ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నూర్‌బాషా
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
అనంతపురం సెంట్రల్ : పోలీసుల దుప్పటి పంచాయితీతో తనకు అన్యాయం జరిగిందని పామిడికి చెందిన నూర్‌బాషా మనస్తాపంతో అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... నూర్‌బాషా కటిక వ్యాపారంలో మధ్యవర్తిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇమ్రాన్ అనే వ్యక్తితో కలిసి రకరకాల వ్యాపారాలు చేశాడు. ఇటీవల ఇమ్రాన్ 20 దున్నపోతులు విక్రయించు అని నూర్‌బాషాకు అప్పగించాడు. వీటిని రూ. 4లక్షలకు విక్రయించాడు. నూర్‌బాషాకు గతంలో ఇమ్రాన్ కొంతమొత్తం బాకీ ఉన్నాడు.
దాన్ని పట్టుకుని మిగతా రూ.2లక్షల మేర ఇస్తానని చెప్పడంతో ఈ వ్యవహారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. రెండు రోజులుగా స్టేషన్‌లో పంచాయితీ జరుగుతోంది. పోలీసులు మాత్రం రూ. 3లక్షలు ఇవ్వాల్సిందేనని పంచాయితీ చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని నూర్‌బాషా బుధవారం ఉదయం పురుగుమందు తాగి పోలీస్‌స్టేషన్‌లోనే కుప్పకూలిపోయాడు. బంధువులు వెంటనే నగరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నాడు.