అనంతపురం సిటీ : నగరంలో ఎటు చూసినా సెంటు స్థలం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పలుకుతోంది. అలాంటిది ఎకరా స్థలమంటే దాని విలువ ఎంత లేదన్నా రూ.5 కోట్లకు తక్కువ ఉండదు. అలాంటి స్థలంపైన కబ్జాదారులు కన్నేశారు. దాన్ని ఆక్రమించేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. ఇందులో భాగంగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం ఆదర్శనగర్‌లోని 341 సర్వే నంబర్ సబ్ డివిజన్‌లో లే అవుట్ 21/2001కు సంబంధించి నగర పాలక సంస్థకు 99.5 సెంట్ల ఓపెన్ స్థలం ఉంది. టౌన్ ప్లానింగ్ అధికారులు దీన్ని గుర్తించారు. ఈ ప్రాంతంలో సెంటు రూ.5 లక్షలకు పైగా పలుకుతోంది. ఈ లెక్కన చూస్తే స్థలం విలువ రూ.5 కోట్ల వరకు ఉంటుంది. ఇంతటి విలువైన స్థలాన్ని పరిరక్షించే విషయంలో నగర పాలక సంస్థటౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
స్థలానికి హద్దులు ఏర్పాటు చేసి.. కంచె వేయలేదు. ‘ఈ స్థలం కార్పొరేషన్‌కు చెందినది’ అని తెలియజేస్తూ కనీసం హెచ్చరిక బోర్డు కూడా పెట్టలేదు. దీంతో స్థలాన్ని కాజేసేందుకు కబ్జాదారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే న్యాయపరమైన చిక్కులు సృష్టించేందుకు ఎత్తుగడ వేసినట్లు తెలిసింది. పరిస్థితి అంత వరకు రాకముందే టౌన్ ప్లానింగ్ అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరముంది.
నేడో రేపో కబ్జా ఖాయం!
Published Sun, Aug 3 2014 3:41 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement