బద్వేలు అర్బన్, న్యూస్‌లైన్: బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని రిక్షా కాలనీ సమీపంలో గల సర్వే నంబరు 1000లోని అరకోటి విలువ చేసే 12 సెంట్ల ప్రభుత్వ స్థల ం కబ్జాకు గురైంది. మంగళవారం రాత్రికి రాత్రే కబ్జాదారులు సంబంధిత స్థలంలో సిమెంటు దిమ్మెలతో నిర్మాణాలు చేపట్టారు. గోపవరం మండల పరిధిలోని మడకలవారిపల్లె గ్రామ రెవెన్యూ పొలంలోని సర్వేనంబరు 1000, 1001లలో సుమారు 10 సంవత్సరాలక్రితం అప్పటి తహశీల్దారు వికలాంగులకు, ఎస్సీ,ఎస్టీలకు చెందిన నిరుపేదలకు ఇంటిపట్టాలు మంజూరు చేశారు.
ఇందుకు సంబంధించి ప్రజా అవసరాల దృష్ట్యా సర్వేనంబరు 1000లో 12 సెంట్ల స్థలాన్ని పట్టాలు ఇవ్వకుండా ఖాళీగా ఉంచారు. సంబంధిత విషయాన్ని రెవెన్యూ రికార్డులలో, సర్వేనంబరు1000కి సంబంధించిన లే అవుట్‌లో కూడా పొందుపరిచారు. అయితే సుమారు 10 సంవత్సరాల పాటు కబ్జాదారుల చేతిలోకి వెళ్లకుండా స్థానికులు కాపాడుతూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో ఓ వామపక్ష పార్టీకి చెందిన నేత సంబంధిత స్థలంలో అట్లూరు మండలానికి చెందిన కొంతమందితో స్థలాన్ని చదును చేయించి వారికి సహకరించినట్లు ఇందుకు కొంతమేర ప్రతిఫలం కూడా పొందినట్లు సమాచారం. ఈ విషయంపై స్థానికులు ప్రశ్నించగా సంబంధిత స్థలంలో పాత పట్టాలు ఉండగా తిరిగి కొత్తపట్టాలు చేయించుకున్నట్లు నమ్మబలికాడు. స్థానికులు పట్టించుకోకపోవడంతో కబ్జాదారులకు మార్గం సుగమమైంది. రాత్రికి రాత్రే సంబంధిత స్థలంలో నాలుగు గదులను నిర్మించారు.
పస్తుతం ఈ స్థలం విలువ సుమారు రూ.50లక్షల పైమాటే. పట్టణ నడిబొడ్డులో విలువైన స్థలం కబ్జాకు గురైనప్పటికీ సంబంధిత రెవెన్యూ అధికారులకు తెలియకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై గోపవరం తహశీల్దారు ఉదయ్ సంతోష్‌ను వివరణ కోరగా సంబంధిత స్థలాన్ని కబ్జా చేసినట్లు తన దృష్టికి రాలేదని, ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేస్తే ఎంతటివారైనా ఉపేక్షించం, గురువారం సంబంధిత స్థలాన్ని పరిశీలించి అక్రమ కట్టడాలు కూల్చివేసి ప్రభుత్వ స్థలాన్ని స్వాధీన పరుచుకుని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రూ. అరకోటి స్థలం కబ్జా
Published Thu, Dec 12 2013 2:51 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
Advertisement