ఏర్పాట్లు చకచకా
జడ్చర్ల:
ఈనెల 18న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాలమూరుకు తొలిసారిగా రానున్నారని జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందిన నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. అందులో భాగంగానే ఆదివారం సాయంత్రం జడ్చర్ల మండలంలోని పోలేపల్లి సెజ్‌లో కలెక్టర్ జీడీ ప్రియదర్శిని పర్యటించారు. మొదటగా అరబిందో ఫార్మా కంపెనీలో సీఎం హెలిక్యాప్టర్ దిగేందుకు వీలుగా గతంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. అయితే ఇక్కడ గతంలో ఉన్న పరిస్థితులు లేవని, సీఎం భద్రతాసిబ్బంది హెలిప్యాడ్ స్థలాన్ని ఆక్షేపించే అవకాశం ఉందని జిల్లా ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. దీంతో మరోచోట హెలిప్యాడ్‌ను ఏర్పాటుచేయాలని భావించి.. అక్కడినుండి బయలుదేరి సెజ్ ప్రధానరహదారి పక్కన ఖాళీస్థలాన్ని పరిశీలించారు. అయితే ఇక్కడ విద్యుత్‌తీగలు అడ్డంకిగా ఉన్నాయని, సాంకేతిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని విద్యుత్‌శాఖ అధికారులు వివరించారు. దీంతో పోలేపల్లి గ్రామసమీపంలో నిర్వాసితులకు కేటాయించిన ఇంటి స్థలాల పక్కనే ఉన్న ఖాళీస్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ హెలిప్యాడ్‌కు స్థలం అనుకూలంగా ఉందని అధికారులు క లెక్టర్‌కు వివరించారు. దీంతో చివరికి ఇక్కడే హెలిప్యాడ్ స్థలాన్ని ఖరారుచేశారు.
సీఎం పరిశీలించే అంశాలివే
సెజ్ నిర్వాసితులకు ఇంటిపట్టాలను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఇప్పించాలని జిల్లా ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
సెజ్‌లో నిర్మించిన 132/33 కేవీ విద్యుత్ సబ్‌ష్టేషన్‌ను సీఎం ప్రారంభించే ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. సబ్‌స్టేషన్ ఆవరణలో ప్రారంభోత్సవానికి తూర్పు వైపునకు శిలాఫలకాన్ని ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు.
ముఖ్యమంత్రి సెజ్‌ను పూర్తిస్థాయిలో పరిశీలించే అవకాాశం ఉందని, పరిశ్రమలను కూడా సీఎం సందర్శించే అవకాశం ఉందని కలెక్టర్ అధికారులతో చర్చించారు. మొత్తం ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ని కొనసాగుతున్నాయి.. అందులో ఏయే పరిశ్రమలు ఉన్నాయన్న వివరాలను తమకు తక్షణమే అందజేయాలని టీఎస్‌ఐఐసీ అధికారులను కలెక్టర్ కోరారు.
ఇంకా ఖరారు కాలేదు: కలెక్టర్
జిల్లాలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పర్యటన ఇంకా ఖరారు కాలేదని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని వెల్లడించారు. ఆదివారం ఆమె ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడు తూ.. సీఎం పర్యటనకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను పరిశీలించినట్లు చెప్పారు. పర్యటనపై ఇంకా స్పష్టత రాలేదని కలెక్టర్ తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఆర్డీఓ హన్మంత్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సదాశివరెడ్డి, డీఈ నర్సింహారెడ్డి, టీఎస్‌ఐఐసీ మేనేజర్ సూరిబాబు, డీఎస్పీ కృష్ణమూర్తి, తహశీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
కొజెంట్ కంపెనీని
సందర్శించిన కలెక్టర్
అడ్డాకుల : మండంలోని వేముల శివారులో ఉన్న కొజెంట్ కంపెనీని ఆదివారం సాయంత్రం కలెక్టర్ ప్రియదర్శిని సందర్శించారు. కొజెంట్ కంపెనీలో నూతనంగా ఏర్పాటుచేసే ఓ విభాగాన్ని ఈనెల 18న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కంపెనీని సందర్శించి ఇక్కడి ప్రతినిధులతో మా ట్లాడారు. ఆమె వెంట ఆర్డీఓ హన్మంత్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ విజయ్‌కుమార్, అడ్డాకుల తహశీల్దార్ జె.రాంకోటి ఉన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యే సందర్శన
ఎంపీ ఏపీ.జితేందర్‌రెడ్డి, దేవరకద్ర శాసనసభ్యుడు ఆల వెంకటేశ్వర్‌రెడ్డిలు కొజెంట్ కంపెనీని ఆదివారం రాత్రి సందర్శించారు. కంపెనీ ప్రతినిధులతో సమవేశమై సీఎం రాకకు సంబంధించిన అంశాలపై చర్చించారు. హెలిప్యాడ్‌తో పాటు ప్రారంభ కార్యక్రమం, సమావేశంపై పలు సూచనలు చేశారు.