మంటలను అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
నరసరావుపేట రూరల్: భార్యాభర్తల మధ్య వివాదం తొమ్మిది ఇళ్లను బూడిదజేసింది. క్షణికావేశంలో ప్రబుద్ధుడు తన ఇంటికి పెట్టుకున్న నిప్పు మరో తొమ్మిది ఇళ్లకు పాకి అందరిని కట్టుబట్టలతో రోడ్డుమీద నిలబెట్టింది. వివరాలలోకి వెళ్తే... కోటప్పకొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కనే ఎస్టీలు అనేక ఏళ్లుగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. వీరిలో ఏకశిర కలగయ్య, భార్య దుర్గ మధ్య బుధవారం మధ్యాహ్నం గొడవ మొదలైంది. దీంతో కలగయ్య ఆగ్రహంతో తన గుడిసెకు నిప్పంటించాడు. మంటలు క్షణాల్లో ఇతర గుడిసెలకు వ్యాపించాయి.
ఎండ వేడిమి తోడు గాలి వీయడంతో స్థానికులు మంటలు ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పట్టణ నుంచి అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటల్ని అదుపుజేసే సమయానికే తొమ్మిది గృహాలు బుగ్గిపాలయ్యాయి. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా సిబ్బంది చర్యలు తీసుకున్నారు. కనీసం ఇంట్లో నుంచి కట్టుబట్టలు తెచ్చుకునేందుకు వీల్లేకుండా పోయిందని బాధితులు వాపోయారు. ప్రమాదంలో రూ.50వేలతో పాటు రూ.5లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేశారు. తహసీల్దార్ విజయ జ్యోతికుమారి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తక్షణ సాయంగా బాధితులకు 10కేజీల బియ్యం పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment