బస్టాండ్‌లో సమస్యలు తిష్ట
► పనిచేయని మరుగుదొడ్లు
► బహిరంగ మలవిసర్జన
► పందుల స్వైరవిహారం
► పట్టించుకోని ఆర్టీసీ అధికారులు
ఎల్లారెడ్డిపేట: నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులతో కిటకిటలాడే ఆర్టీసీ బస్టాండ్‌లో సమస్యలు తిష్ట వేశాయి. ఏళ్ల తరబడి బస్టాండ్ ప్రాంగణం, ఆవరణలో సమస్యలతో ప్రయాణికులు సతమతమవుతున్నా ఆర్టీసీ అధికారులకు పట్టింపు లేదు. సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై ఉన్న ఈబస్టాండ్‌లోకి ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, కోనరావుపేట మండలాలతో పాటు వివిధ జిల్లాలు, రాష్ట్ర రాజధానికి నిత్యం ఆర్టీసీ బస్సులు రాకపోకలు జరుగుతున్నాయి. ప్రయాణికులు బస్సుల కోసం రోడ్డుపై నిరీక్షించడం బాధాకరం. పలుసార్లు బస్టాండ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులు చేసిన విజ్ఞప్తులను అధికారులు, నాయకులు పట్టించుకోలేదు. ఫలితంగా ప్రయాణికులు ఇప్పటికీ అవే ఇబ్బందులతో నిత్యం ప్రయాణాలు చేస్తున్నారు.
నిరూపయోగంగా మరుగుదొడ్లు
బస్టాండ్ ప్రాంగణంలో మరుగుదొడ్లు నిరూపయోగంగా మారడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినిలు కనీసం మూత్ర విసర్జన చేసే పరిస్థితి లేకపోవడంతో గంటల తరబడి ఊపిరి బిగబట్టి బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. పురుషులు మరోదారి లేక బహిరంగ మలవిసర్జన చేయడంతో ఆప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతోంది. అంతేకాకుండా పందులు ప్రయాణికుల మధ్యనే తిరుగుతుండడం, బస్టాండ్ వెనుకాల గల ప్రాంతాన్ని కనీసం శుభ్రం చేయకపోవడంతో భయంకరమైన వాసన వెదజల్లుతోంది.
దీంతో ప్రయాణికులు బస్సుల కోసం రోడ్డుపైకి వస్తున్నారు. బస్టాండ్‌లో కంట్రోలర్ లేకపోవడం ఒకటైతే, కూర్చోడానికి కనీస సదుపాయాలు కూడా లేవు. తాగునీరు అందించడానికి ఒక్క బోరు కూడా లేకపోగా మంచినీళ్ల కోసం హోటళ్లకు పరుగులు తీస్తున్నారు. సమస్యల బస్టాండ్‌ను అధికారులు పట్టించుకొని ప్రయాణికులను ఇబ్బందుల నుంచి తొలగించి అన్ని వసతులు కల్పించాలని కోరుతున్నారు.
వాసనతో ఇబ్బంది
బహిరంగ మలవిసర్జనతో దుర్గంధం వెదజల్లుతోంది. మూత్రశాలలు పనిచేయకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. పేరుకే పెద్ద బస్టాండ్‌గా మిగిలిపోయింది. సమస్యలను పరిష్కరించి కంట్రోలర్‌ను నియమిస్తే నిరక్షరాస్యులకు బస్సు ఎటు వెళ్తుందో తెలుస్తుంది –బండారి లక్ష్మి, వ్యాపారి, ఎల్లారెడ్డిపేట
నీటి వసతి కల్పించాలి
బస్టాండ్‌లో మరుగుదొడ్లకు నీటి వసతి కల్పించి వినియోగంలోకి తేవాలి. విద్యార్థినిలు మరుగుదొడ్లు లేక అనేక ఇబ్బందులకు లోనవుతున్నారు. బస్టాండ్ ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్తను వారం వారం తొలగించాలి. ప్రయాణికులు కూర్చోవడానికి ప్రత్యేక వసతులు కల్పించాలి. –యండీ. ఇమ్రాన్, ఎల్లారెడ్డిపేట