ఇస్లామాబాద్: ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో విజయం సాధించి, మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(71)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికార పత్రాల లీకేజీ కేసులో ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి మహ్మూద్ ఖురేషీకి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి అబ్దుల్ హస్నత్ మంగళవారం తీర్పు వెలువరించారు.
రావల్పిండిలోని అడియాలా జైలులో కేసు విచారణ జరిగింది. అవినీతి ఆరోపణలపై ఇప్పటికే ఇమ్రాన్ మూడేళ్ల జైలు శిక్ష అనుభవించారు. ఒకవైపు, ఆయన పార్టీ ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాట్‌ను వాడరాదంటూ ఎన్నికల సంఘం నిషేధం విధించగా మరోవైపు ఇమ్రాన్, ఖురేషిలతోపాటు పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతల నామినేషన్ పత్రాలు సైతం తిరస్కరణకు గురయ్యాయి. గత ఏడాది ఆగస్ట్‌లో తోషఖానా అవినీతి కేసును విచారించిన కోర్టు ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ 2022 మార్చి 7వ తేదీన జరిగిన బహిరంగ సభలో ఒక లెటర్‌ను ప్రజలకు చూపుతూ..తన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రాజకీయ విరోధులు ఓ విదేశంతో చేతులు కలిపారనేందుకు సాక్ష్యం ఇదేనని పేర్కొన్నారు.
ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అమెరికా ప్రభుత్వం తనపై కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అనంతరం ఆయన పదవీచ్యుతు డయ్యారు. పాక్ మాజీ రాయబారి అమెరికా ఉన్నతాధికారితో జరిపిన భేటీకి సంబంధించిన ఆ పత్రాన్ని ఇమ్రాన్ బహిరంగంగా చూపడాన్ని రహస్య పత్రాల లీకేజీ నేరంగా పేర్కొంటూ గత ఏడాది ఆగస్ట్‌లో ఇమ్రాన్‌తోపాటు అప్పటి విదేశాంగ మంత్రి ఖురేషిపై కేసు నమోదైంది. మరో 9 రోజుల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో ఇమ్రాన్, ఖురేషిలు జైలులోనే ఉన్నారు. తాజా తీర్పుతో వీరిద్దరూ అయిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment