విమర్శలతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
విజయవాడ: తుళ్లూరు మండలం వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంపై హెలీప్యాడ్ నిర్మాణ ప్రతిపాదన లేదని సీఆర్‌డీఏ కమిషన్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యాలయంపైనే హెలీప్యాడ్ ఏర్పాటుచేసుకోవడం ద్వారా అక్కడ దిగి నేరుగా ఛాంబర్‌లోకి ముఖ్యమంత్రి వెళ్లేలా భవనానికి డిజైన్ చేసినట్లు ప్రచారం జరిగింది. దేశంలో ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రికి ఇలాంటి సౌకర్యం లేదని, హెలీప్యాడ్ నిర్మిస్తే కార్యాలయంపైనే దాన్ని ఏర్పాటుచేసుకున్న మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలుస్తారని సీఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి.
కానీ దీనిపై విమర్శలు రావడంతో ప్రభుత్వం ప్లేటు ఫిరాయించింది. లోటు బడ్జెట్, ఉద్యోగులకు జీతాలివ్వలేమని ఒకవైపు చెబుతూ మరోవైపు ఇలాంటి విలాసాలేంటనే వాదన మొదలైంది. అసలు తాత్కాలిక సచివాలయమే అనవసరమని, డబ్బు వృధా చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న తరుణంలో దానిపై ఏకంగా హెలీప్యాడ్ నిర్మిస్తే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావించనట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం నుంచి సైతం అభ్యంతరాలు వస్తాయనే ఆలోచనతో దీన్ని విరమించుకున్నారు. అయితే అధికారికంగా చెప్పలేదు కాబట్టి ఈ ప్రతిపాదనే లేదని సీఆర్‌డీఏ కమిషనర్‌తో చెప్పించినట్లు తెలిసింది.
సీఎం కార్యాలయంపై హెలీప్యాడ్ ప్రతిపాదన ఉత్తిదే
Published Sun, Feb 21 2016 10:03 PM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement