Imran
-
ఇమ్రాన్‌కు పదేళ్ల జైలు
ఇస్లామాబాద్: ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో విజయం సాధించి, మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(71)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికార పత్రాల లీకేజీ కేసులో ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి మహ్మూద్ ఖురేషీకి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి అబ్దుల్ హస్నత్ మంగళవారం తీర్పు వెలువరించారు. రావల్పిండిలోని అడియాలా జైలులో కేసు విచారణ జరిగింది. అవినీతి ఆరోపణలపై ఇప్పటికే ఇమ్రాన్ మూడేళ్ల జైలు శిక్ష అనుభవించారు. ఒకవైపు, ఆయన పార్టీ ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాట్‌ను వాడరాదంటూ ఎన్నికల సంఘం నిషేధం విధించగా మరోవైపు ఇమ్రాన్, ఖురేషిలతోపాటు పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతల నామినేషన్ పత్రాలు సైతం తిరస్కరణకు గురయ్యాయి. గత ఏడాది ఆగస్ట్‌లో తోషఖానా అవినీతి కేసును విచారించిన కోర్టు ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ 2022 మార్చి 7వ తేదీన జరిగిన బహిరంగ సభలో ఒక లెటర్‌ను ప్రజలకు చూపుతూ..తన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రాజకీయ విరోధులు ఓ విదేశంతో చేతులు కలిపారనేందుకు సాక్ష్యం ఇదేనని పేర్కొన్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అమెరికా ప్రభుత్వం తనపై కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అనంతరం ఆయన పదవీచ్యుతు డయ్యారు. పాక్ మాజీ రాయబారి అమెరికా ఉన్నతాధికారితో జరిపిన భేటీకి సంబంధించిన ఆ పత్రాన్ని ఇమ్రాన్ బహిరంగంగా చూపడాన్ని రహస్య పత్రాల లీకేజీ నేరంగా పేర్కొంటూ గత ఏడాది ఆగస్ట్‌లో ఇమ్రాన్‌తోపాటు అప్పటి విదేశాంగ మంత్రి ఖురేషిపై కేసు నమోదైంది. మరో 9 రోజుల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో ఇమ్రాన్, ఖురేషిలు జైలులోనే ఉన్నారు. తాజా తీర్పుతో వీరిద్దరూ అయిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోనున్నారు. -
Asia Cup: ఓటమి భయం.. అందుకే రానంటున్నారు! అంత సీన్ లేదులే గానీ!
Asia Cup 2023- India Vs Pakistan: టీమిండియాను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నాజిర్ చేసిన వ్యాఖ్యలపై అభిమానులు మండిపడుతున్నారు. ఇష్టారీతిన మాట్లాడితే సహించేదిలేదని వార్నింగ్ ఇస్తున్నారు. ముందు పాక్ జట్టు పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలని, ఆత్మవిశ్వాసం ఉంటే పర్లేదని.. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదని హితవు పలుకుతున్నారు. కాగా ఆసియా కప్-2023 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా.. ఈ టోర్నీ ఆడేందుకు భారత జట్టు పాక్‌కు వెళ్లదని వ్యాఖ్యానించారు. దీంతో ఇరు బోర్డుల మధ్య ఈ అంశానికి సంబంధించి చర్చోపర్చలు జరిగాయి. సాకు మాత్రమే అంటూ ఈ నేపథ్యంలో ఆసియా కప్ పాక్‌లో నిర్వహించేందుకు అంగీకరించినప్పటికీ.. టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికపై నిర్వహించేందుకు ఏసీసీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇమ్రాన్ నాజిర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘‘భద్రతా కారణాలు అనేవి కేవలం ఓ సాకు మాత్రమే. ఆస్ట్రేలియా వంటి మేటి జట్లు కూడా పాకిస్తాన్‌కు వచ్చాయి. కానీ భారత జట్టు మాత్రం రావడానికి సాకులు వెదుకుతోంది. పాకిస్తాన్ గడ్డపై ఓడిపోతామనే భయంతోనే వాళ్లు ఇక్కడికి రావడం లేదు. ఇక్కడికి వచ్చి క్రికెట్ ఆడండి. అప్పుడేగా అన్నీ తెలుస్తాయి. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికులకు ఆసక్తి. కానీ టీమిండియాకు ఓటమిని తట్టుకునే శక్తి ఉండదు. అందుకే ఇలా చేస్తున్నారు’’ అని నాదిర్ అలీ పాడ్‌కాస్ట్ షోలో ఇమ్రాన్ వ్యాఖ్యానించాడు. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఇమ్రాన్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ‘‘అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. గతంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ అప్పటికప్పుడు సిరీస్‌లు రద్దు చేసుకున్న విషయం గుర్తులేదా? టీమిండియా వంటి పటిష్ట జట్టు గురించి ఇలాంటి అవాకులు చెవాకులు పేలేముందు ఓసారి ఆలోచించుకుంటే మంచిది. మీ స్థాయి ఏమిటో మర్చిపోవద్దు. మీకంత సీన్ లేదు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి’’ అంటూ హితవు పలుకుతున్నారు. కాగా ఆసియా కప్-2023 పాక్‌లో జరుగనుండగా.. వన్డే వరల్డ్‌కప్-2023 భారత్‌లో నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్ వలలో చిక్కుకున్న బ్రిటన్ ప్రధాని! Suryakumar Yadav: ఈ మూడు మ్యాచ్‌లను మర్చిపో సూర్య.. ఐపీఎల్లో బాగా ఆడు! -
చాంపియన్ ఇమ్రాన్
సాక్షి, హైదరాబాద్: జి. వెంకటస్వామి స్మారక ఆలిండియా బిలో 1500 ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ మొహమ్మద్ ఇమ్రాన్ విజేతగా నిలిచాడు. ఉప్పల్‌లో జరిగిన ఈ టోర్నీ తొమ్మిదో రౌండ్లో రోహిత్ (7 పాయింట్లు, మధ్యప్రదేశ్)పై ఇమ్రాన్ విజయం సాధించి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇమ్రాన్‌కు ట్రోఫీతో పాటు రూ. 50 వేల నగదు బహుమతి లభించింది. సిద్దిఖ్ అక్బర్ (తమిళనాడు) 8 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచి రూ. 30 వేల నగదు బహుమతిని సొంతం చేసుకున్నాడు. తృతీయ స్థానంలో నిలిచిన షేక్ అబ్దుల్ నబీ (8 పాయింట్లు, ఆంధ్రప్రదేశ్)కు రూ. 20 వేలు లభించాయి. సాయికాంత్ (7.5, ఆంధ్రప్రదేశ్), ఆనంద్‌బాబు (7, తమిళనాడు), తిరుపతి చారి (7, తెలంగాణ), రోహిత్ (7, మధ్యప్రదేశ్), శ్రీనాథ్ (7, తమిళనాడు), విష్ణు రామ్ (7 తమిళనాడు), శ్యామ్‌సుందర్ (7, ఆంధ్రప్రదేశ్) ఆ తర్వాతి స్థానాలు దక్కించుకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో రాష్ట్ర చెస్ సంఘం కార్యదర్శి కేఎస్ ప్రసాద్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. -
ఖైదు లోంచి ఖైదు లోకి...
జైలు నుంచి తప్పించుకునే ప్రణాళికలు వేస్తుండగానే, ఇమ్రాన్‌ను పుస్తకాలకి అట్టలు వేసే పనిలో నియమిస్తారు జైలు అధికారులు. వాటి ఖాళీ పేజీలని ఒక నోట్బుక్గా కుట్టి, తన ఊరి గురించీ, దానికీ మెహెందీకీ ఉన్న వైరానికున్న మూల కారణాల గురించీ రాసుకుంటాడు పుస్తకాలని అసహ్యించుకునే ఇమ్రాన్. ‘భారతదేశపు ప్రతి పట్టణంలోనూ ఒక చిన్న పాకిస్తాన్ ఉంది’ అన్న మాటలు, ‘వ్యానిటీ బాగ్’ నవల అట్టమీద ఉన్నవి. దీని కథానాయకుడైన ఇమ్రాన్ జైల్లో కూర్చుని, గడిచిన తన జీవితాన్ని గుర్తు చేసుకుంటుంటాడు. కాల్పనిక ‘మ్యాంగో బాగ్’ అనే ఊర్లో ‘మెహెందీ’ ప్రాంతంలో హిందువులుంటే, ‘వ్యానిటీ బాగ్’ అధికంగా ముస్లిములూ, కొద్దిపాటి క్రైస్తవ కుటుంబాలూ ఉండే ప్రదేశం. ‘పాకిస్తాన్లో ప్రసిద్ధికెక్కిన ధనవంతుల పేర్లు పెట్టుకోవడం మాకు అలవాటే’ అంటాడు పాకిస్తానీ క్రికెటర్ పేరున్న ఇమ్రాన్ జబ్బారీ. మెహెందీ వాసులు వీళ్ళ ప్రాంతాన్ని ‘లిటిల్ పాకిస్తాన్’ అని పిలుస్తారు. జీవితంలో ఒక లక్ష్యం అంటూ లేకుండా, బలాదూరుగా తిరుగుతూ సామాన్యమైన జీవితాలు గడుపుతూనే, పరపతి గణిద్దామనుకునే యువకులు ఏర్పరుచుకున్న, ‘5బి పురుషులు’ అన్న గ్యాంగులో ఇమ్రాన్ చేరతాడు. ‘బి’కి కారణం వారిలో ఒకరైన యాహ్యా వినలేకపోవడం, మాట్లాడలేకపోవడం. ఒకరోజు దొంగిలించబడిన స్కూటర్లని పట్టణం నలుమూలలకీ తీసుకెళ్ళి వదిలేసే పని దొరుకుతుంది వీరికి. ఇమ్రాన్ ఆ పని ముగించిన కొంతసేపటికే, స్కూటర్లో ఉన్న బాంబులు పేలి, మ్యాంగో బాగ్ పౌరులని గాయాలపాలు చేస్తాయి. అప్పుడు కానీ తను తీవ్రవాద చర్యలో పాలు పంచుకున్నానని ఇమ్రాన్ గుర్తించడు. 14 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది. జైలు నుంచి తప్పించుకునే ప్రణాళికలు వేస్తుండగానే, అతన్ని పుస్తకాలకి అట్టలు వేసే పనిలో నియమిస్తారు జైలు అధికారులు. వాటి ఖాళీ పేజీలని ఒక నోట్బుక్గా కుట్టి, తన ఊరి గురించీ, దానికీ మెహెందీకీ ఉన్న వైరానికున్న మూల కారణాల గురించీ రాసుకుంటాడు పుస్తకాలని అసహ్యించుకునే ఇమ్రాన్. బయటి లోకంతో అతనికుండే ఒకే సంబంధం ప్రతీ నెలా కొడుకుని కలుసుకునేటందుకు జైలుకొచ్చే అతని తల్లి. ఊర్లో జరిగే సంగతులన్నీ కొడుక్కి చెప్తూ ఉంటుంది. ఆమె రావడం ఆగిపోయిన మూడు నెలలకి తండ్రి వచ్చి, తల్లి మరణించిందని చెప్తాడు. రచయిత అనీస్ సలీమ్, ఇమ్రాన్ పట్ల జాలి కలిగించే ప్రయత్నం చేయరు. ఎవరినీ జడ్జ్ చేయరు. ఏ సెంటిమెంటూ చూపించకుండా, అగౌరవమైన మాటలని కూడా సులభంగా వాడతారు. ఒంటరితనాన్నీ, వ్య«థనీ, నిరాశనీ హాస్యరూపంలో వ్యక్తీకరిస్తారు. నీతులు చెప్పకుండా కథనాన్ని నిర్లిప్తంగా కొనసాగిస్తారు. నవల మధ్యలో అనేకమైన కోట్స్ ఉంటాయి: ‘కథలల్లడం, ప్రతిదానికీ పేరు పెట్టడం అంటే మొహల్లావారికి ఎంత పిచ్చంటే, సరిగ్గా మసీదు ఎదురుగానే ఉన్న చెట్టుని కూడా వదలక, దాన్ని ‘ఫ్రాంక్లిన్ అని పిలుస్తారు. అదేదో క్రైస్తవ తల్లీతండ్రీకి పుట్టి, గరాజిలో పని చేసే పింటోస్తో పాటు సెయింట్ థామస్ చర్చికి ఆదివారాలు వెళ్తున్నట్టు’. దేశంలో సరైన చదువు, ఉద్యోగం లేకపోయిన యువకులు గడిపే జీవన విధానాన్నీ, దాన్ని తప్పించుకునే దారి వారికి లేకపోవడం గురించీ రాస్తారు సలీమ్. ప్రత్యేకంగా– మైనారిటీ వర్గాల ఆశలు, నిష్ఫలమైన నిరాశలుగా మారడం గురించి వర్ణిస్తారు. ‘నవల ఆశ గురించినది కాదు. నైరాశ్యం గురించినది. మానవత్వాన్ని విభజించగల మతపరమైన అసహనం, ఎన్నికల్లో నెగ్గడం గురించినది’ అంటారు కేరళకు చెందిన సలీమ్. 2013లో ‘హిందూ ప్రైజ్ ఫర్ బెస్ట్ ఫిక్షన్’ అవార్డు పొందిన ఈ నవలని పికడొర్ ఇండియా పబ్లిష్ చేసింది. -కృష్ణ వేణి -
పోలీసుస్టేషన్లో దుప్పటి పంచాయితీ!
