సీఎం సభకు భారీ ఖర్చు
బడ్జెట్ రూ. 5కోట్లు..!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వెచ్చిస్తున్న ఖర్చు రూ. 5 కోట్లు. భారీ ఎత్తున జన సమీకరణ, ఏర్పాట్ల కోసం పెద్దమొత్తంలో ఖర్చుచేస్తున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లలో ప్రభుత్వ అధికార యంత్రాంగం.. టీడీపీ క్యాడర్ మొత్తం పనులన్నింటినీ పక్కనపెట్టి సీఎం సభ విజయవంతం కోసం శ్రమిస్తున్నారు. రాజధాని నిర్మాణంపై వస్తున్న విమర్శలు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించకపోవటం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటంతో టీడీపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
వీటన్నింటినీ కప్పిపుచ్చుకోవటంతో పాటు.. అన్నింటిపైనా వివరణ ఇచ్చేందుకు ‘మహిళా దినోత్సవాన్ని వేదిక చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం జిల్లాకు రానున్నారు. సుమారు 7గంటల పాటు నెల్లూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర మున్సిపల్శాఖా మంత్రి నారాయణ గత కొద్దిరోజులుగా జిల్లాలోనే తిష్టవేసి అధికారులతో తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా జిల్లా కలెక్టర్ జానకి, అధికారయంత్రాంగం మొత్తం సీఎం పర్యటన ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు.
సీఎం సభకు లక్ష మంది టార్గెట్..
సీఎం సభను విజయవంతం చేసేందుకు భారీ ఎత్తున జనసమీకరణ కోసం అధికారులు, టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి డ్వాక్రా మహిళలు, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులను తీసుకొచ్చేందుకు సుమారు 1,500 బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ నుంచి 750, ప్రైవేటు, స్కూలు బస్సులు మరో 750 బస్సుల ద్వారా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆర్టీసీ అధికారులతో అధికారులు సంప్రదింపులు జరిపారు. అయితే గతంలో కోవూరు వద్ద జరిగిన సీఎం కార్యక్రమానికి పంపిన ఆర్టీసీ బస్సులకు చెల్లించాల్సిన రూ.50 లక్షలు ఇంకా ఇవ్వలేదని అధికారులు చె బుతున్నారు. తాజాగా అడిగిన బస్సులకు ఒక్కో దానికి రూ.12వేలు అద్దె చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేసినట్లు తెలిసింది. అదే విధంగా ప్రైవేటు, కళాశాలల బస్సుల కోసం ఒక్కోదానికి రూ.10వేలు ఖర్చవుతుందని అంచనా వేశారు. అదేవిధంగా సీఎం సభకు వచ్చే వారి కోసం ఒక్కొక్కరికి రూ.150 చొప్పున ఖర్చుచేయనున్నట్లు అధికారవర్గాలు అంచనా వేశాయి. ఇంకా కార్లు, జీపులు, లారీలు ఇతరత్రా వాహనాల ద్వారా జనాలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు టీడీపీ శ్రేణులు చెపుతున్నారు. వీటన్నింటికీ రూ.5 కోట్లకుపైనే ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు వెళ్లడించారు.
జనాభా సమీకరణ పర్యవేక్షణకు అధికారుల నియామకం
వివిధ ప్రాంతాల నుంచి జనాభాను తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను పర్యవేక్షించేందుకు టాస్క్ఫోర్స్ టీఎం పేరుతో వివిధ శాఖల అధికారులను నియమించినట్లు విశ్వసనీయ సమాచారం. మండలానికి ఒకరి చొప్పున 46 మందిని, మున్సిపాలిటీలకు ఒకరు చొప్పున నియమించినట్లు తెలిసింది. వీరు ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో పర్యటించి డ్వాక్రా లీడర్లతో సమావేశం అవుతున్నారు.
డ్వాక్రా మహిళల తరలింపు బాధ్యతను మొత్తం డీఆర్డీఏ చూసుకుంటోంది. బస్సుల ఏర్పాటు, మహిళలను గ్రామం నుంచి తీసుకుని సభాస్థలికి చేర్చటం.. తిరిగి గ్రామానికి చేర్చేంత వరకు ఆ శాఖకు చెందిన అధికారులు, ఏపీఎంలు, సీసీలు పర్యవేక్షిస్తుంటారు. వీరికి భోజనం, నీరు వంటి సౌకర్యాలన్నీ డీఆర్డీఏనే ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా టీడీపీ కార్యకర్తలను పెద్ద ఎత్తున తరలించేందుకు జిల్లా నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది.