంలోని సోనియాగాంధీ నగర్లో రోడ్డుపక్కన ఉన్న ఇళ్లు, గుడిసెల్లో పలువురు పేదలు నివాసముంటున్నారు. నగర పాలక సంస్థకు నీటి పన్ను, ఇంటిపన్నులు కడుతున్నారు. విద్యుత్ కనెక్షన్లు తీసుకుని..వాటి బిల్లులూ చెల్లిస్తున్నారు. అయితే..వీరి కారణంగా రోడ్డు ఆక్రమణకు గురైందని,ఇళ్లు, గుడి సెలను తొలగించాలంటూ సీతారాంనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గతంలో హైకోర్టుకు వెళ్లారు. వారికి ప్రత్యా మ్నాయం చూపి కట్టడాలను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో వారికి అధికారులు జగన్నాథగట్టుపై స్థలాలు చూపారు. అక్కడ నివాసముంటూ నగరంలోకి వచ్చి చిరువ్యాపారాలు, కూలి పనులు చేసుకోవడం కష్టంతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో బాధితులు సోనియాగాంధీ నగర్లోనే నివాసముంటున్నారు. అనువైన చోట ప్రత్యామ్నాయం చూపాలన్నది వారి భావన. అయితే..ఇదేమీ పట్టించుకోకుండానే గురు వారం నగర పాలక సంస్థ అధికారులు భారీ పోలీసు బందోబస్తుతో వచ్చి జేసీబీల సాయంతో ఇళ్లు,గుడిసెలను కూలగొట్టారు.సీతారాంనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యు లు ఈ స్థలాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారికి అధికారులు కూడా అండగా నిలవడం బాధాకరమని బాధితులు వాపోయారు. తక్షణమే తమకు న్యాయం చేయకపోతే కలెక్టరేట్ ఎదుట మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. -
బూడిదే మిగిలింది!
శ్రీకాకుళం,రేగిడి: మండలంలోని పెద్దలింగాలవలసలో గురువారం రాత్రి 7 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. రెడ్డి లక్షున్నాయుడు, రెడ్డి రామారావు, పల్లా తవుడమ్మ, లావేటి అప్పన్నలకు చెందిన ఇళ్లు కాలిబూడిదయ్యాయి. లక్షున్నాయుడు ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో బాధితులంతా ఆందోళనచెంది బయటకు పరుగులు తీశారు. ఇంతలోనే గాలి వీయడంతో మంటలు చెలరేగి పొరుగున ఉన్న మూడిళ్లకు వ్యాపించడంతో బాధితులంతా కట్టుబట్టలతో పరుగులు తీశారు. ఈ ఘటనలో పల్లా తవుడమ్మకు చెందిన రూ.20వేలు నగదు కాలిపోయింది. తండ్రీ కొడుకులైన రెడ్డి లక్షున్నాయుడు, రామారావుల రెండిళ్లు కాలిపోవడంతో నిరాశ్రయులయ్యారు. తిండిగింజలు, పాసుబుక్‌లు, విద్యుత్ మీటర్లు, డబ్బులు, బంగారం, ఎల్ఐసీ బాండ్లు, రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు కాలిపోయాయని బాధితులు వాపోతున్నారు. గ్రామస్తులంతా అప్రమత్తమై మంటలు మరింతగా వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. రాజాం అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి కొంతమేర మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 10 లక్షల ఆస్తి నష్టం ఉంటుందని బాధితులు పేర్కొన్నారు. దిక్కుతోచని స్థితిలో ఇంటర్ విద్యార్థులు రెడ్డి లక్షున్నాయుడు కుమార్తెలు రెడ్డి మోహిని, రెడ్డి సత్యవతిలు ప్రస్తుతం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు రాస్తున్నారు. మిగిలిన పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు కాలిపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హాల్‌టికెట్లు, పుస్తకాలు కాలిపోవడంతో పరీక్షలు ఎలా రాయాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. -