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం అనంతపురం సెంట్రల్ : పోలీసుల దుప్పటి పంచాయితీతో తనకు అన్యాయం జరిగిందని పామిడికి చెందిన నూర్‌బాషా మనస్తాపంతో అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... నూర్‌బాషా కటిక వ్యాపారంలో మధ్యవర్తిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇమ్రాన్ అనే వ్యక్తితో కలిసి రకరకాల వ్యాపారాలు చేశాడు. ఇటీవల ఇమ్రాన్ 20 దున్నపోతులు విక్రయించు అని నూర్‌బాషాకు అప్పగించాడు. వీటిని రూ. 4లక్షలకు విక్రయించాడు. నూర్‌బాషాకు గతంలో ఇమ్రాన్ కొంతమొత్తం బాకీ ఉన్నాడు. దాన్ని పట్టుకుని మిగతా రూ.2లక్షల మేర ఇస్తానని చెప్పడంతో ఈ వ్యవహారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. రెండు రోజులుగా స్టేషన్లో పంచాయితీ జరుగుతోంది. పోలీసులు మాత్రం రూ. 3లక్షలు ఇవ్వాల్సిందేనని పంచాయితీ చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని నూర్‌బాషా బుధవారం ఉదయం పురుగుమందు తాగి పోలీస్‌స్టేషన్‌లోనే కుప్పకూలిపోయాడు. బంధువులు వెంటనే నగరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. -
గేదెను చంపారని గోరక్షకుల దాడి
అలీగఢ్: గేదెను చంపారంటూ ఐదుగురిపై గోరక్షకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చోటుచేసుకుంది. పన్నా గంజ్‌కు చెందిన కాలూ బాఘేల్ అనే వ్యక్తి తన డెయిరీలోని వట్టిపోయిన ఒక గేదెను ఇమ్రాన్ అనే పశువుల వ్యాపారికి అమ్మాడు. దాన్ని కాలూ డెయిరీలోనే వధించేలా ఒప్పందం కుదిరింది. ఇమ్రాన్, మరో నలుగురు గేదెను వధిస్తుండగా రక్తం డెయిరీ గేటు బయటికి ప్రవహించింది. దీంతో గోరక్షకులతోపాటు పలువురు డెయిరీలోకి చొరబడి ఇమ్రాన్ బృందంపై దాడి చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు గేదెను అక్రమంగా చంపినందుకు ఇమ్రాన్ బృందంతోపాటు డెయిరీ యజమానిని కూడా అరెస్టు చేశారు. -
బస్టాండ్‌లో సమస్యలు తిష్ట
► పనిచేయని మరుగుదొడ్లు ► బహిరంగ మలవిసర్జన ► పందుల స్వైరవిహారం ► పట్టించుకోని ఆర్టీసీ అధికారులు ఎల్లారెడ్డిపేట: నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులతో కిటకిటలాడే ఆర్టీసీ బస్టాండ్‌లో సమస్యలు తిష్ట వేశాయి. ఏళ్ల తరబడి బస్టాండ్ ప్రాంగణం, ఆవరణలో సమస్యలతో ప్రయాణికులు సతమతమవుతున్నా ఆర్టీసీ అధికారులకు పట్టింపు లేదు. సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై ఉన్న ఈబస్టాండ్లోకి ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, కోనరావుపేట మండలాలతో పాటు వివిధ జిల్లాలు, రాష్ట్ర రాజధానికి నిత్యం ఆర్టీసీ బస్సులు రాకపోకలు జరుగుతున్నాయి. ప్రయాణికులు బస్సుల కోసం రోడ్డుపై నిరీక్షించడం బాధాకరం. పలుసార్లు బస్టాండ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులు చేసిన విజ్ఞప్తులను అధికారులు, నాయకులు పట్టించుకోలేదు. ఫలితంగా ప్రయాణికులు ఇప్పటికీ అవే ఇబ్బందులతో నిత్యం ప్రయాణాలు చేస్తున్నారు. నిరూపయోగంగా మరుగుదొడ్లు బస్టాండ్ ప్రాంగణంలో మరుగుదొడ్లు నిరూపయోగంగా మారడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినిలు కనీసం మూత్ర విసర్జన చేసే పరిస్థితి లేకపోవడంతో గంటల తరబడి ఊపిరి బిగబట్టి బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. పురుషులు మరోదారి లేక