‘కండువా మార్చాడు’.. పార్టీ మారితే సాధారణంగా వినిపించే మాటిది. ఒక లీడర్ పార్టీ మారితే అతని వెంట పదులు, వందల సంఖ్యలో వెళ్తారు. వాళ్లంతా కండువాలు మార్చుకోవాల్సిందే. పైకి కనిపించకపోయినా ఈ ఖర్చు ఎక్కువే అంటున్నారు నేతలు. ఆ పార్టీ..ఈ పార్టీ అనే తేడా లేకుండా ప్రతీ నియోజకవర్గంలోనూ ఎన్నికలప్పుడు వీటి అవసరం భారీగానే ఉంటోంది. నియోజకవర్గానికి ఈ ఖర్చు రూ.లక్షల్లోనే ఉంటుంది.
సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వరకూ..
కండువాల తయారీకి ప్రసిద్ధి సిరిసిల్ల. ఈ ప్రాంతంలో 25 కుటుంబాలు ఇదే పనిలో ఉన్నాయి. ఇప్పుడు ఇంతకు మించి హైదరాబాద్‌లో ఎక్కువగా తయారీ అవుతున్నాయని సిరిసిల్ల నేత కార్మికులు చెబుతున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఆర్డర్లు రావడంతో నేత కార్మికులు హైదరాబాద్‌లో ప్రింటింగ్ చేయాల్సి వస్తోంది. నేతలు కూడా అనేక రకాలను కోరుకుంటున్నారు.
కండువాపై పార్టీ నేతలు, లేదా తన కేడర్‌తో పార్టీ మారాలనుకునే వారి ఫొటోలతో కండువాలు ముద్రించాలని కోరుతున్నారు. ఇందుకు కొంత నాణ్యత అవసరమని, దీనికోసం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోందని సిరిసిల్లకు చెందిన భూపాల్ తెలిపారు. ఒక్కో కండువా తయారీకి రూ.3 ఖర్చు అవుతోందని, తాము రూ. 3.50కు అమ్ముతున్నామని తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలోనూ దాదాపు లక్ష కండువాలు అవసరమయ్యే వీలుందని అంచనా వేస్తున్నారు. ఈమేరకు ముందుగా ఏ పార్టీ గుర్తు లేకుండా తయారు చేస్తున్నట్టు నేత కార్మికుడు నీరజ్ తెలిపారు.
కండువాకూ కోడ్ కష్టాలు..
కండువాకూ ఎన్నికల కోడ్ ఇబ్బందులు తప్పడం లేదని తయారీదారులు చెబుతున్నారు. ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి తరలించే క్రమంలో కండువాలకు బిల్లులు అడుగుతున్నారని చెప్పారు. బిల్లులు లేకుండా తీసుకెళ్లడం కష్టమని రాజకీయ నేతలంటుంటే... ఈ మొత్తం అక్కౌంట్స్‌లో జమ చేస్తే ఎన్నికల సమయంలో ఇతరత్రా కష్టాలు వస్తాయని నేత కార్మికులు అంటున్నారు.
ఇక కండువాలకు అవసరమైన సిల్క్, పాలిస్టర్ వ్రస్తాన్ని తీసుకురావడానికి కూడా ఇబ్బందులు వస్తున్నాయని తయారీదారులు తెలిపారు. పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లకుండా, అనేక మార్గాల్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని హైదరాబాద్‌కు చెందిన కండువాల తయారీదారు సంజయ్‌గుప్తా తెలిపారు.
ఆర్డర్లే కాదు... ఇబ్బందులూ ఉన్నాయి
తెలంగాణ నుంచే కాదు... ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. దీనికోసం కార్మికులను ఎక్కువ సంఖ్యలో నియమించుకోవాల్సి వస్తోంది. ఇదే తరుణంలో ఎన్నికల సమయం కావడంతో కార్మికులు ఎక్కువ అడుగుతున్నారు. కొన్నిసార్లు వారు దొరికే పరిస్థితీ లేదు. నేతలు బిల్లులు కోరడం కూడా వ్యాపారానికి ఇబ్బందిగానే ఉంది. నగదు బదిలీ కష్టమవుతోంది. అయితే కండువాల వల్ల చాలామందికి ఉపాధి మాత్రం లభిస్తోంది. – ద్యావనపల్లి మురళి (కండువాల వ్యాపారి, సిరిసిల్ల)
Comments
Please login to add a commentAdd a comment