భార్య మీద కోపంతో ఇంటికి నిప్పు
నరసరావుపేట రూరల్: భార్యాభర్తల మధ్య వివాదం తొమ్మిది ఇళ్లను బూడిదజేసింది. క్షణికావేశంలో ప్రబుద్ధుడు తన ఇంటికి పెట్టుకున్న నిప్పు మరో తొమ్మిది ఇళ్లకు పాకి అందరిని కట్టుబట్టలతో రోడ్డుమీద నిలబెట్టింది. వివరాలలోకి వెళ్తే... కోటప్పకొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కనే ఎస్టీలు అనేక ఏళ్లుగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. వీరిలో ఏకశిర కలగయ్య, భార్య దుర్గ మధ్య బుధవారం మధ్యాహ్నం గొడవ మొదలైంది. దీంతో కలగయ్య ఆగ్రహంతో తన గుడిసెకు నిప్పంటించాడు. మంటలు క్షణాల్లో ఇతర గుడిసెలకు వ్యాపించాయి. ఎండ వేడిమి తోడు గాలి వీయడంతో స్థానికులు మంటలు ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పట్టణ నుంచి అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటల్ని అదుపుజేసే సమయానికే తొమ్మిది గృహాలు బుగ్గిపాలయ్యాయి. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా సిబ్బంది చర్యలు తీసుకున్నారు. కనీసం ఇంట్లో నుంచి కట్టుబట్టలు తెచ్చుకునేందుకు వీల్లేకుండా పోయిందని బాధితులు వాపోయారు. ప్రమాదంలో రూ.50వేలతో పాటు రూ.5లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేశారు. తహసీల్దార్ విజయ జ్యోతికుమారి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తక్షణ సాయంగా బాధితులకు 10కేజీల బియ్యం పంపిణీ చేశారు. -
ఇక్కడెక్కడో మా ఇల్లుండాలే?!
విశాఖ సిటీ: ఈ ఫొటోలో చిన్నారిని చూడండి.. ఎదురుగా ఉన్న ఖాళీ ప్రాంతాన్ని ఎలా చూస్తోందో!.. నిన్నమొన్నటి వరకు అక్కడున్న గుడిసెలు, గుడారాలు మాయమై ఖాళీ ప్రదేశం వెక్కిరిస్తుంటే.. నిన్నటి వరకు అక్కడున్న తన ఇల్లు ఏమైందబ్బా.. అన్నట్లుంది కదూ!!.. కంచరపాలెం రామ్మూర్తిపంతులుపేట ఫ్లైవోవర్ రెండు దశాబ్దాలుగా 76 కుటుంబాలకు ఆవాసంగా మారింది. సంచారజాతులకు చెందిన వీరిలో కొందరికి మదీనాబాగ్‌లో ఇళ్లు ఇచ్చామని చెప్పి ఎన్నికల్లో నాయకులు ఓట్లు దండుకున్నారు. కానీ అధికారులు మాత్రం వారికి ఇళ్లు అప్పగించలేదు. పైగా ఉన్న పళంగా మంగళవారం పోలీసు పటాలంతో తరలివచ్చి గుడిసెలు, గుడారాలను నేలమట్టం చేశారు. ఫలితంగా ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. ఎక్కడికీ వెళ్లలేక ఖాళీ ప్రదేశంలోనే పిల్లాపాపలతో కాలం వెళ్లదీస్తుంటే.. నిన్నటివరకు నీడినిచ్చిన గూళ్లలో తమను పొదివిపట్టుకొని ప్రేమ పంచిన తల్లిదండ్రులు ఎందుకింత దీనంగా ఉన్నారో?.. నీడనిచ్చిన గూడు ఇప్పుడెందుకు కనిపించడంలేదో??.. అర్థం కాక ఇలాంటి చిన్నారులు అయోమయం చెందుతున్నారు. -
గూడు చెదిరింది.. బూడిదె మిగిలింది