బహిరంగ మలవిసర్జన చేయడంతో ఆప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతోంది. అంతేకాకుండా పందులు ప్రయాణికుల మధ్యనే తిరుగుతుండడం, బస్టాండ్ వెనుకాల గల ప్రాంతాన్ని కనీసం శుభ్రం చేయకపోవడంతో భయంకరమైన వాసన వెదజల్లుతోంది. దీంతో ప్రయాణికులు బస్సుల కోసం రోడ్డుపైకి వస్తున్నారు. బస్టాండ్‌లో కంట్రోలర్ లేకపోవడం ఒకటైతే, కూర్చోడానికి కనీస సదుపాయాలు కూడా లేవు. తాగునీరు అందించడానికి ఒక్క బోరు కూడా లేకపోగా మంచినీళ్ల కోసం హోటళ్లకు పరుగులు తీస్తున్నారు. సమస్యల బస్టాండ్‌ను అధికారులు పట్టించుకొని ప్రయాణికులను ఇబ్బందుల నుంచి తొలగించి అన్ని వసతులు కల్పించాలని కోరుతున్నారు. వాసనతో ఇబ్బంది బహిరంగ మలవిసర్జనతో దుర్గంధం వెదజల్లుతోంది. మూత్రశాలలు పనిచేయకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. పేరుకే పెద్ద బస్టాండ్‌గా మిగిలిపోయింది. సమస్యలను పరిష్కరించి కంట్రోలర్‌ను నియమిస్తే నిరక్షరాస్యులకు బస్సు ఎటు వెళ్తుందో తెలుస్తుంది –బండారి లక్ష్మి, వ్యాపారి, ఎల్లారెడ్డిపేట నీటి వసతి కల్పించాలి బస్టాండ్‌లో మరుగుదొడ్లకు నీటి వసతి కల్పించి వినియోగంలోకి తేవాలి. విద్యార్థినిలు మరుగుదొడ్లు లేక అనేక ఇబ్బందులకు లోనవుతున్నారు. బస్టాండ్ ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్తను వారం వారం తొలగించాలి. ప్రయాణికులు కూర్చోవడానికి ప్రత్యేక వసతులు కల్పించాలి. –యండీ. ఇమ్రాన్, ఎల్లారెడ్డిపేట -
అమ్మా.. నాన్న పోదాం..పా..!
పలువురి హృదయాలను ద్రవింపజేసిన చిన్నారి పిలుపు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం తాళ్లగడ్డకు చెందిన చేపలు పట్టే యువకుడు ఏకాలపు శ్రీను (27) సోమవారం రాత్రి బంగారు గడ్డకు చెందిన ఇమ్రాన్ చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. శ్రీను మృతదేహానికి పోస్టుమార్టం చేయించేందుకు పోలీసులు ఇచ్చే పంచనామా రిపోర్టు కోసం అతడి కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం వన్‌టౌన్ పోలీ స్టేషన్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో శ్రీను భార్య భాగ్యలక్ష్మి చిన్నారులైన ఇద్దరు ఆడపిల్లలు పల్లవి, నిత్యలను పట్టుకుని వేపచెట్టు కింద కూర్చొని కన్నీరు పెట్టుకుంటోంది. ఈ క్రమంలో శ్రీను పెద్ద కుమార్తె అమ్మా నాన్న పోదాం.. పా..అమ్మా.. అని అనడం అక్కడున్న వారందరి హృదయాలను ద్రవింపజేసింది. - మిర్యాలగూడ టౌన్ -
కిడ్నాప్ సుఖాంతం
అనంతపురంలో అపహరించి.. పెనుకొండలో వదిలేసిన యువతి ఇరుగు పొరుగు కుటుంబాల మధ్య మనస్పర్థలే కారణం పోలీసుల చొరవతో తల్లిదండ్రుల చెంతకు బాలుడు యువతిపై కేసు నమోదు అనంతపురంలో కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతమైంది. ఇరుగు పొరుగు కుటుంబాల వారి మధ్య ఉన్న మనస్పర్ధల కారణంగా అభం శుభం తెలియని మూడేళ్ల బాలుడిని ఓ యువతి కిడ్నాప్ చేసినట్లు తేలింది. పోలీసుల చొరవతో బాలుడు తల్లిదండ్రుల చెంతకు చేరాడు. బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురం వన్‌టౌన్ సీఐ రాఘవన్ సోమవారం మీడియాకు వెల్లడించారు. మున్నానగర్‌లో నివాసముంటున్న మహబూబ్‌బాషాతో పొరుగింటి వారికి కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. దీన్ని మనసులో పెట్టుకున్న పొరుగింటి యువతి మహబూబ్‌బాషా, ఆయేషా దంపతుల కుమారుడు ఇమ్రాన్ (3)ను ఆదివారం కిడ్నాప్ చేసింది. ఎవరి కంటా పడకుండా తీసుకుపోయి పెనుకొండలో వదిలిసేంది. సాయంత్ర వరకు తల్లిదండ్రులు ఎంత గాలించినా బాలుడి ఆచూకీ తెలియలేదు. దీంతో బాలుడు తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ‘మాయమైన మూడేళ్ల బాలుడు’ అన్న శీర్షికన సాక్షి పత్రికలో ఫొటోతో సహా ప్రచురితమైంది. కిడ్నాప్ చేసిన యువతి ఆ బాలుడిని తీసుకొని బస్టాండ్‌కు ఆటోలో వెల్లింది. ఉదయాన్నే పత్రికల్లో చదివిన ఆటో డ్రైవర్ సదురు బాలుడిని ఓ యువతి తీసుకెళ్లి్లందని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అదే సమయంలో పెనుకొండలో బాలుడిని చేరదీసిన స్థానికులు ఉదయాన్నే ఇమ్రాన్ ఫొటో చూసి పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి ఇమ్రాన్‌ను సురక్షితంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు వివరాలు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. చిన్నారి పట్ల కర్కశంగా వ్యవహరించిన యువతిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ రాఘవన్ తెలిపారు. -
మూడేళ్ల బాలుడి అదృశ్యం
అనంతపురం సెంట్రల్ : అంనతపురం పాతూరులోని మున్నానగర్‌కు చెందిన ఆయేషా, మహబూబ్‌బాషా దంపతుల కుమారుడు ఇమ్రాన్(3) ఆదివారం అదృశ్యమయ్యాడు. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటి నుంచి బయట ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. సాయంత్రం వరకు ఆచూకీ దొరక్కపోవడంతో వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐలు రమణ, నాగమధు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏటీఎంల్లో 100 మందిని మోసం చేశాడు
న్యూఢిల్లీ: ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు విత్ డ్రా చేసేందుకు ఖాతాదారులకు సాయపడుతున్నట్టుగా నటిస్తూ వందమందిని మోసం చేసి వారి నుంచి డబ్బు కాజేసిన ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని హరియాణాలోని పల్వాల్‌కు చెందిన ఇమ్రాన్ (25)గా గుర్తించారు. ఇమ్రాన్ స్వగ్రామానికి చెందినవారితో ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని, సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎమ్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడ్డాడని క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ రవీంద్ర యాదవ్ చెప్పారు. ఇమ్రాన్ గ్యాంగ్ ఢిల్లీలో 100 మందికి పైగా ఏటీఎమ్ ఖాతాదారులను మోసం చేసిందని తెలిపారు. ఇతర నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. 'ఎటీఎం కేంద్రంలో ఓ ఖాతాదారుడు వెళ్లినపుడు ఇమ్రాన్ ముఠా సభ్యుడు కూడా వెళ్లి అతని సమీపంలో ఉండేవాడు. ఏటీఎం ఖాతాదారు నగదు విత్ డ్రా చేసేందుకు మొత్తాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇమ్రాన్ ముఠా సభ్యుడు అతని దృష్టి మళ్లించి క్లియర్ బటన్ నొక్కేవాడు. దీంతో ఏటీఎం నుంచి డబ్బు వచ్చేదికాదు. ఆ సమయంలో ఇమ్రాన్ ముఠా సభ్యుడు మరొకడు వచ్చి ఏటీఎం పనిచేయడం లేదని చెబుతాడు. ఖాతాదారు ట్రాన్సాక్షన్‌ను క్యాన్సిల్ చేయకుండా ఏటీఎం కేంద్రం నుంచి బయటకు వెళ్లాక, నిందితుడు అతని ఎకౌంట్ నుంచి డబ్బులు కాజేసేవాడు. కొన్నిసార్లు రహస్యంగా ఏటీఎమ్ నెంబర్‌ను గుర్తించి, ఆ తర్వాత ఏటీఎం కార్డులను మార్చడం ద్వారా మోసాలకు పాల్పడేవారు' అని రవీంద్ర యాదవ్ చెప్పారు. -
తండ్రి మందలిస్తాడని ఆత్మహత్య
ఖమ్మం : పొలంలో బోరు మోటారు కాలిపోగా తండ్రి మందలిస్తాడనే భయంతో ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం రూరల్ మండలం గొల్లపాడు గ్రామానికి చెందిన మీరా, ముంతాజ్ దంపతుల కుమారుడు ఇమ్రాన్(21) ఇంటర్ వరకు చదువుకుని తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. బుధవారం రాత్రి పొలంలో బోరు మోటారు ఆన్ చేయటానికి వెళ్లాడు. చిన్న పొరపాటు కారణంగా మోటారు కాలిపోయింది. దీంతో తండ్రి మందలిస్తాడేమోనని, ఇమ్రాన్ భయపడ్డాడు. అక్కడే ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం కూడా ఇమ్రాన్ ఇంటికి రాకపోయేసరికి మీరా పొలానికి వెళ్లి చూడగా ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. దీంతో ఇమ్రాన్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
చిన్నారికి పెద్ద కష్టం..!
డోన్ రూరల్: ఆ పసిబాలుడికి పెద్ద కష్టమొచ్చింది. ఏడు నెలలు నిండని వయసులో విధిని ఎదిరించి పోరాటం చేస్తున్నాడు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న బిడ్డను బతికించుకునేందుకు తల్లిదండ్రులు పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. ఇప్పటికే లక్షల రూపాయలు ఖర్చు చేసినా ప్రయోజనం లేకపోవడంతో వారు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. డోన్ మండలం యు. కొత్తపల్లె గ్రామానికి చెందిన జరీనాకు అదే గ్రామానికి చెందిన హుసేన్‌బాషాతో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లయినా మూడేళ్ల తర్వాత ఆమెకు మగపిల్లాడు పుట్టాడు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే వారిని విధి చిన్నచూపు చూసింది. ఏడునెలల ఇమ్రాన్‌కు అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రిలో చూపించారు. చిన్నారిని పరిశీలించిన వైద్యులు చిన్నారికి కాలేయ వ్యాధి ఉందని చెప్పారు. దీంతో వారు జబ్బు నయం కోసం రూ. 3 లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా నయం కాలేదు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో, కర్నూలులోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చిన్నారిని చూపించగా రూ. 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని.. ఈ ఆపరేషన్ కూడా 16 రోజులలోనే చేయాలని వైద్యులు చెప్పారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు: హుసేన్‌బాషా, జరీనాలది నిరుపేద కుటుంబం. కూలీనాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమారుడి జబ్బు నయం కోసం అందిన చోటల్లా అప్పులు చేశారు. అయినా జబ్బు నయం కాలేదు. అయితే ఇప్పుడు రూ. 30 లక్షలు అవుతుందని చెప్పడంతో తల్లిదండ్రుల పరిస్థితి దిక్కుతోచని పరిస్థితిగా తయారైంది. ఆరోగ్యశ్రీ పథకం వర్తించదని చెప్పడంతో వారికి దిక్కుతోచడం లేదు. మూడేళ్లతర్వాత పుట్టిన కుమారుడిని రక్షించుకోలేక ఆత ల్లిదండ్రులు పడుతున్న ఆవేదన అందరినీ కలిచివేస్తోంది. ఎవరైనా దాతలు ముందుకొచ్చి తన కుమారుడిని రక్షిస్తే జీవితాంతం వారికి రుణపడి ఉంటామని ఆ తల్లిదండ్రులు కన్నీటితో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలెవరైనా ఉంటే సెల్: 9959277796కు ఫోన్ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.