
‘మావో' కెరటానికి పదేళ్లు
మావోయిస్టు పార్టీ పదేళ్లు పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో బలంగా ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు-లెనినిస్టు) పీపుల్స్‌వార్ పార్టీ... జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో బలంగా ఉన్న మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా అనే రెండు విప్లవ పార్టీలు 2004 సెప్టెంబర్ 21న విలీనమై.. మావోయిస్టు పార్టీగా ఏర్పడ్డాయి. ఈ విలీనానికి ఆదివారంతో పదేళ్లు పూర్తికానున్నాయి.
పెద్దపల్లి :
దేశంలో కీలక మైలురాయిగా నిలిచిన ఈ ఘట్టం ఆవిష్కృతమై పదేళ్లవుతున్న సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో విప్లవ రచయితల సంఘం(విరసం) బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. 1980లో తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పురుడు పోసుకున్న పీపుల్స్‌వార్ పార్టీ కొండపల్లి వర్గంగా కార్యకలాపాలు విస్తృతపరిచింది. జననాట్య మండలి పాటలతో గ్రామాల్లో పెత్తందార్లను ఎదిరించి పాలేర్ల సమ్మెతో వందలాది ఎకరాల్లో ఎర్ర జెండాలు పాతి ఆక్రమణకు పాల్పడ్డ పీపుల్స్‌వార్ 35 ఏళ్ల కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది. పీపుల్స్‌వార్ పార్టీ తొలుత 1998లో బీహార్‌కు చెందిన సీపీఐ(ఎంఎల్) పార్టీ యూనిటీని తనలో కలుపుకుంది. ఆ తరువాత ఎంసీపీఐతో కలసి మావోయిస్టు పార్టీగా ఏర్పడ్డ తరువాత దేశ వ్యాప్తంగా ఆ పార్టీపై నిషేధం విధించారు. మావోయిస్టుల పురిటిగడ్డ అయిన తెలంగాణపై కేంద్ర, రాష్ట్ర బలగాలు గురి పెట్టాయి. నల్లమల నుంచి మహదేవ్‌పూర్ వరకు అటవీ ప్రాంతాల్లోని దళాలను టార్గెట్ చేసి పోలీసులు దెబ్బతీశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మల్లోజుల కోటేశ్వరరావు ఉరఫ్ కిషన్‌జీ, సందె రాజమౌళి, వడ్కాపూర్ చంద్రమౌళి, మంగపేట చిన్నన్న, చెరుకూరి రాజ్‌కుమార్, శాకమూరి అప్పారావు, పటేల్ సుధాకర్‌రెడ్డి తదితర చురకత్తులాంటి నాయకులను మావోయిస్టు పార్టీ ఈ పదేళ్లలోనే కోల్పోయింది.
‘సల్వాజుడుం’పై దాడి
ఆదివాసీలతో ఏర్పాటైన సల్వాజుడుం నుంచి ముప్పుతిప్పలు పడ్డ మావోయిస్టులు నిరుడు ఛత్తీస్‌గఢ్‌లో జరిపిన సామూహిక హత్యాకాండలో సల్వాజుడుం రూపకర్త మహేంద్రకర్మతోపాటు సల్వాజుడుం సంస్థను మట్టుబెట్టారు. ఈ 35 ఏళ్ల కాలంలో మహేంద్రకర్మపై జరిపిన దాడిని అతి పెద్ద దాడిగా పేర్కొనవచ్చు. ప్రభుత్వం నుంచి దెబ్బతిన్న దళాల్లో మిగిలిన కొద్ది మంది నాయకులు ఛత్తీస్‌గఢ్, బస్తర్, జార్ఖండ్ లాంటి ప్రాంతాలకు తరలివెళ్లారు. దండకారణ్యానికి పరిమితమైన పార్టీ నూతన ప్రజాస్వామిక విప్లవ దశలో భాగంగా క్రాంతికార్, జనతన సర్కార్ పేరిట ప్రభుత్వానికి సమాంతర పాలన కొనసాగిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ నాయకత్వంలో సహకార సంఘాలను ఏర్పాటు చేస్తూ వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, మహిళా రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పార్టీ నాయకత్వం, గ్రామ రాజ్య కమిటీల నాయకత్వంలో ముందుకెళ్తోంది. మైదాన ప్రాంతంలో సెల్‌టవర్ల ఏర్పాట్లు, రియల్ ఎస్టేట్, మద్యం దందాల ఎదుగుదలతో మిలిటెంట్ల వ్యవస్థను మావోయిస్టు పార్టీ కోల్పోయింది. మైదాన ప్రాంతాల్లో తేరుకోలేని రీతిలో దెబ్బతిన్న మావోయిస్టులు ఆదివాసీల మధ్యన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని అటవీ ప్రాంతాల్లో విప్లవ పాఠాలు, పోరాటాలు నేర్చుకున్నారు. గ్రామ రాజ్య కమిటీల నిర్మాణంతో జనతన సర్కార్‌ను నడుపుతున్న మావోయిస్టు పార్టీని ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం మానవరహిత విమానాలను సైతం ప్రయోగించే దశలో ఉంది. ఇంతకుముందు రూ.10 లక్షల నుంచి పాతిక లక్షలకు పరిమితమైన నక్సలైట్ల పెద్ద‘తలలకు’ రివార్డులను ప్రకటించడంతో ఒక్కో కేంద్ర కమిటీ సభ్యుని తలపై రివార్డ్ రూ.కోటి దాటింది. పార్టీ కేంద్ర కమిటీ కార్యద ర్శి గణప తి తలకు వివిధ రాష్ట్రాలు, కేంద్ర దర్యా ప్తు సం స్థ కలిసి ఏకంగా రూ. 2.5 కోట్లు ప్రకటించాయి.