వారంతా నిరుపేదలు... పనికి వెళ్తేనే పూట గడిచేది... లేకపోతే పస్తులే... ఎంతో కష్టపడి తలదాచుకోవడానికి గూడు వేసుకున్నారు... రోజు వారి జీవనానికి అవసరమయ్యే వస్తువులను సమకూర్చున్నారు... అంతో ఇంతో కూడబెట్టుకున్నారు... ఒక్క సారిగా వారి జీవితాన్ని.. అగ్ని ప్రమాదం బుగ్గిపాలు చేసింది... గుడిసెలు కాలిపోయాయి... అందులో ఉన్న కొద్దిపాటి సామగ్రి బూడిదైంది... కట్టుబట్టలతో మిగిలారు... పుస్తకాలు కాలిపోవడంతో తాము బడికెలా వెళ్లాలని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... ఇది బద్వేలు సమీపంలోని బాధితుల పరి(దు)స్థితి. బద్వేలు/బద్వేలు అర్బన్ : బద్వేలు సమీపంలోని నెల్లూరు రోడ్డులో గురుకుల పాఠశాల వెనుక ప్రాంతంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయారు. అక్కడ దాదాపు 3,200 మంది ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగించే వారు. గురువారం రాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో మొత్తం 2 వేల గుడిసెలు కాలిపోయాయి. దాదాపు ఆరు వేల మంది నిరాశ్రయులుగా మిగిలారు. రూ.60 లక్షల పైనే ఆస్తి నష్టం సంభవించింది. ఈ ప్రమాదం జరగడానికి గల కారణం స్థానికులు తెలిపిన ప్రకారం ఇలా ఉంది. ఒక గుడిసెలో వంట చేస్తుండగా నిప్పురవ్వలు చెలరేగి మంటలు వ్యాపించాయి. గాలితో ఇవి చాలా స్వల్ప సమయంలో మిగతా గుడిసెలకు వ్యాపించాయి. ఆ గుడిసెలన్నింటినీ కేవలం ఎండుకర్రలు, బోద, ప్లాస్టిక్‌తో నిర్మించారు. దీంతో మంటలు అదుపులోకి రాలేదు. మంటలు నలుదిశలా వ్యాపించడంతో ఆగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చేందుకు వీలు లేని పరిస్థితి ఏర్పడింది. ఒక గుడిసె నుంచి మరో గుడిసెకు ఇలా... రెండు గంట వ్యవధిలో రెండు వేల గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. తెల్లవారే సరికి బూడిద మాత్రమే మిగిలింది. అధిక శాతం దినసరి కూలీలే: బాధితులలో చాలా మంది దినసరి కూలీలే. కూ లికెళితే గానీ పూట గడవని పరిస్థితి. మున్సిపల్ కూలీలు, హమాలీలు, బేల్దారులు, మెకానిక్ షెడ్డులలోని దినసరి కూలీలు.. ఇలా ప్రతి ఒక్కరూ రోజూ పనికి వెళ్లి జీవనం సాగించే వారే. ఈ స్థలం మంజూరు చేయాలని కోరుతూ.. వీరంతా ఇక్కడే నివాసం ఉంటున్నారు. ప్రస్తుత ప్రమాదంలో సర్వస్వం కోల్పోయారు. కట్టుబట్టతో మిగిలారు. అధిక శాతం మందిది ఇదే పరిస్థితి. ఏమీ మిగల్లే.. ప్రమాదంలో అగ్ని కీలలు చుట్టుపక్కల ఒక్కసారిగా వ్యాపించాయి. గాలులతో అవి తీవ్రమయ్యాయి. ఉన్నవి చిన్నపాటి గది ఉన్న గుడిసెలే. చాలా మంది సామగ్రిని అదే గుడిసెలలో ఉంచుకుని జీవనం సాగిస్తున్నారు. ఆగ్ని ప్రమాదం విషయం తెలుసుకునేలోపే ప్లాస్టిక్ పట్టలు, బోదతో మంటలు చుట్టుముట్టాయి. దీంతో ఒక్కరూ కూడా తమ సామగ్రిని బయటకు తెచ్చుకునే అవకాశం లేకపోయింది. సిలిండర్లు పేలే ప్రమాదం ఉండటంతో.. బాధితులు తమ గుడిసెల వద్దకు వెళ్లేందుకు సాహసం చేయలేదు. ప్రమాదంలో నాలుగు సిలిండర్లు సైతం పేలిపోయాయి. నుసిగా మారిన పుస్తకాలు, గుర్తింపు కార్డులు ప్రభుత్వ స్థలంలో ని వాసముంటున్న తమ కు అధికారులు స్థలం కేటాయించాలనే ఉద్దేశంతో.. చాలా మంది అక్కడే ఆ ధార్కార్డులు, రేషన్‌కార్డులు తెచ్చుకుని ఉంటున్నారు. ప్రమాదంలో వీరంతా వాటితోపాటు తాము పని చేసే సంస్థలలో ఇచ్చిన గుర్తింపుకార్డులను పొగోట్టుకున్నారు. ప్రస్తుతం వీటితో ఏదైనా అవసరం పడితే తమ పరిస్థితి ఏమిటని బాధితులు వాపోతున్నారు. గుడిసెలలో నివాసముంటున్న వారి పిల్లలు దాదాపు 200 మంది చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యపురం, మార్తోమ నగర్, గౌరీశంకర్ నగర్ పాఠశాలలో చదువుకుంటున్నారు. ప్రమాదంలో వీరంతా తమ దుస్తులతో పాటు పుస్తకాలు, బ్యాగులను పొగోట్టుకున్నారు. తాము పాఠశాలకు వెళ్లాలంటే ఎలా అని వారు వాపోతున్నారు. రూ.50 వేలు నష్టపోయా ప్రమాదంలో రూ.50 వేలు పైనే నష్టపోయా. కూలీ పనికెళ్లి పైసా పైసా కూడబెట్టి సామగ్రిని సమకూర్చుకోగా.. కేవలం నిమిషాల వ్యవధిలో అన్ని కోల్పోయా. పెట్టలో ఉన్న బంగారం, నగదు, టీవీ, ఇతర సామగ్రి ఇలా అన్ని బూడిదగా మారాయి. – సరోజ, బాధితురాలు స్థలం కోసమే అగచాట్లు ఇక్కడ స్థలమిస్తారనే ఉద్దేశంతో గుడిసె వేసుకుని ఉంటున్నాం. చలితో నెల కిందట అనారోగ్యం బారిన పడి మా తల్లి కూడా మరణించింది. ఇదే ప్రాంతంలో గత మూడు నెలల కాలంలో ముగ్గురు వృద్ధులు చలితో చనిపోయారు. స్థలం వస్తుందని ఇక్కడే ఉంటే.. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలాం. – సుబ్బరాయుడు, బాధితుడు -
10వేల ఎకరాలు హాంఫట్!
* విలువ రూ.20 వేల కోట్ల పైనే! * సర్వేలో విస్మయపరిచే నిజాలు * నగర శివార్లలోనే ఏకంగా 8 వేల ఎకరాలు అన్యాక్రాంతం * ప్రాథమిక నివేదిక సమర్పించిన రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: ప్రభుత్వ భూములకు రెక్కలొచ్చాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.20 వేల కోట్ల విలువైన సర్కారీ భూములు కబ్జాదారుల కబంధహస్తాల్లో చిక్కుకుపోయాయి. భూముల ఆక్రమణలపై రంగారెడ్డి జిల్లా యంత్రాంగం జరిపిన సర్వేలో విస్మయకర నిజాలు వెలుగు చూశాయి. ప్రభుత్వ భూముల్లో ఎంతమంది పాగా వేశారో లెక్క తీయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారగణం.. జిల్లాలో 10,366.14 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనట్లు గుర్తించింది. మరికొన్ని మండలాల నుంచి సమాచారం రావాల్సి ఉండడంతో ఈ గణాంకాలు పెరిగే అవకాశం లేకపోలేదు. పరిశ్రమలకు, వివిధ సంస్థలకు బదలాయించిన స్థలాలతోపాటు ఇంకా ఎవరికీ కేటాయించని భూముల వివరాలను పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలోనే 64,671.39 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు నిర్ధారించిన రెవెన్యూ యంత్రాంగం.. ఇందులో కేవలం 3,395.07 ఎకరాలు మాత్రమే వివాదరహితంగా ఉందని తేల్చింది. పోరంబోకు, సీలింగ్, కారీజ్ ఖాతాలుగా వర్గీకరించిన భూములు అక్రమార్కుల చెరల్లో చిక్కుకున్నాయని పసిగట్టిన యంత్రాంగం.. గ్రామీణ ప్రాంతాల్లో వీటిని సాగుకు వినియోగించుకుంటున్నట్లు గుర్తించింది. నగర శివార్లలో మాత్రం ల్యాండ్ మాఫియా గుప్పిట్లో వేలాది ఎకరాలు మగ్గుతున్నట్లు లెక్క తేల్చింది. అయితే, ఈ భూముల హక్కుల కోసం కోర్టుల్లో కేసులు నడుస్తుండడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది. మల్కాజిగిరిలో 6,248 ఎకరాలు హాంఫట్ స్థిరాస్తి రంగం పుంజుకోవడంతో శివార్లలోని విలువైన స్థలాలు కైంకర్యమవుతున్నాయి. మరీ ముఖ్యంగా మల్కాజిగిరి, సరూర్‌నగర్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 7,783 ఎకరాలు ఆక్రమణకు గురైంది. రాజేంద్రనగర్ డివిజన్లో 2,127 ఎకరాల మేర ఆక్రమించినట్లు జిల్లా యంత్రాంగం తేల్చింది. ఇక్కడ ఎకరా సగటున రూ.3 కోట్లు పైమాటే. ఈ లెక్కన ఈ మూడు డివిజన్లలోనే సుమారు రూ.15 వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమైనట్లు అంచనా. బాలానగర్ మండలంలో 537.28, శేరిలింగంపల్లి 850.20, రాజేంద్రనగర్ 345, శంషాబాద్ 394, కుత్బుల్లాపూర్ 1913, ఉప్పల్ 121, శామీర్‌పేట 2993, మల్కాజిగిరి 162, మేడ్చల్ 340 ఎకరాలు కబ్జా అయినట్లు తేలింది. దీంట్లో అధికశాతం వ్యవసాయేతర భూములు కావడంతో వీటి విలువ రూ.కోట్లలో పలుకుతోంది. రెవెన్యూ అధికారులు భూ ఆక్రమణలపై క్షేత్రస్థాయిలో సర్వే జరపడమే కాకుండా రికార్డులను కూడా పరిశీలిస్తుండడంతో కబ్జా చిట్టా మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. 18,476 మంది కబ్జాదారులు! జిల్లావ్యాప్తంగా ఆక్రమణకు గురైన పది వేల ఎకరాల్లో 18,476 మంది పాగా వేసినట్లు అధికార యంత్రాంగం తేల్చింది. ఇందులో అధికంగా మల్కాజిగిరి డివిజన్ పరిధిలో 17,590 మంది కబ్జాదారులు ఉన్నట్లు గుర్తించింది. చిన్నచిన్న బిట్లుగా ఉన్న స్థలాలపై కన్నేసిన అక్రమార్కులు.. వాటిని సొంతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది అండదండలు కూడా ఉండడంతో రికార్డులు తారుమారు చేయడం ద్వారా స్థలాల హక్కుల కోసం కోర్టుకెక్కుతున్నారు. ఇంటిదొంగలు హస్తం ఉండడంతో ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం ప్రభుత్వానికి తలకుమించిన భారంగా పరిణమించింది. ఆక్రమణదారుల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, బడాబాబులు ఉండడంతో అన్యాక్రాంతమవుతున్న జాగాలపై పట్టు బిగించలేకపోతోంది. ల్యాండ్ బ్యాంక్ సిద్ధం! ఐటీ కంపెనీలు, బహుళ జాతి సంస్థల పెట్టుబడులను ప్రోత్సహించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని తేవాలని భావిస్తున్న ప్రభుత్వం.. అందుకనుగుణంగా కంపెనీల స్థాపనకు ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేసింది. గతంలో టీఐఐసీ, హెచ్ఎండీఏ, రాజీవ్ స్వగృహ, దిల్ తదితర సంస్థలకు బదలాయించిన భూముల్లో వినియోగంలోకిరాని భూములతోపాటు, పారిశ్రామిక అవసరాలకు పోను అట్టిపెట్టుకున్న భూముల వివరాలను కూడా సేకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా 30 వేల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. అగ్రశ్రేణి సంస్థలు, ఫార్మా రంగం కంపెనీలు రాజధాని శివార్లలోనే పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపే అవకాశం ఉండడంతో అక్ర మార్కుల చేతుల్లోని భూములను కూడా రాబట్టుకునే దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా ప్రభుత్వ భూముల వివరాలు, ఆక్రమణలకు సంబంధించి సర్వే నంబర్ల వారీగా వివరాలను సేకరిస్తోంది. -
నేడో రేపో కబ్జా ఖాయం!
అనంతపురం సిటీ : నగరంలో ఎటు చూసినా సెంటు స్థలం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పలుకుతోంది. అలాంటిది ఎకరా స్థలమంటే దాని విలువ ఎంత లేదన్నా రూ.5 కోట్లకు తక్కువ ఉండదు. అలాంటి స్థలంపైన కబ్జాదారులు కన్నేశారు. దాన్ని ఆక్రమించేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. ఇందులో భాగంగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం ఆదర్శనగర్‌లోని 341 సర్వే నంబర్ సబ్ డివిజన్లో లే అవుట్ 21/2001కు సంబంధించి నగర పాలక సంస్థకు 99.5 సెంట్ల ఓపెన్ స్థలం ఉంది. టౌన్ ప్లానింగ్ అధికారులు దీన్ని గుర్తించారు. ఈ ప్రాంతంలో సెంటు రూ.5 లక్షలకు పైగా పలుకుతోంది. ఈ లెక్కన చూస్తే స్థలం విలువ రూ.5 కోట్ల వరకు ఉంటుంది. ఇంతటి విలువైన స్థలాన్ని పరిరక్షించే విషయంలో నగర పాలక సంస్థటౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. స్థలానికి హద్దులు ఏర్పాటు చేసి.. కంచె వేయలేదు. ‘ఈ స్థలం కార్పొరేషన్‌కు చెందినది’ అని తెలియజేస్తూ కనీసం హెచ్చరిక బోర్డు కూడా పెట్టలేదు. దీంతో స్థలాన్ని కాజేసేందుకు కబ్జాదారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే న్యాయపరమైన చిక్కులు సృష్టించేందుకు ఎత్తుగడ వేసినట్లు తెలిసింది. పరిస్థితి అంత వరకు రాకముందే టౌన్ ప్లానింగ్ అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరముంది. -
రూ. అరకోటి స్థలం కబ్జా
బద్వేలు అర్బన్, న్యూస్‌లైన్: బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని రిక్షా కాలనీ సమీపంలో గల సర్వే నంబరు 1000లోని అరకోటి విలువ చేసే 12 సెంట్ల ప్రభుత్వ స్థల ం కబ్జాకు గురైంది. మంగళవారం రాత్రికి రాత్రే కబ్జాదారులు సంబంధిత స్థలంలో సిమెంటు దిమ్మెలతో నిర్మాణాలు చేపట్టారు. గోపవరం మండల పరిధిలోని మడకలవారిపల్లె గ్రామ రెవెన్యూ పొలంలోని సర్వేనంబరు 1000, 1001లలో సుమారు 10 సంవత్సరాలక్రితం అప్పటి తహశీల్దారు వికలాంగులకు, ఎస్సీ,ఎస్టీలకు చెందిన నిరుపేదలకు ఇంటిపట్టాలు మంజూరు చేశారు. ఇందుకు సంబంధించి ప్రజా అవసరాల దృష్ట్యా సర్వేనంబరు 1000లో 12 సెంట్ల స్థలాన్ని పట్టాలు ఇవ్వకుండా ఖాళీగా ఉంచారు. సంబంధిత విషయాన్ని రెవెన్యూ రికార్డులలో, సర్వేనంబరు1000కి సంబంధించిన లే అవుట్లో కూడా పొందుపరిచారు. అయితే సుమారు 10 సంవత్సరాల పాటు కబ్జాదారుల చేతిలోకి వెళ్లకుండా స్థానికులు కాపాడుతూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో ఓ వామపక్ష పార్టీకి చెందిన నేత సంబంధిత స్థలంలో అట్లూరు మండలానికి చెందిన కొంతమందితో స్థలాన్ని చదును చేయించి వారికి సహకరించినట్లు ఇందుకు కొంతమేర ప్రతిఫలం కూడా పొందినట్లు సమాచారం. ఈ విషయంపై స్థానికులు ప్రశ్నించగా సంబంధిత స్థలంలో పాత పట్టాలు ఉండగా తిరిగి కొత్తపట్టాలు చేయించుకున్నట్లు నమ్మబలికాడు. స్థానికులు పట్టించుకోకపోవడంతో కబ్జాదారులకు మార్గం సుగమమైంది. రాత్రికి రాత్రే సంబంధిత స్థలంలో నాలుగు గదులను నిర్మించారు. పస్తుతం ఈ స్థలం విలువ సుమారు రూ.50లక్షల పైమాటే. పట్టణ నడిబొడ్డులో విలువైన స్థలం కబ్జాకు గురైనప్పటికీ సంబంధిత రెవెన్యూ అధికారులకు తెలియకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై గోపవరం తహశీల్దారు ఉదయ్ సంతోష్‌ను వివరణ కోరగా సంబంధిత స్థలాన్ని కబ్జా చేసినట్లు తన దృష్టికి రాలేదని, ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేస్తే ఎంతటివారైనా ఉపేక్షించం, గురువారం సంబంధిత స్థలాన్ని పరిశీలించి అక్రమ కట్టడాలు కూల్చివేసి ప్రభుత్వ స్థలాన్ని స్వాధీన పరుచుకుని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు.